Saturday 21 September 2013

ఒక యాక్సిడెంట్ జీవితాన్నే మార్చివేసింది!

స్టాచుటరీ వార్నింగ్: "నేను చాలా పాజిటివ్ దృక్కోణంలో రాస్తున్న బ్లాగ్ ఇది. ఎవరినయినా బాధిస్తే క్షమార్హుణ్ణి."

అసలీ టాపిక్ మీద బ్లాగ్ రాయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ 'రాయాల్సిన అవసరం ఉంది' అని నాకనిపించింది.

నేను చేసిన పొరపాటును మరొకరు చేయకుండా ఉంటారు కనీసం.

కట్ టూ .. 4 జనవరి 2012, ఉదయం 11 గంటలు -

న్యూ బోయిన్‌పల్లిలో ఒక ఫార్మా ఆఫీసు ..

నాకు అత్యంత దగ్గరి బంధువుకి సంబంధించి నాకున్న ఆర్థిక లావాదేవీల విషయంలో - తన సంతృప్తికోసం - ఆ ఆఫీసులో ఉన్న ఆయన తరపు వ్యక్తి ఒకరు నిర్మొహమాటంగా నాకు వినిపించిన మాటలన్నీ విని, ఆయన అడిగినన్ని చెక్కులు రాసిచ్చి, ఆ ఆఫీసు నుంచి బయట పడ్డాను.

నేను చెక్కులు ఎవరికయితే రాసిచ్చానో - ఆ బంధువు నాకు చాలా దగ్గరి బంధువు. ఎంత దగ్గరి బంధువు అంటే... మా మామగారు చనిపోవడం వల్ల, సతీ సమేతంగా నా పెళ్లిలో నాకు కాళ్లు కడిగి కన్యాదానం చేసిన అత్యంత ఆత్మీయ బంధువు ఆయన!

అత్యంత ఇబ్బందికరమైన ఆ సంఘటన తాలూకు వేదన నన్నింకా వెంటాడుతూనే ఉంది. అయినా, ఎలాగో శ్రీనగర్ కాలనీకి దగ్గర్లో ఉన్న మా ఆఫీసుకి వెళ్లి నా పనిలో నేను మునిగిపోవడానికి ఎంతో ప్రయత్నించాను.

ఫాస్ట్ ఫార్వర్డ్ టూ .. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలు -    

నా ఇంకో అతి దగ్గరివాడయిన ఆత్మీయ బంధువు, హైటెక్ సిటీలో ఉన్న తన ఆఫీసుకి వెళుతూ దారిలో నన్ను కలవడానికి వస్తున్నట్టు ఫోన్ చేశాడు. రమ్మన్నాను. శ్రీనగర్ కాలనీకి వచ్చాడు నా ఆత్మీయ బంధువు.

సుమారు 45 నిముషాల పాటు మాట్లాడుకున్నాము. నిజానికి అవి మాటలు కావు. వ్యక్తిగతంగా నేను అనుభవించిన మానసిక ఘోష.

ఒక ప్రశ్నకు నిజమైన జవాబు ఒకటే ఉంటుంది సాధారణంగా. ఎన్ని గంటలు ఎంత వేధించినా రెండో జవాబు ఉండదు. అదీ పచ్చి అబధ్ధమయితే తప్ప! కానీ అంత టాలెంట్ నాకు లేదు. సుగర్ కోటింగ్ ఇచ్చి పచ్చి అబధ్ధాలు చెప్పడం, మరేదో కల్పించి చెప్పడం నావల్ల అస్సలు కాదు. అందుకే ఉన్నది ఉన్నట్లుగా అప్పటి నా పరిస్థితి చెప్పాను.

నిజమే చెప్పాను.    

45 నిమిషాల ఆ ఘోష సరిపోలేదు. రాత్రికి ఆఫీస్ అయిపోయాక వెళ్లేటప్పుడు మళ్లీ వచ్చి కలుస్తాను. మళ్లీ మాట్లాడుకుందాం అన్నాడు నా ఆత్మీయ బంధువు.

"సరే" అన్నాను. ఇంకేమనగలను?

