Thursday 31 October 2013

ఏం రాస్తున్నానన్నది కాదు నాకు ముఖ్యం!

ఇవాళ ఉదయమే ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చూశాను. రతన్ టాటా కొటేషన్ అది. "జీవితం అన్నాక ఛాలెంజెస్ తప్పవు. ఆ మాత్రం అప్స్ అండ్ డౌన్స్ లేని జీవితాన్ని జీవించడంలో అసలు మజా ఏముంటుంది?" అందుకే ఆయన "రతన్ టాటా" అయ్యారు.

సినిమా నా ప్రధాన వ్యాపకం కాదు.

నా మొదటి చిత్రం "కల" తర్వాత, సంఖ్యాపరంగా, ఇప్పటికే ఎన్నో సినిమాలు చేయగల అవకాశం ఉన్నా - నా వ్యక్తిగత సమస్యలు, పరిమితుల కారణంగా ఆ పని చేయలేకపోయాను. ఇప్పుడు కూడా నేను మళ్లీ సినిమాలు చేయాలనుకొంటోంది (నా ప్లానింగులు, అవసరాల దృష్ట్యా)  కేవలం కొన్నాళ్ల కోసమే.

అది 2014 చివరి వరకు అని ఇటీవలే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఆ లోపే అయితే అంతకంటే ఆనందం లేదు! ఇది నేను సినిమాల మీద ఇష్టం లేకనో, ఇక్కడ ఉండే ఇన్‌సెక్యూరిటీకి భయపడో కాదు చెప్తోంది. సినిమాను మించిన ప్రెఫరెన్సెస్ నాకున్నాయి. వాటికి తొందర కూడా ఉంది.

ఈ బ్లాగ్‌ను ముందు ప్రారంభించింది ఒక ఉద్దేశ్యంతో. అనుకోకుండా జరిగిందది. ఆ తర్వాత దీన్ని కేవలం సినిమాల టిట్‌బిట్స్‌కే పరిమితం చేయాలనుకున్నాను. ఆ తర్వాత, ఇందులో మళ్లీ నాకు తోచిన ప్రతి చెత్తా రాయాలనుకున్నాను. మళ్లీ ఈ మధ్యే - నేను సినిమాల్లో పనిచేసినంత కాలం నగ్నచిత్రంలో కేవలం సినిమా కబుర్లే రాయాలనుకొని "టోటల్ సినిమా!" అంటూ సబ్ టైటిల్ కూడా మార్చాను. ఇప్పుడు మళ్లీ ..

ఎంతసేపూ.. అయితే సినిమా, లేదంటే మనిషి జీవితంలోని నాకు నచ్చిన ఇతర విషయాలు. ఇలా ఊగిసలాడాను. ఏదో రాశాను. రాస్తున్నాను.

ఇలా పదే పదే ఊగిసలాడ్డం నా నిలకడలేనితనం కాదు. అది నా అంతస్సంఘర్షణ.

అయితే - ఈ సంఘర్షణ ఏదో ఓ రూపంలో ఎప్పుడూ ఉండేదే. రతన్ టాటా చెప్పినట్టు.. జీవితం అంటేనే ఛాలెంజెస్.

సంఘర్షణలు, ఛాలెంజెస్ అనేవి మనిషి జీవితంలో ఒక విడదీయరాని భాగం. వాటినుంచి ఆదరా బాదరా బయటపడాలన్న అవివేకంతో నాకెంతో ఇష్టమయిన పనుల్ని, హాబీల్ని కూడా ఇలా నా ఇష్టానికి వ్యతిరేకంగా చేయడం .. నాకు అస్సలు నచ్చడం లేదు.  ఇది నేను చేస్తున్న మరో తాజా తప్పులా అనిపిస్తోంది.

ఆ తప్పు చేయాల్సిన అవసరం నాకు ఏ మాత్రం లేదు.

సో, ఇకనుంచీ "నగ్నచిత్రం" కేవలం సినిమాకే పరిమితం కాదు. సినిమా పోస్టులు 'కూడా' ఉంటాయి. నా ఇష్టాన్నే ఫాలో అవుతూ కూడా ఈ బ్లాగ్ విజిట్స్ అంకెను ఎంతయినా పెంచుకోవచ్చు. ఇతర లక్ష్యాల్ని కూడా చేరుకోవచ్చు.

మీరేమంటారు?

ఏం రాస్తున్నానన్నది కాదు నాకు ముఖ్యం. నేను మళ్ళీ రాయడం ప్రారంభించాను. అదే నాకు ముఖ్యం. ఇప్పుడు -  ఏం రాసినా కూడా.. అది నా ఇష్టంతోనే రాయాలనుకుంటున్నాను. 

2 comments:

  1. ఏమి రాస్తున్నామన్నది విషయం! ఎలా రాస్తున్నామన్నది శైలి!!

    ReplyDelete