Sunday 1 September 2013

"రిలీజ్ రైట్స్" కూడా వచ్చేస్తున్నాయి!

ఒక సినిమా హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వచ్చే ఆదాయం శాటిలైట్ రైట్స్. ఈ హక్కుల్ని కొనుక్కునేది టీవీ చానెల్స్ వాళ్లు. చానెల్స్ వాళ్లకి తమ చానెల్లో ఆ సినిమా వేసిన ప్రతిసారీ బోలెడంత అడ్వర్టైజింగ్ ఫీజు, స్పాన్సర్స్ డబ్బు దొరుకుతుంది.  ఈ అదాయం కోసమే టీవీ చానెల్స్ వాళ్లు సినిమాల హక్కుల్ని కొంటారు. అదే శాటిలైట్ రైట్స్.

పెద్ద బడ్జెట్ సినిమాలకంటే, మైక్రో బడ్జెట్ సినిమాలకే ఈ రైట్స్ ద్వారా వచ్చే డబ్బు బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.

అసలు మనవాళ్లు చేయాల్సినంత "మిస్ యూజ్" చేసేశారు. లేదంటే - ఈ శాటిలైట్ రైట్స్ ఒక్కదాని ద్వారా వచ్చే డబ్బుతోనే దాదాపు పూర్తి సినిమాను రూపొందించే ఆధునిక డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది. ఈ కోణంలో  చూసినప్పుడు శాటిలైట్ రైట్స్ అనేది చిన్న సినిమాలకు ఒక వరం లాంటిది.

ఒక సినిమాకు శాటిలైట్ రైట్స్ ఎంత వస్తుందనేది ఆ సినిమాకు మార్కెట్లో మనం ఇస్తున్న ప్రొజెక్షన్‌ను బట్టి, అందులో నటిస్తున్న ఆర్టిస్టులనుబట్టి, డైరెక్టర్ ఎవరు, టెక్నీషియన్ ఎవరు, బ్యానర్‌కు మార్కెట్లో ముందే ఏమయినా పేరుందా.. వంటి ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. దీనంతటి మీద ఆధారపడే శాటిలైట్ రైట్స్ రేట్ ఫిక్స్ చేయబడుతుంది.

సాధారణంగా సినిమా రిలీజ్‌కి ముందు రోజు నాటికే అగ్రీమెంట్ చేసుకున్న ఈ మొత్తం డబ్బు ప్రొడ్యూసర్ ఎకౌంట్లోకి వచ్చి పడిపోతుంది. ఇందులో ఎలాంటి చీటింగులు, స్పెక్యులేషన్లు, రెండోమాటలు ఉండవు.

దీనికి కారణం ఒక్కటే. చాలా సింపుల్. ఈ రైట్స్‌ని నిర్మాతలనుంచి కొనుక్కొనే థర్డ్ పార్టీలకు చానెల్స్ నుంచి కనీసం రెండు రెట్లు ఎక్కువ డబ్బు వస్తుంది! కేవలం ఒక రెండు మూడు నెలల్లో, ఎలాంటి రిస్కు లేకుండా అంత ఆదాయం!! అందుకే ఈ థర్డ్ పార్టీలన్నీ ఇంటర్నల్‌గా సిండికేట్ అయి ఉంటాయి. ప్రొడ్యూసర్లు డైరెక్టుగా చానెల్స్‌తో అగ్రీమెంట్ చేసుకొనే అవకాశం లేని పరిస్థితుల్ని చానెల్స్‌లో కూడా క్రియేట్ చేయగల సామర్థ్యం వీరికుంటుంది.

కట్ టూ రిలీజ్ రైట్స్ -

శాటిలైట్ రైట్స్ పధ్ధతిలోనే, "ఫిలిం రిలీజ్ రైట్స్" కూడా అతి త్వరలో వచ్చే రోజులు ముందున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే, వచ్చేశాయి కూడా! (అలాంటి ఖచ్చితమైన ఏర్పాట్లతోనే నేనిప్పుడు చేస్తున్న మైక్రో బడ్జెట్ సినిమాల నిర్మాణం జరుగుతోంది. హిందీలోకి కూడా ఎంటర్ అవుతున్నాం. అది వేరే విషయం.) సినీ రంగంలోకి కార్పొరేట్ల ఎంట్రీ దీనికి మార్గం సుగమం చేస్తోంది. ఇది కూడా చిన్న సినిమాల విషయంలోనే చాలా ప్రయోజనకరం అని వేరే చెప్పనవసరం లేదు అనుకుంటాను.

