Tuesday 22 October 2013

టోటల్ సినిమా!

తాడిచెట్టు క్రిందకి వెళ్లినప్పుడు అక్కడ తాగాల్సింది కల్లు మాత్రమే.

అలా కాకుండా - తాడిచెట్టు క్రింద కూర్చుని, "నాకు కల్లు అలవాటు లేదు.. పాలు తాగుతాను" అని చెప్పి, అక్కడ నువ్వు స్టీలు గ్లాసులో పాలు తాగినా, ఎవడూ నువ్వు తాగుతోంది పాలు అనుకోడు.

తాజాగా మాంచి తాటి కల్లు తాగుతున్నావనే అనుకుంటాడు. కాకపోతే - గ్లాసులో!

"కాదురా బాబూ! నేను నిజంగా పాలే తాగుతున్నాను!" అని ఎంత నెత్తీ నోరూ కొట్టుకున్నా ఎవడూ వినడు. వినాల్సిన అవసరం వాళ్లకి లేదు.

వాళ్లు గుర్తించేది ఒక్కటే. అనుకునేది ఒక్కటే. నువ్వు తాడిచెట్టు కింద కూర్చుని ఉన్నావు. అక్కడ నువ్వు తాగుతున్నది ఖచ్చితంగా కల్లు మాత్రమే! ఒకవేళ నువ్వు నిజంగా అక్కడ కల్లు తాగడం లేదు.. పాలే తాగుతున్నావు అంటే.. సింపుల్‌గా నిన్నొక "ఇడియట్" అనుకుంటారు తప్ప ఎవరూ మెచ్చుకోరు.

కట్ టూ సినిమా -

నేనిక్కడ వర్‌ల్డ్ సినిమా గురించి, ఇండిపెండెంట్ సినిమా గురించి, లేదా ఇంటలెక్చువల్ సినిమా గురించి  మాట్లాడ్డం లేదు. నేను మాట్లాడుతోంది 100% కమర్షియల్ సినిమా గురించి. అందులోనూ, ప్రస్తుతం నేను చేస్తున్న తెలుగు సినిమా గురించి. సినీ రంగం గురించి.

మన తెలుగు సినిమా ఒక తాడి చెట్టులాంటిది. దీనికో లెక్కుంది. కావల్సినంత తిక్క కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే - అసలు సినిమా అంటేనే ఒక మేనిప్యులేషన్.

ఈ లెక్కలు, తిక్కలు, మేనిప్యులేషన్స్ నేనసలు పట్టించుకోను. అవి నాకు సరిపడవు. నేను ముక్కు సూటిగానే వెళ్తాను.. అనుకోవడం పూర్తిగా ఒక ఫూలిష్‌నెస్. తాడిచెట్టు కింద కూర్చుని పాలుతాగటం అంటే ఇదే.

ముందే అనుకున్నట్టు సినిమా అంటేనే ఒక మేనిప్యులేషన్. ఒక తాడిచెట్టు. ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. మన సొంత పైత్యం పక్కన పెట్టి, ఇక్కడ ఏం చేయాలో అదే చెయ్యాలి.

మొదటిసారిగా, ఇప్పుడు నేను తాడిచెట్టు కిందకి నేరుగా వచ్చాను. ఇక "టోటల్ సినిమా!" (ఎట్‌లీస్ట్.. నా పర్సనల్ ఎజెండాలూ, కమిట్‌మెంట్లూ, లెక్కలూ క్లియర్ చేసుకొనేవరకూ!)

ఇప్పుడు నేను ఇండస్ట్రీ తాడిచెట్టుకింద తీరిగ్గా, రిలాక్స్‌డ్‌గా కూర్చున్నాను. ఇక్కడ నేనింక పాలు త్రాగను. మాంచి కల్లు ఆర్డర్ చేశాను. జస్ట్ వెయిటింగ్ ఫర్ ది "కల్లు కుండ" టు కమ్...  

2 comments: