Tuesday 8 October 2013

నిజమైన ట్రెండ్ సెట్టర్ ఎవరు?

నా చిన్నతనంలో చిరంజీవి, కోదండరామిరెడ్డిల కాంబినేషన్లో వరుసగా సినిమాలు వచ్చేవి. ఇళయరాజా సంగీతం, వేటూరి పాటలు. బాలు, చిత్ర గానం. యండమూరి వీరేంద్రనాథ్, సత్యానంద్ వంటి దిగ్గజాల స్క్రిప్టు. రాధ, విజయశాంతి, మాధవి, సుహాసిని వంటి టాప్ రేంజ్ హీరోయిన్లు. ఒక సిల్క్ స్మిత. ఇంకేం కావాలి?

ఆ కాంబినేషన్, ఆ సెటప్‌తోనే సినిమాకు ఒక భారీతనం వచ్చేది. సినిమా ఇంకా పూర్తవకముందే, కేవలం ఆ సెటప్‌తోనే ప్రాజెక్టుకు ఒక "సక్సెస్" ఫీల్ వచ్చేది. సినిమాలో ఏ కొంచెం స్టఫ్ ఉన్నా అది బాగా ఆడేది.

కట్ టూ ఇంకో సెటప్ -

ఇప్పుడు ఏ బ్రాండెడ్ హీరో సినిమా అయినా, సగటున 30 నుంచి 50 కోట్ల వరకు బడ్జెట్ ఉంటోంది. లేటెస్టుగా ఇది 100 కోట్లకు కూడా చేరబోతోంది!

ఆల్రెడీ మార్కెట్ ఇమేజ్ ఉన్న డైరెక్టర్. భారీ హీరో. భారీ నిర్మాత. మరింత భారీ బడ్జెట్. టాప్ రేంజ్ మ్యూజిక్ డైరెక్టర్, టాప్ రేంజ్ హీరోయిన్లు. కనీసం రెండు మూడు దేశాల్లో షూటింగ్.

అప్పటికీ ఇప్పటికీ చిన్న తేడా ఏంటంటే - ఎవరో ఒకరిద్దరు దర్శకుల్ని మినహాయిస్తే, ఇప్పుడు, సుమారు 80 శాతం సినిమాలకి రచయితలంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండటం లేదు. "కథ-స్క్రీన్‌ప్లే-మాటలు" దర్శకులే రాసుకుంటున్నారు!

ఇలాంటి సెటప్‌లో సినిమా చేయటం కూడా అంత గొప్ప విషయం కాదు. ఇన్ని రిసోర్సెస్ పెట్టుకున్న తర్వాత, ఆ చిత్ర దర్శకుని టాలెంట్ జస్ట్ ఒక ట్రంప్ కార్డులా పనిచేస్తే చాలు. సినిమా సక్సెస్ అదే అవుతుంది. అలా అవలేదంటే మాత్రం లోపం ఆ దర్శకునిదయినా కావాలి. లేదంటే, ఆ దర్శకుని టాలెంటునీ, ఫ్రీడమ్‌నీ ప్రభావితం చేసిన సదరు బ్యానర్/నిర్మాత/సోకాల్డ్ హీరో ఇమేజ్ అయినా కావాలి.  

చెప్పొచ్చేదేంటంటే - పైన చెప్పుకున్న రెండు రకాల సెటప్స్‌లోనూ సక్సెస్ ఇవ్వడం అంత గొప్ప విషయం కాదు.

కానీ ..

ఏ మాత్రం ఇమేజ్ లేని కొత్త ఆర్టిస్టులతో ఒక "స్వర్గం నరకం" తీసి భారీ సక్సెస్ చేయటం గొప్ప విషయం. ఏ మాత్రం ఇమేజ్ లేని కొత్త పాత నటీనటులతో ఒక "మరో చరిత్ర" తీసి సక్సెస్ చేయటం గొప్ప విషయం.

కట్ టూ మారుతి -  

పైన చెప్పుకున్న పెద్ద సెటప్ సినిమాల కథా చర్చల ఖర్చులకు కూడా ఏ మాత్రం సరిపోని బడ్జెట్‌తో, అంతా కొత్తవాళ్లతో, కొత్త డిజిటల్ టెక్నాలజీతో "ఈ రోజుల్లో" సినిమా తీసి సక్సెస్ సాధించిన దర్శకుడు మారుతి నా దృష్టిలో సిసలైన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్. నిజమైన ట్రెండ్ సెట్టర్.