ఒక రిక్వెస్ట్ మాత్రం చేశాను. మానసికంగా, శారీరకంగా ఆ రోజు ఉదయం నుంచీ నా పరిస్థితి బాగా లేదు. నేను రోడ్ క్రాస్ చేసి అవతలివైపు రాలేను. "కొంచెం నువ్వే ఈ వైపుకి రా!" అన్నాను. తలవూపి వెళ్లిపోయాడు నా ఆత్మీయ బంధువు.

పనిలో మునిగిపోతేనే బాగుంటుందని మళ్లీ వెనక్కి వెళ్లి ఆఫీసులో దూరిపోయాను. పనిలో పడిపోతే అన్నీ మర్చిపోవచ్చని నా నమ్మకం.

ఫాస్ట్ ఫార్వర్డ్ టూ రాత్రి 11 గంటలు -

ఆఫీసులో నా పని ముగించుకొని - బంజారాహిల్స్‌లోని పిజ్జా కార్నర్ వెనకున్న మా గెస్ట్ హౌజ్‌కి చేరుకున్నాను. పొద్దుటి జ్ఞాపకాలు వెంటాడుతోంటే - ఇంక ఆ రోజు లంచ్ చేయలేకపోయాను. రాత్రి భోజనం కూడా చేయాలనిపించలేదు.

నా బంధువు నుంచి కాల్ రానే వచ్చింది. "వస్తున్నాను. నువ్వలా కొంచెం రోడ్డుకి ఇటువైపు రా!" అని ఫోన్లోనే మరోసారి చెప్పేసి, స్లిప్పర్స్ వేసుకొని గెస్ట్ హౌజ్ నుంచి బయటపడ్డాను ఆ రాత్రి.

ఆ క్షణం నాకు తెలియదు. కాసేపట్లో నా జీవితం ఛిద్రమైపోతోందని.

పిజ్జా కార్నర్ దగ్గరికి వెళ్లాను. రోడ్డుకి అవతలివైపు బైక్ పార్క్ చేసుకొని, దాని మీద కూర్చుని వున్నాడు నా బంధువు. కనీసం వయసులో తనకంటే ఒక 12 ఏళ్లు పెద్దవాడినయిన నా వయసుకి, ఆనాటి నా మానసిక శారీరకస్థితికి, నా అభ్యర్థనకి ఎలాంటి విలువ ఇవ్వలేదు.

ఏం చేయగలను?

చాలా జాగ్రత్తగా అటూ ఇటూ చూసి, నన్ను నేను కంట్రోల్ చేసుకొంటూ రోడ్ డివైడర్ క్రాస్ చేసి, ఆవైపుకెళ్లాను.

కనీసం మరో గంటన్నర అక్కడ నా ఆత్మీయ బంధువు ఎదురుగా నిల్చున్నాన్నేను. ఒక దోషిగా .. అదేరోజు రెండోసారి!

మానిప్యులేషన్స్ చేసి నా జవాబులు మార్చలేను. మాస్కులు వేసి పచ్చి అబద్ధాలూ చెప్పలేను. మధ్యాహ్నం చెప్పిన మాటే చెప్పాను.

చాలా అసహనంగా - తను నాకు వినిపించాలనుకున్న మాటలు, నన్ను అనాలనుకున్న మాటలు, అనాల్సిన మాటలు అన్నీ అనేసి - బైక్ స్టార్ట్ చేసుకొని అక్కడనుంచి వెళ్లిపోయాడు నా ఆత్మీయ బంధువు.

అప్పుడు అర్థరాత్రి 12.30 దాటింది. రోడ్డుకి రెండువైపులా జాగ్రత్తగా చూసాను. ఏ వెహికిల్ రావటం లేదు. నెమ్మదిగా రోడ్డు దాటడం మొదలెట్టాను.

ఆ తర్వాతేం జరిగిందో నాకు తెలియదు!
(ఓ పల్సర్ బైక్ వాడు నన్ను కొట్టేశాడని తర్వాత తెల్సింది. ఆ కేసు ఇంకా నడుస్తోంది..)

ఫాస్ట్ ఫార్వర్డ్ టూ తెల్లవారుఝామున 2 గంటలు - 

అంబులెన్సులో కళ్లు తెరిచాను. నాకేం జరిగిందో నాకు తెలియదు. నా బాడీ నా అధీనంలో లేదు. తలలోంచి రక్తం, ఛాతీనిండా దెబ్బలు, చేతులకు దెబ్బలు, మోకాలిదగ్గర 17 ముక్కలుగా విరిగిపోయిన కాలు ..

