Wednesday 18 September 2013

మనం విధిగా చదవాల్సిన ఒక సబ్జెక్టు ఏంటో మీకు తెలుసా?

ఈ మధ్యే "ఐఫోన్5ఎస్" రిలీజయిందట! దాని ఖరీదు సుమారు 60 వేలు, అది అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి!!

అర్థరాత్రివరకూ ఆ ప్రోగ్రాం చూశాడు మా పెద్దబ్బాయి ప్రణయ్. అది రిలీజ్ అవకముందు ఓ నెలక్రితమే నాకది కావాలంటూ ప్రణయ్ ఓ ఇండెంట్ నా ముందు పెట్టేశాడెప్పుడో! సరే, నవంబర్ చివర్లో కొనిస్తానన్నాను. ఎలా కొనిస్తానో తెలీదు కానీ, కొనిస్తానని మాత్రం నాకు తెలుసు. ప్రణయ్‌కు కూడా తెలుసు.

మన నిత్యజీవితంలో - మన ప్రతి చిన్న అవసరం, ఆలోచన, అడుగు.. ఏదయినా సరే - ప్రత్యక్షంగానో పరోక్షంగానో డబ్బుతో ముడిపడిఉంటుంది. ఈ నిజాన్ని ఒప్పుకోడానికి మనలో చాలామంది మనసు ఒప్పుకోదు.

అందుకే మనం అక్కడే ఉంటాం. కొందరుమాత్రం ఎక్కడికో వెళ్లిపోతారు. అలా వెళ్లిపోయేవాళ్లకు ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ పైనే వాళ్ల లేజర్ ఫోకస్ ఉంటుంది. ఆ విజన్‌ను వాళ్లు నిజం చేసుకుంటారు. అలాగని వాళ్లేదో బాగా డిగ్రీలకు డిగ్రీలు చదివినవాళ్లేం అయ్యుండరు. చదువుకీ సంస్కారానికీ ఎలాగయితే సంబంధం లేదో, చదువుకీ సంపాదనా సామర్ధ్యానికి కూడా ఎలాంటి సంబంధం లేదు.

ఇలాంటి ఉదాహరణలను మనలో కొందరు "అదృష్టం" అంటారు. అలా అనుకోవటం నిజంగా మన (అలా అనుకుని సంతృప్తిపడేవాళ్ల) "దురదృష్టం."

ప్రపంచంలో ఏ మూలనైనా, ఏ దేశంలోనైనా - కేవలం 5 శాతం లోపు వ్యక్తులే డబ్బు సంపాదిస్తారు. మిగిలిన 95 శాతం మంది వాళ్లు సంపాదించుకోడానికి ఉపయోగపడుతుంటారు. ఇది 100 శాతం నిజం. ఎవ్వరూ కాదనలేని నిజం. ఈ నిజం వెనక ఉన్న "సీక్రెట్" గురించి తెలుసుకొనేముందు - మనం ఇంకో విషయం మాట్లాడుకోవాలి. అది - మన చదువులు.

చిన్నపటి నుంచీ మనం అందరం ఒక గొర్రెల మంద వ్యవస్థను అనుసరించే ముందుకు సాగిపోతున్నాం. ఏ విషయంలోనైనా. మన విద్యా వ్యవస్థ అందుకు మినహాయింపు కాదు.

మన మాతృభాష చదుతున్నాం. లెక్కలు, సైన్స్, సాంఘిక శాస్త్రం, అదీ ఇదీ చదివి చివరికి పదో తరగతి పాసవుతున్నాం. తర్వాత - అయితే బైపీసీ, లేదంటే ఎంపీసీ. ఈ రెండు తప్ప ఇంక చదువులు లేనట్టే! ఆ తర్వాత కూడా అయితే డాక్టర్, లేదంటే ఇంజినీర్. (ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు.) మిగిలిన ప్రొఫెషన్స్ అసలు ప్రొఫెషన్స్ కావు!

వీటన్నిటితోపాటు - మనం తప్పనిసరిగా - కనీసం 7 వ తరగతి నుంచే నేర్పించాల్సిన సబ్జెక్ట్ ఒకటుంది. అదే - "ఫినాన్షియల్ ఇంటలిజెన్స్!"

