Friday 13 September 2013

సిల్క్ స్మిత ఏం సాధించింది?

జీవితంలోని అన్ని పార్శ్వాలు అనుభవించినవారికే తెలుస్తుంది జీవితం ఏమిటో. ఆ అనుభవాల అంతులేని ఆనందమో, మరణ మృదంగపు కాఠిన్యమో .. అదంతా ముఖాముఖి ఎదుర్కొన్నవాళ్లకే తెలుస్తుంది.

ఆ తర్వాత - వారి జీవితాలే చాలామందికి పాఠాలవుతాయి. ఏం చేయకూడదో చెప్తాయి. సిల్క్ స్మిత జీవితం అలాంటిదే.

ఏలూరులో ఒక అతి బీద కుటుంబంలో పుట్టిన విజయలక్ష్మి ముందు బ్రతుకుదెరువు కోసమే సినిమారంగాన్ని ఆశ్రయించింది. తర్వాత ఆ రంగంలోని తళుకుబెళుకులకు పడిపోయింది.

దాదాపు సినిమా రంగంలోని ప్రతి చీకటి కోణాన్ని చూసింది. "సిల్క్ స్మిత"గా తనే ఊహించని స్థాయికి ఎదిగింది. తను అస్సలు ఊహించని స్థితిలో బలవంతంగా తనువు చాలించింది.

అదీ సిల్క్ స్మిత జీవితం.

తను ఫీల్డులో ఉన్న 17 సంవత్సరాల్లో సుమారు 450 సినిమాల్లో నటించింది స్మిత.

ఒక దశలో - అసలు సిల్క్ స్మిత పాట లేకుండా సినిమాను ప్లాన్ చేయడానికి దాదాపు ఏ నిర్మాతా, దర్శకుడూ సాహసించలేకపోయారంటే అతిశయోక్తికాదు. మణిరత్నం 'గీతాంజలి' కూడా అందుకు మినహాయింపు కాదు!

అంతే కాదు. "కోట్లు కుమ్మరించి - వివిధ కారణాలవల్ల ల్యాబ్‌ల్లో పడి మూల్గుతున్న ఎన్నో సినిమాల కేన్‌లకు - ఒకే ఒక్క సిల్క్ స్మిత పాటని జోడించడం ద్వారా బయటికి తెచ్చి, హాట్ కేకులుగా అమ్ముకున్న సందర్భాలు అనేకం" అని ప్రముఖ తమిళ సినిమా చరిత్రకారుడు రాండార్ గై అన్నారంటే, దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు - ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో సిల్క్ స్మిత సొంతం చేసుకున్న పాప్యులారిటీ రేంజ్ ఏ శిఖరాగ్రం చేరుకుందో!  

సినీ రంగంలో కొంతమంది హీరోయిన్లు, ఇతర నటీమణుల వ్యక్తిగత జీవితాల్లో కొంత అలజడి ఉంటుంది. క్రమంగా అది అభద్రతకి దారి తీస్తుంది.

బలహీన మనస్కులు, ఇంకొకరిని బాధపెట్టొద్దు అనుకొనే సున్నిత హృదయులు, తమ జీవితంలోని బాధకు కారణమైనవారిని లేశమాత్రంగానైనా బాధపేట్టడానికి ఇష్టపడరు. పరిస్థితులు మారడానికి చేతనయినంత ప్రయత్నిస్తారు. చేతకాకపోతే తమ జీవితాన్నే అంతం చేసుకుంటారు. సిల్క్ స్మిత చేసిన పని కూడా అదే.

1996 లో తన జీవితాన్ని బలవంతంగా తనే అంతం చేసుకుంది.