ప్యారడైజ్ దగ్గర "సన్‌షైన్" హాస్పిటల్లోని ట్రౌమాలో నన్ను వదిలేసి ఇంటికి వెళ్లిపోయాడు నా బంధువు.

నా స్ట్రెచర్ పక్కగా నిల్చుని "నేనెవరు..నేనెవరు?" అంటూ ఏడుస్తూనే  నా భార్య సుజాత నన్ను పదే పదే అడుగుతోంది. బహుశా, తలకి తగిలిన దెబ్బతో నేను ఎక్కడ నా మతిస్థిమితం కోల్పోతాననో, ఏ కోమాలోకో వెళ్తాననో ఆమె భయం. నేను మగతలోకి వెళ్లకుండా శతవిధాలా ప్రయత్నిస్తోంది సుజాత.

నా తలనుంచి, ఇతర గాయాలనుంచి వస్తున్న రక్తం సుజాతలో ఇంక "జరగరానిదేదో" జరగబోతోందేమో నన్న భయాన్ని కలిగిస్తున్నాయనుకుంటాను. నేను వద్దు అంటున్నా కూడా వినకుండా, వరంగల్లో ఉన్న మా అమ్మకి ఫోన్ చేసింది సుజాత.

మరోవైపు - హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ ఒకరు "ఆపరేషన్ కోసం అడ్మిట్ చేస్తున్నారా.. లేదంటే పేషంట్‌ని ఇక్కనించి తీసుకెళ్తారా?" అనటం నాకు చాలా స్పష్టంగా వినిపిస్తోంది.

ఆ తర్వాతేం జరిగిందో నాకు తెలియదు.

ఫాస్ట్ ఫార్వర్డ్ టూ మర్నాడు మధ్యాహ్నం - 

స్ట్రెచర్ మీద నన్ను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్తున్నారు. అంతా సీరియస్‌గా చూస్తున్నట్టు లీలగా తెలుస్తోంది నాకు. నన్ను ఆపరేషన్ కోసం లోపలికి తీసుకెళ్తోంటే  - సుజాత చెల్లెలు శారద మాత్రం ఒక్కసారిగా బావురుమంటూ ఏడవటం నాకు చాలా స్పష్టంగా వినిపించింది.  "అలా ఏడ్చొద్దు!" అని ఆమె భర్త రమేష్ అంటూండటం కూడా ఇప్పటికీ నాకు గుర్తుంది.

ఫాస్ట్ ఫార్వర్డ్ టూ 20 నెలల తర్వాత - 

నేనిప్పుడు బాగున్నాను. యాక్సిడెంట్ కావడానికి ముందు నేను ఎంతో కష్టపడి సంపాదించుకొని, సైన్ చేసిన మూడు సినిమాల అవకాశాలు పోయాయి. అందులో ఒకటి నాకెంతో ఇష్టమయిన మళయాళం ప్రాజెక్టు. ఆ మూడు అవకాశాల మొత్తం విలువ కనీసం ఓ 30 లక్షలు. (ప్రాఫిట్స్‌లో షేర్ కాకుండా!)

నేనిప్పుడు బాగున్నాను. మోకాలి దగ్గర 17 ముక్కలుగా విరిగిపోయిన నా ఎడమ కాలు మాత్రం పూర్తిగా బెండ్ అవదు. ఇంక ఎన్నటికీ అవదు. సపోర్ట్ లేకుండా మెట్లు ఎక్కడం, దిగడం కుదరదు. మరొకరి సహాయం లేకుండా చిన్న గల్లీలో కూడా రోడ్డు దాటలేను.

సుమారు 9 నెలల బెడ్‌రెస్ట్ తర్వాత  .. నేనిప్పుడు బాగున్నాను.

బట్ - ఫిజికల్లీ చాలెన్‌జ్డ్!

నా కాలికి మళ్లీ ఇంకో ఆపరేషన్ అవసరం అన్నారు డాక్టర్లు. అదింకా పెండింగ్‌లోనే ఉంది. ఎప్పుడు చేయించుకుంటానో తెలియదు.