కట్ టూ ఒక కఠోర సత్యం -

ఫర్ యువర్ కైండ్ ఇన్‌ఫర్మేషన్... మన "ఎకనామిక్స్", "ఎమ్‌బీయే"  లకూ దీనికీ ఏ మాత్రం సంబంధం లేదు అని చెప్పడానికి బాధపడుతున్నాను. కేవలం వారం క్రితం మా ఆఫీసులో రెసెప్షనిష్ట్ ఉద్యోగం కోసం (చాలా తక్కువ జీతం) చాలా మంది బీటెక్కులతో పాటు ఒక ఎంబీయే, ఒక పీజీ ఎకనమిక్స్ కూడా వచ్చారు! సో, మనం అనుకుంటున్న ఫినాన్షియల్ ఇంటలిజెన్స్ వేరే అన్నమాట.

బ్యాక్ టూ మన సబ్జెక్టు -

మనం చర్చిస్తున్న ఫినాన్షియల్ ఇంటలిజెన్స్‌ను తెలుగులో ఆర్థిక పరిజ్ఞానం అనవచ్చేమో తెలియదు. ఇప్పటికయితే అలా అనుకుందాం.  ఈ సబ్జెక్టులో సాధారణ పరిజ్ఞానం లేకుండా ఎన్ని సబ్జెక్టులు చదివినా వృధా.

కేవలం కొంతమందికి మాత్రమే ఈ సబ్జెక్టులో ప్రవేశం ఉంటుంది. అది కొందరికి వారసత్వంగా రావొచ్చు. సహజంగా రావొచ్చు. వారు ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల రావొచ్చు. వారి భవిష్యత్తు పట్ల వారుతీసుకొన్న ఒక స్థిరమైన నిర్ణయం ఇచ్చే కిక్ వల్ల రావొచ్చు. ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొని, "ఇంక చాలు ఈ డ్రామా" అనుకున్న ఆ ఒక్క పవర్‌ఫుల్ క్షణం వల్ల కావొచ్చు.

మొత్తానికి - కేవలం కొంతమందికి మాత్రమే ఈ ఫినాన్షియల్ ఇంటలిజెన్స్ అనేది ఉంటుంది. వాళ్లే ముందు మనం చెప్పుకున్న ఆ అయిదు శాతం మంది సంపాదనాపరులు. లేదా ధనవంతులు. డబ్బు విలువ వీరికి తెలిసినంతగా మిగిలిన 95 శాతం మందికి తెలియదు. కొంతమంది మాత్రం చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. కొంతమంది జీవిత చరమాంకంలో కూడా వారి భ్రమల్లో వారు బ్రతుకుతూ జీవితం ముగిస్తారు.

ఈ సత్యం తెలుసుకోడానికి నాకు పట్టిన సమయం - ఒక పూర్తి దశాబ్దం. చెప్పాలంటే, ఇంకా ఎక్కువే! అది నా జీవితంలో అత్యంత కీలకమైన దశ కావడమే నన్ను బాధిస్తుంది. కానీ, నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. కనీసం ఈ విషయంలో ఇప్పటికయినా జ్ఞానోదయం అయింది!

ఈ రోజు నుంచి కొత్తగా జీవితం ప్రారంభించినా చాలు. మనం ఏదయినా సాధించవచ్చు. మనకు కావల్సినంత డబ్బు సంపాదించవచ్చు. మనం అనుకున్న జీవనశైలిని ఎంజాయ్ చేయవచ్చు. ఇంకేదయినా చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే - గత 12 ఏళ్లలో సాధించలేనిదీ సంపాదించలేనిదీ, కేవలం వచ్చే 12 నెలల్లో సాధించవచ్చు. సంపాదించవచ్చు.  ఫినాన్షియల్ ఇటలిజెన్స్ పవర్ అలాంటిది.     

1 comment:

  1. డిగ్రీలకు అందని పాండిత్యం ఫినాన్సియల్ ఇంటలిజెన్స్ పవర్!మనం అది మార్వాడీలనుంచి,గుజరాతీలనుంచి నేర్చుకోవాలేమో!అందుకు సిక్స్త్ సెన్స్ దోహదం చేస్తుంది!జాగ్రత్తగా పొదుపుచేస్తూ తెలివిగా డబ్బును మదుపు చేయాలి!ఆర్ధిక స్పృహతో వివేకంతో ఏ రోజునుంచి అయినా కొత్త జీవితం ప్రారంభించవచ్చు! జీవితానుభవం నేర్పిన గుణపాటాలు కనువిప్పు కలిగించాలి!మనోహర్ చిమ్మని మంచి టపా చిమ్మారు!

    ReplyDelete