ఈ పరిస్థితి, ఇలాంటి అనుభవాలు.. ఒక్క సినీ నేపథ్యం ఉన్న అమ్మాయిలు, స్త్రీల విషయంలోనే కాదు - ఇతర అన్ని రంగాల్లో ఉన్న అమ్మాయిలు, స్త్రీల విషయంలో కూడా ఉంటాయి. గ్లామర్ ఫీల్డు కాబట్టి - సినీ ఫీల్డులోని వారి విషయాలు "బ్రేకింగ్ న్యూస్"లవుతాయి. ఇతర రంగాల్లోని వారివి అంతగా బయటకు రావు. అంతే తేడా.

కట్ టూ "ది దర్టీ పిక్చర్" -

సిల్క్ స్మిత జీవితం ఆధారంగా నిర్మించిన హిందీ సినిమా "ది డర్టీ పిక్చర్" మొదటి వారంలోనే 52 కోట్లు సంపాదించింది. ఆ సినిమాలో సిల్క్ స్మిత పాత్రను ప్రముఖ హిందీ హీరోయిన్ విద్యా బాలన్ అద్భుతంగా పోషించింది.

అంతకు ముందు విద్యా బాలన్ "పరిణీత", "లగే రహో మున్నాభాయ్", "పా", "నో వన్ కిల్డ్ జెస్సికా" వంటి చిత్రాల్లో ఎంతో బాగా నటించింది. ఎన్నో అవార్డులు సాధించింది. కానీ, వాటన్నింటి ద్వారా రాని గుర్తింపు, పేరు, క్రేజ్.. విద్యా బాలన్‌కు కేవలం ఒకే ఒక్క "డర్టీ పిక్చర్" సినిమాతో వచ్చింది. అంతే ..

ఒక్కసారిగా టాప్ రేంజ్‌కు వెళ్లిపోయింది విద్యా బాలన్.

విద్యా బాలన్ ఈ చిత్రం తర్వాత ఎంత శిఖరాగ్రం చేరుకోగలిగిందంటే, ఏకంగా 66 వ కేన్స్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌కు జ్యూరీ మెంబర్‌గా కూడా ఎన్నికయింది!

చివరికి, దేశంలోనే అత్యున్నతమయిన యూటీవీ మోషన్ పిక్చర్స్ 'సీ ఈ వో' సిధ్ధార్థ రాయ్ కపూర్ హృదయాన్ని కొల్లగొట్టి, ఆయన్ని పెళ్లికూడా చేసుకుంది విద్యా బాలన్.

దటీజ్ డర్టీ పిక్చర్! దటీజ్ సిల్క్ స్మిత!!

స్మిత వ్యక్తిగత జీవితంలోని మంచీ చెడులు మనకు పూర్తిగా తెలియవు. తెలియని వాటి గురించి జడ్జ్‌మెంట్లు ఇచ్చే హక్కు మనకు లేదు. ఒక  పాజిటివ్ కోణంలో అలోచిస్తే మాత్రం - తను  మరణించి కూడా సినీ ఫీల్డులోనూ, బయటా చాలా మంది హీరోయిన్లు, ఇతర నటీమణులకు ఒక మార్గదర్శి అయింది సిల్క్ స్మిత.

హిపోక్రాట్లు ఈ నిజాన్ని ఒప్పుకోవటం కష్టం. అది వేరే విషయం.

ఇప్పటి తారలెవరూ తమ జీవితాల్లో ఎలాంటి జటిల సమస్యలొచ్చినా భయపడటంలేదు. ఎంత సున్నిత మనస్కులైనా దేనికీ బెదరటంలేదు. అభద్రత అనే పదాన్ని వారి డిక్షనరీల్లోంచి తీసి అవతల పడేశారు.