దాదాపు ఏడాదిపాటు నడవకుండా ఉండటం వల్ల - బెడ్ మీదే ఒరిగి కూర్చుని నా ల్యాప్‌టాప్‌లోనో, పుస్తకాలతోనో పని చేసుకోవడం వల్ల.. నా చెస్ట్ మీద కొన్ని వీన్స్ డైలేట్ అయ్యాయి. కొత్తగా ఇప్పుడు మరో సీరియస్ కంప్లయింటుకు కూడా టెస్టులు జరుగుతున్నాయి.

అయినాసరే, మళ్లీ నా ఆత్మీయ బంధువులిద్దరినుంచీ అదే ప్రెషర్, అవే మాటలు, అదే చెక్కుల గొడవ. అన్నీ మళ్లీ ఊపందుకొన్నాయి .. కళ్లముందు కనిపిస్తున్న నా పరిస్థితి చూస్తూ!

ఎందుకంటే, నేనింకా బ్రతికే ఉన్నాను కదా..

అయినా సరే. నేనిప్పుడు బాగానే ఉన్నాను. ఆ యాక్సిడెంట్ రోజు ప్రాణాలుపోకుండా ఇంకా బ్రతికే ఉన్నాను. ఇది నా పునర్జన్మ. ఈ కొత్త జన్మకి ఒక కనీస స్థాయి విలువని ఇవ్వటం ఇప్పుడు నాకు అవసరం.

నేను కోల్పోయిన నా క్రియేటివ్ ఫ్రీడమ్‌ని మళ్లీ వెనక్కి తెచ్చుకోవడం కూడా వ్యక్తిగతంగా నాకు చాలా అవసరం.    

కట్ టూ రియాలిటీ - 

ఒక వ్యక్తిగా, ఒక బంధువుగా కొన్నాళ్లక్రితం వరకూ నన్నెంతో గౌరవించి, ఎంతో బాగా చూసుకున్న ఆ ఇద్దరు ఆత్మీయ బంధువులు .. ఆ రోజు నన్ను అంత తీవ్రమయిన సంఘర్షణకి ఎందుకని గురిచేసారు? ఈ రోజు నన్నిలా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు?

వయసులో పెద్దవాడినయినా - నా అభ్యర్థనని మన్నించి, ఆ రాత్రి, నా ఇంకో బంధువు రోడ్డుదాటి ఈ వైపు వస్తే - ఈ రోజు ఇలా నేను ఒక ఫిజికల్లీ ఛాలెంజ్‌డ్ వ్యక్తిని అయ్యే పరిస్థితి ఉండేది కాదుగా? మరి ఆ నా ఆత్మీయ బంధువు ఎందుకని నా అభ్యర్థనని మన్నించలేకపోయాడు ఆ రాత్రి?

వాళ్లకి సంబంధించిన ఇతర విషయాలు నాకు తెలియవు. కానీ, నిజానికి నా ఆత్మీయ బంధువులిద్దరూ చాలా మంచివాళ్లు. అయితే, ఏ మనిషిలోనయినా - వారిలోని మంచితనానికి, మానవత్వానికి మాస్క్ వేసి, వాళ్లని శాడిస్టుల్ని, రాక్షసుల్ని చేయగల సత్తా ఈ ప్రపంచంలో ఒకే ఒక్క శక్తికుంది. అంతా దానివల్లే జరిగింది.

అదే ముఖ్యం మనకు. మన మనుషులు, మన కళ్లముందు కనిపిస్తున్న నిజాలు కాదు. అదే ముఖ్యం.
ఆ ఒక్కటే ముఖ్యం. అది లేకపోతే జీవితం లేదు. అదేంటో మీకు తెలుసు.

డబ్బు ..   

4 comments:

  1. ayyo
    meeku kaligina baadhaku chimtistunnaanu
    bhagavamtuni dayavalana meeru imkaa tvaragaa purti aarogyavamtulu kaavaalani korukumtunnaanu

    ReplyDelete
  2. డబ్బు సంపాదించడం తేలికే
    నిబ్బరం మనోధైర్యం కలిగి వుండడం చాలా కష్టం.

    కష్టమైన విషయమే మీ సొంతం అయినప్పుడు తేలిక పాటి విషయం చేర లేదు ఎంతోదూరం....చీర్స్.. (మీ మిత్రుడు )....

    ReplyDelete