శాటిలైట్ రైట్స్ పధ్ధతిలో లాగే, ప్రతి సినిమాకు ఒక ధరను ఫిక్స్ చేసి అవుట్‌రైట్ పధ్ధతిలో కొనేయడమే "రిలీజ్ రైట్స్". ఈ రైట్స్ కొనుక్కున్నవాళ్లకే ఆ సినిమాని థియేటర్లలో ప్రదర్శించుకొనే అవకాశం ఉంటుంది. లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఇంక ప్రొడ్యూసర్లకు ఆ సినిమా ఆదాయంతో సంబంధం ఉండదు.

అయితే - ఈ రెండు రకాల రైట్స్‌తో, నిర్మాత అప్పటివరకు పెట్టిన పెట్టుబడి మొత్తం (కొంత లాభంతో) వచ్చేస్తుంది.  

ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా మార్కెట్ స్టామినాని గుర్తించిన రిలయన్స్, యూటీవీ, ఈరోస్ వంటి కార్పొరేట్లు ఇటువైపు కూడా ఒక కన్నేశారు. అవుట్‌రైట్‌గా సినిమాలను కొనే ప్రయత్నాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. యధాప్రకారం, వీటికి కూడా థర్డ్ పాటీవాళ్లు పుట్టుకొచ్చారప్పుడే!    

మనం ఎప్పుడూ వినే విషయం ఒకటుంది. కేవలం ఒక అయిదారుగురి చేతిలో రాష్త్రంలోని థియేటర్లన్నీ ఉన్నాయని. వాళ్లూ ఈ పనిని ఇంకా సులభంగా చేయవచ్చు. రిలీజ్ రైట్స్ ద్వారా ఇంకా బాగా సంపాదించుకోవచ్చు. కానీ చేయరు. కారణాలు అనేకం. అదింకో బ్లాగ్ పోస్టు అవుతుంది.

మరి మనకేంటి లాభం?

మంచి హిట్ ఇవ్వగల కంటెంట్ నిజంగా సినిమాలో ఉంటే - ఆ సినిమా తప్పక ఆడుతుంది. హిట్ అవుతుంది. ఆ సినిమా తీసిన దర్శక నిర్మాతలకు, నటించిన ఆర్టిస్టులకు, పని చేసిన టెక్నీషియన్లకు అది చాలు. ఆ సక్సెస్ బ్రాండ్‌తో వాళ్లు ఆ తర్వాత ఇంకెన్నో సినిమాలను చేయగలుగుతారు. చాలా ఈజీగా!

అప్పుడు వారికి మార్కెట్లో క్రియేటయ్యే డిమాండ్ ప్రకారం వారి రెమ్యూనరేషన్ల రేంజ్ ఉంటుంది. ఓవర్‌నైట్‌లో ఎంతో ఫేమ్ కూడా వస్తుంది. సినిమా ఫీల్డుకు సంబంధించి అంతటితో వారి లక్ష్యం దాదాపు నెరవేరినట్టే.

కట్ టూ ఫినిషింగ్ టచ్ -

శాటిలైట్ రైట్స్‌కి తోడుగా ఈ "రిలీజ్ రైట్స్" కూడా ఎలాంటి స్పెక్యులేషన్ లేకుండా ష్యూర్‌గా స్థిరపడిందనుకోండి. ఇంక చిన్న నిర్మాతలకు నష్టం అనేదే ఉండదు. సినిమా నిర్మాణం అప్పుడు గ్యాంబ్లింగ్ ఏ మాత్రం కాదు. అప్పుడు సినిమాలోని కంటెంట్, కథే నిజమైన హీరోలవుతాయి. వెరైటీ కథలొస్తాయి.

అప్పుడు ఓడిపోకుండా ఉండాలన్న కాలిక్యులేషన్స్‌తో సినిమాలు తీయరు. గెలవాలన్న లక్ష్యంతో సినిమాలు తీస్తారు. ఈ రెండు దృక్కోణాల్లో ఎంత తేడా ఉంటుందో మీకూ తెలుసు. 

3 comments:

 1. సిండికేట్ లు,థర్డ్ పార్టీ వాళ్ళను avoid చేయగలిగితే మంచిది!

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పింది నిజమే, కానీ అదంత సులభం కాదు. వ్యవస్థలు అలా వేళ్లూనుకుపోయి ఉన్నాయి. :)

   Delete
 2. మధ్య దళారీ వ్యవస్థలను సమూలంగా రూపు మాపాలి!ఈదేశంలో అడ్డగోలుగా ఇలాంటి కుక్కగొడుగులు వెలుస్తున్నాయి!ఈదేశం బాగుపడడం ఇక నా జన్మలో చూడలేను అంటే అయిదేళ్లలో!

  ReplyDelete