వ్యక్తిగత జీవితంలో, ఒక మజిలీ నుంచి ఇంకో మజిలీకి చాలా ఈజీగా మూవ్ అవుతూ ముందుకెళ్తున్నారు. ఆత్మహత్యలు మాత్రం చేసుకోవడం లేదు. అసలు అలా చేసుకోవాల్సిన అవసరం లేదన్న నిజాన్ని అర్థం చేసుకున్నారు. అవసరమయితే తమ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తున్న ప్రియుడో, భర్తో, బంధువులో, ఆఖరికి అమ్మానాన్నలో.. ఎవరైనా సరే.. ఒక ప్రెస్ మీట్ పెట్టి బాహాటంగా బయటపడుతున్నారు తప్ప, తమ జీవితాల్ని అంతం చేసుకొనే పిరికి ఆలోచన మాత్రం ఇప్పటి సినీ తారలెవ్వరూ చేయటం లేదు. (ఇటీవలి కాలంలో జియాఖాన్ ఉదంతం ఒక్కటే ఇందుకు మినహాయింపు.)  

ఇది కేవలం కాలంతోపాటు వచ్చిన మార్పు మాత్రమే కాదు. సిల్క్ స్మిత లాంటివాళ్ల జీవితాలను చదివిన నేర్పుతో వచ్చిన మార్పు కూడా.

సిల్క్ స్మిత సాధించింది అదీ .. 

3 comments:

 1. సిల్క్ స్మిత జీవితం సినీ వినీలాకాశంలో తారాజువ్వలా దూసుకుపోయి ఒక్కసారిగా నేలరాలి మట్టిపాలైపోయింది!నటీమణులు ఆమె జీవితం నుండి గుణపాటాలు నేర్చుకొని తమను తాము సరిదిద్దుకోవాలి!

  ReplyDelete
 2. baaga rasahru ..ame jivitham loni samasyala gurinchi telisthe raayandi

  ReplyDelete
 3. ఎవరి జీవితం నుంచీ ఎవరూ పాఠాలు నేర్చుకోనక్కర్లేరు. ఎందుకంటే ఎవరి పరిస్థితులకు తగ్గట్టు వారు అప్పటికప్పుడు ప్రవర్తిస్తారు.

  ఎవరైనా ఆత్మ హత్య చేసుకున్నపుడు, జనం ..ఆత్మ హత్యలు పిరికి చర్యలనీ, జీవితాన్ని ఎదురుకోలేని వారు చేసిన పని అనీ చటుక్కున జడ్జ్ చేసేస్తుంటారు. కానీ ఇక పై ప్రపంచ నాటకం అంతా జరుగుతూనే ఉంటుందనీ, ప్రేక్షకుల్లో తమ సీటు మాత్రమే ఖాళీగా ఉంటుందనీ తెల్సి ఒకరు అంతటి నిర్ణయం తీసుకున్నారంటే వారికి ఎంతటి బాధ కల్గిందో, జీవితానుభవాలు వారిని ఎంతగా చిదిమేశాయో వారి చెప్పుల్లో కాళ్ళు పెట్టి ( ఎంపతీ తో) ఒక్క క్షణం ఆలోచించగలగాలి.

  జియా ఖాన్ అయినా మరొకరు అయినా అంతే!

  ఆత్మ హత్యలు చేసుకోడం మంచిదే అని నా ఉద్దేశం కాదు. జీవితం అంత విలువైనది ఈ సృష్టిలో ఇంకేమీ లేదు.

  ఆత్మ హత్య చేసుకోవాలనే ఆలోచన కల్గినపుడు సిల్క్ స్మిత కాదు కదా ఎవరి జీవితాలూ గుర్తుకు రావు.

  సిల్క్ స్మిత పుణ్యమా అని డర్టీ పిక్చర్ తో డబ్బు పేరు అవీ ఇవీ ఏక్తా కపూర్ తో సహా అందరూ సంపాదించారు.


  సిల్క్ స్మిత మాత్రం అందరి జ్ఞాపకాల్లో మిగిలి పోయింది.

  ఎప్పటికైనా ఆమె సాధించింది నలుగురి కన్నీటి బొట్లు... చేజారిన జీవితం..

  ప్చ్  జీవితాన్ని ధైర్యంగా చెప్పెట్టి కొట్టి మరీ ఎదురుకొంటున్న వారిని మాత్రం తప్పక అభినందించాల్సిందే


  చాలా బాగా రాశారు.

  ReplyDelete