Friday 20 December 2013

శఠగోపాన్ని దొంగిలించిన జీవితం!

ఆ మధ్య మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పీ పట్నాయక్, పాటల రచయిత కులశేఖర్ కాంబినేషన్లో అద్భుతమైన మ్యూజిక్ ట్రెండు ఒక ఊపు ఊపింది. అది కొంతకాలమే కావొచ్చు.

కానీ, అప్పటి ఆ ట్రెండుని అంత సులభంగా  మనం మర్చిపోలేం.

క్రమంగా ఆర్పీ పట్నాయక్ సంగీతాన్ని పక్కనపెట్టాడు. డైరెక్టరయ్యాడు. యాక్టరయ్యాడు. ఈ మధ్యే డైరెక్టర్‌గా ఒక ఇంగ్లిష్ సినిమా కూడా చేస్తున్నట్టు ఎక్కడో చదివాను. బహుశా అది కూడా ఇప్పటికి అయిపోయే ఉంటుంది. నేను నిజంగా ఆర్పీ పట్నాయక్‌ని అభినందిస్తున్నాను. తన అభిరుచి, ఆశయాలమేరకు.. తన ఇష్టానుసారం జీవితంలో ముందుకు వెళ్తున్నాడు.

కానీ, ఇక్కడ విషయం అది కాదు ..

కులశేఖర్ ఎందుకోమరి.. లిరిక్ రైటర్‌గా కూడా క్రమంగా తెరమరుగైపోయాడు. తర్వాత ఆయన కూడా దర్శకుడయ్యాడు.

కులశేఖర్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం "ప్రేమలేఖ రాశా" ఫ్లెక్సీని బేగంపేట్ లైఫ్‌స్టైల్ బిల్డింగ్ పైన కనీసం ఓ సంవత్సరంపాటు చూశాన్నేను. ఫ్లైఓవర్ పైన కార్లో వెళ్తున్నపుడు.. దాదాపు ప్రతిసారీ, ఎదురుగా అంత ఎత్తున కనిపించే ఆ ఫ్లెక్షీపైనే నా దృష్టి పడేది. తర్వాత ఆ ఫ్లెక్సీ కూడా కనుమరుగైపోయింది.

కట్ టూ శఠగోపం -

ఉన్నట్టుండి నిన్నటి "ఈనాడు" పేపర్లో కులశేఖర్ గురించి ఒక వార్త చదివాను. ఏదో గుళ్లో శఠగోపం దొంగిలించాడన్న నేరం నిర్ధారణ అయి, కులశేఖర్‌కు 6 నెలలు జైలు శిక్షపడిందని!

వెంటనే ఫోన్లద్వారా, ఇండస్ట్రీ మిత్రులద్వారా ఎంక్వయిరీ చేశాను. ఇది నిజం అయ్యుండదు అని నా ఉద్దేశ్యం. నిజం కాకూడదని కూడా.

కానీ ఇది నిజం. నేర నిర్ధారణ అయి, ప్రస్తుతం కులశేఖర్ జైల్లో ఉన్నాడు.

కానీ, దీన్ని మించిన బాధాకరమైన వార్త ఇంకొకటి తెలిసింది. సుమారు 100 కు పైగా సినిమాల్లో పాటలు రాసిన కులశేఖర్ ప్రస్తుతం అల్జీమర్స్ తరహా వ్యాధితో బాధపడుతున్నాడనీ, మనుషులను గుర్తుపట్టడం లేదనీ!

ఇంక నేనేం రాయలేకపోతున్నాను .. 

2 comments:

  1. అల్జీమర్స్ కాదనుకుంటానండి. రెండు, మూడేళ్ళక్రితం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హెల్త్ రీత్యా పెద్ద దెబ్బ తిన్నాడు...నాకు తెలిసినంతవరకు.

    ReplyDelete
  2. సినిమాల్లో పాటలు రాసిన కులశేఖర్ ప్రస్తుతం అల్జీమర్స్ తరహా వ్యాధితో బాధపడుతున్నాడని అంటున్నారు. అతడు దొంగతనం నేరానికి శిక్షించబడ్డాడన్నది తెలిసిందే. ఐతే, అతడు చేసిన ఈ దొంగతనం వెనుక పాపం అతడి వ్యాధి ప్రభావం ఉండి ఉండవచ్చును. అటువంటప్పుడు న్యాయస్థానం అతడి మానసిక శారీకక స్థితిగతుల్ని పరిగణనలోకి తీసుకున్నాకే ఈ శిక్షవిధించిందా? అసలు ఈ విషయాలు న్యాయస్థానంవారి దృష్టికి తీసుకొని వెళ్ళారా యెవరైనా అన్నది గమనార్హం!

    ReplyDelete