Saturday 18 January 2014

జీవితం అంటే సినిమాలు మాత్రమే కాదు!

"ఇవాళ ఒక్క ఉదయ్ కిరణ్ మాత్రమే కాదు. ఎంతో మంది సినిమాలు మాత్రమే జీవితం అనుకుంటున్నారు. సినిమా కోసం....సినిమాల్లో నటించేందుకోసం.....దేనికైనా సిద్దపడుతున్నారు. ఆఖరికి చావడానికైనా..., బహుశా ఇటువంటి పరిస్థితి మన దగ్గర తప్ప మరెక్కడా ఉండదేమో. 
మిగతా దేశాల్లో సినిమాను ఓ ప్రొఫెషన్ లాగానే చూస్తారు. మన దగ్గర మాత్రం...సినిమా పరిశ్రమను వేరే లోకంగా భావిస్తారు. సినిమా మనుషులంటే దేవతలో...మరో గ్రహం మానవులో అనుకుంటారు.
 

సినిమా థియేటర్ లేని దేశాలు చాలా ఉన్నాయన్న సంగతి, అవి అభివృద్ధిలోనూ ముందుగా ఉన్నాయన్న సంగతి...సాంస్కృతికంగా బలంగా ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలీదు. అంతేకాదు, సోమవారం, మంగళవారం లాంటి పనిదినాల్లో కూడా.....ఉదయం పదకొండు గంటలకే సినిమా థియేటర్ల ముందు క్యూలు కట్టే జనం ఉంటారని తెలిసి ఆ దేశాల ప్రజలు ఆశ్చర్యపోతారు కూడా. 


ఒక నాటకం, ఒక ప్రదర్శన, లేదా ఇతర కళారూపాలు ఎలాంటివో సినిమా కూడా అలాంటిదేనన్న వాస్తవం గుర్తించాలి. సినిమాలో అవకాశాలు రాకపోయినంత మాత్రాన పోయిందేమీ లేదని యువతరం గుర్తించాలి."

^^^
పైన కోట్ చేసిన పది వాక్యాలు నేను రాసినవి కాదు. "అస్తమించిన ఉదయకిరణం.." పేరుతో నేను రాసిన బ్లాగ్ పోస్ట్‌కి చందు తులసి స్పందన. 

సినిమాలు, సినిమావాళ్లు అంటూ వేరే లోకం ఇప్పుడు ఏదీ లేదు. అందరూ ఒక్కటే. అందర్లాగే సినిమావాళ్లూ వారికి నచ్చిన ఒక ప్రొఫెషన్లో ఉన్నారు అనుకుంటే గొడవేలేదు. 

అయితే, మిగిలిన అన్ని ప్రొఫెషన్లకూ, సినిమాకూ ఉన్న తేడా ఒక్కటే. 

సినిమాకు ప్రత్యేకమైన ఆకర్షణ ఒకటుంది. సెలబ్రిటీ స్టేటస్! 

మిగిలిన అన్ని ప్రొఫెషన్లలోనూ డబ్బు సంపాదించవచ్చు. కొన్నిట్లో పేరు కూడా సంపాదించవచ్చు. కానీ, ఓవర్‌నైట్‌లో ఫేమ్ రావటం, కోట్లల్లో డిమాండ్ రావటం అనేది ఒక్క సినిమా ఫీల్డులోనే సాధ్యం.
  
క్రికెట్ వంటి అతి కొన్ని ఇతర ప్రొఫెషన్స్ కూడా ఇప్పుడు సినిమా గ్లామర్‌తో పోటీ పడుతున్నాయి. సినిమావాళ్లు కూడా ఇప్పుడు అందర్లాగే షాపింగ్ సెంటర్లలో తిరుగుతున్నారు. హోటల్స్, డిస్కోలు, క్లబ్బుల్లో అన్నిచోట్లా మామూలుగా తిరుగుతున్నారు. పెద్దగా ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. 

చెప్పొచ్చేదేంటంటే.. కాలం మారటం ఒక్కటే కాదు.ఇప్పుడు మనిషి ఆలోచనా దృక్పథం కూడా విస్తరించింది. 

సినిమా ఒక ప్రొఫెషన్ మాత్రమే. క్రికెట్ లాగే అక్కడ కూడా ఎప్పుడూ కొందరు మాత్రమే సక్సెస్ సాధించగలుగుతారు. ఆ కొందరు మాత్రమే ఒక రేంజ్‌లో కొనసాగుతుంటారు. ఈ కొందరి సంఖ్య అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఒక డజనుకు మించదు! 

వచ్చేవాళ్లు వస్తుంటారు. పోయేవాళ్లు పోతుంటారు. సక్సెస్ సాధించి అగ్రభాగాన ఉండేది మాత్రం ఎప్పుడూ ఒక డజను మంది మాత్రమే.. 

ఇది ఇక్కడే కాదు. బాలీవుడ్డయినా, హాలీవుడ్డయినా ఇంతే.

కారణాలు ఎన్నో ఉంటాయి. కానీ, వాస్తవం మాత్రం ఎప్పుడూ ఇదే. 

సినిమాల్లోకి ఎంటరయినవాళ్లూ, అయ్యేవాళ్లూ ముందుగా ఈ వాస్తవాన్ని గుర్తించాలి. అప్పుడే సినిమాల్లో సక్సెస్ సాధించకపోవడం అనేది పెద్ద సమస్య అయి కూర్చోదు. సినిమాలోకం అవతల కూడా జీవితం ఉందని తెలుస్తుంది. 

అది తెలుసుకోవడమే చాలా ముఖ్యం. 

3 comments:

  1. చాలా బాగా చెప్పారు.

    ReplyDelete
  2. వాస్తవాన్ని చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. Thank you. Ee post raayadaaniki inspiration mee comment !! :)

      Delete