తర్వాత కూడా అదే కొత్త టెక్నాలజీని ఫాలో అవుతూ - "బస్టాప్", "పేమ కథా చిత్రమ్" సినిమాలను కూడా తీసి సక్సెస్ సాధించాడు మారుతి. ఈ రెండు సినిమాల్లో కూడా దాదాపు అంతా కొత్తవాళ్లే. లేదా.. ఇమేజ్ లేని నటీనటులే.

కాలంతోపాటు మనిషి జీవనశైలి మారింది. యువత విషయంలో ఈ మార్పు మరింత ఫాస్ట్‌గా ఉంది. ఎప్పుడో ఇరవై ఏళ్ల కిందటిలాగే మనం జీవిస్తున్నామా? మన జీవనశైలి అలాగే ఉందా? రియలిస్టిక్‌గా పెట్టిన కొన్ని ఆడల్ట్ కామెడీ డైలాగులను/సీన్లను మాత్రమే పట్టేసుకొని, మారుతిని "బూతు బ్రహ్మ", "బూతు చిత్రాల దర్శకుడు" అని ముద్ర వేయడం ఆత్మ వంచన. అత్యంత దారుణమైన హిపోక్రసీ.

ఆ మాటకొస్తే - సుమారు 30 ఏళ్లక్రితం నాటి సినిమాల్లో కూడా డైరెక్ట్ బూతు డైలాగులున్నాయి. అప్పుడంతా కేవలం బూతు కోసమే బూతు చొప్పించటం. ఇప్పుడలా కాదు. వేగంగా మారుతున్న కాలం. మారిన యువతరం జీవనశైలి.

చెన్నైలోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ వాష్ రూముల్లోని పైప్స్ నిండా కండోమ్‌స్ నిండిఫోయి, ఆ కంపెనీ బిల్డింగుకే భారీ రిపేర్లు చేయాల్సి వచ్చిన వార్తని మనం చదవలేదా? ఇలాంటి ఇంకెన్నో వార్తలు మనం నిత్యం టీవీలో చూడ్డం లేదా?    
హిందీలో అమీర్ ఖాన్ "డెల్లీ బెల్లీ" నుంచి, నిన్నటి "ప్యార్ కా పంచ్‌నామా" సినిమాల్లోని డైలాగులు/సీన్ల విషయమేంటి? అసలు ఆస్కార్, కేన్స్ అవార్డులు పొందిన ఎన్నో సినిమాల్లోని సీన్లు, డైలాగులు మనవాళ్లకి ఏమయినా తెలుసా?

మనిషి నిజ జీవితం, జీవనశైలి, జీవితంలోని సంఘటనలు తప్పకుండా సినిమా స్క్రిప్టుల్లోనూ ఉండి తీరతాయి. అలాగని, మారుతి అన్ని సినిమాల్లోనూ ఆడల్ట్ కామెడీనే ప్రధానంగా లేదు. అతని రచన, నిర్మాణంలో వచ్చిన "ప్రేమ కథా చిత్రమ్" పూర్తిగా భిన్నమయిన సినిమా.  

అసలిదంతా సోకాల్డ్ క్రిటిక్స్ సృష్టి. వారు చేయగలిగింది, వారి క్రియేటివిటీ ఇంతవరకే పరిమితం. ఆ బాక్స్ దాటి మనవాళ్లు ఎన్నటికీ బయటికి రాలేరు.

కట్ టూ మన అసలు పాయింట్ -

సింపుల్‌గా చెప్పాలంటే - 40 కోట్ల బడ్జెట్‌తో 20 కోట్లు సంపాదించడం గొప్ప విషయం కాదు. 40 లక్షల బడ్జెట్‌తో 20 కోట్లు సంపాదించడం మాత్రం ఖచ్చితంగా గొప్ప విషయమే.

భారీ హంగులతో, బ్రాండెడ్ హీరో హీరోయిన్లతో సినిమా తీసి సక్సెస్ చేయడం గొప్ప విషయం కాదు. అంతా కొత్తవాళ్లతో, కొన్ని లక్షల్లోనే సినిమా తీసి సక్సెస్ చేయడమనేది ఖచ్చితంగా గొప్ప విషయమే.

ఆ టాలెంట్ మారుతిలో ఉంది. నిర్మాతగా కూడా ఆయన స్వంత బేనర్ నుంచి 7 సినిమాలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు!   

No comments:

Post a Comment