Thursday 26 September 2013

"టెర్మినేటర్" స్క్రిప్టును 1 డాలర్‌కే అమ్ముకున్న డైరెక్టర్!

టైటానిక్, అవతార్ వంటి బ్లాక్‌బస్టర్ లను తీసిన హాలీవుడ్ డైరెక్టర్ జేమ్‌స్ కెమెరాన్ గురించి తెలియని వారుండరు. కానీ -

1981 లో కెమెరాన్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. "పిరానా 2" అనే ఓ లో బడ్జెట్ హారర్ సినిమా తీసిన దర్శకుడిగా తప్ప, అతనికి ఎలాంటి గుర్తింపులేదు. హాలీవుడ్‌లో అతను దాదాపు ఎవరికీ తెలియదు.

నిజానికి ఈ  పిరానా 2 సినిమాను  ఇటలీలో షూట్ చేస్తున్న సమయంలోనే నానా సినిమా కష్టాలు పడ్దాడు కెమెరాన్. తను తీస్తున్న హారర్ సినిమా కంటే హారిబుల్‌గా ఉండేవి ఆయన పడే ఇబ్బందులు. నిద్ర అసలు పట్టేది కాదు. అస్వస్థత పాలయ్యాడు కూడా.

ఇటలీలోనే, అలాంటి ఒక నిద్ర పట్టని రాత్రి, కెమెరాన్‌కు ఒక నైట్‌మేర్ లాంటి కల వచ్చింది. కిచ్చెన్ లోని రకరకాల కత్తులను చేతిలో పట్టుకొన్న ఒక మెకానికల్ స్కెలిటన్ మంటల్లోంచి, పేలుళ్లలోంచి తనని తను ఈడ్చుకుంటూ వెళ్తూ కనిపించింది.

కలలో వచ్చిన ఆ "ఇమేజ్" కెమెరాన్ మైండ్‌లో అలా స్థిరపడిపోయింది. అదే తర్వాత అలా అలా డెవెలప్ అయి, మనిషి బాడీలోపల ఉండే ఒక రోబోటిక్ స్కెలిటన్‌గా అవతారం ఎత్తి, చివరికి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో మిక్స్ చేసిన  "టెర్మినేటర్" స్క్రిప్టుగా కెమెరాన్ చేతుల్లో రూపుదిద్దుకొంది.

ఈ స్క్రిప్టు పనంతా కెమెరాన్ ఎప్పుడు చేశాడనుకున్నారు?

తను తీసిన పిరానా 2  అంతగా నడవలేదు. మరిన్ని ఇబ్బందుల్లో పడిపోయాడు కెమెరాన్. ఉండటానికి ఇల్లు కూడా లేక ఫ్రెండ్స్ రూముల్లో షెల్టర్ తీసుకొని "టెర్మినేటర్" స్క్రిప్ట్ పూర్తి చేశాడు కెమెరాన్.

కట్ టూ వన్ డాలర్ - 

కెమెరాన్ రాసిన టెర్మినేటర్ స్క్రిప్ట్ చదివి, అతని హాలీవుడ్ ఏజెంట్  నిర్మొహమాటంగా "నో" చెప్పాడు. అసలు కెమెరాన్ అలాంటి స్క్రిప్ట్ రాసినందుకు చిరాకుపడ్దాడు.

అయితే కెమెరాన్ నిరాశ పడలేదు. తన ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఎవరూ ఆ స్క్రిప్టుని ఓకే చేయలేదు.

చివరికి, గేల్ యాన్ హర్డ్ అనే నిర్మాతకు ఆ స్క్రిప్టులో సంథింగ్ ఏదో ఉందనిపించింది. ఆమె అంతకు ముందు రోజర్ కార్మన్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసింది. అలాగే న్యూ వరల్డ్ పిక్చర్స్ బ్యానర్లో కూడా పనిచేసిన అనుభవం ఉందామెకు. డీల్ కుదిరింది.

ఒకే ఒక్క డాలర్‌కు ఆ స్క్రిప్టును గేల్ హర్డ్‌కు అమ్మేశాడు కెమెరాన్. కాకపోతే ఒక కండిషన్‌తో. డైరెక్షన్ చాన్స్ మాత్రం కెమెరాన్‌కే ఇవ్వాలి! అలాగే అని ప్రామిస్ చేసింది గేల్.

తర్వాతంతా చరిత్రే.

టెర్మినేటర్ చిత్రం కెమెరాన్‌కు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో మిలియన్ల వర్షం కురిపించింది. తర్వాత దానికి ఎన్నో సీక్వెల్స్ కూడా వచ్చాయి.

కొసమెరుపు -

టెర్మినేటర్ చిత్రంలో నటించినంత కాలం అర్నాల్డ్ ష్వార్జ్‌నిగ్గర్ "ఆ.. ఏదో తలతిక్క సినిమా.. చేస్తున్నాను" అని చాలా తక్కువచేసి చెప్పేవాడట. తర్వాత, ఆ తలతిక్క సినిమాతోనే అర్నాల్డ్ కూడా టాప్ రేంజ్‌కెళ్లాడన్న విషయం అందరికీ తెలిసిందే.

సో, ఒక "బ్రేక్" అంటూ వచ్చేదాకా సినిమా కష్టాలు కెమెరాన్‌కు కూడా తప్పలేదన్నమాట! 

No comments:

Post a Comment