Friday 16 August 2013

ఒక మిలియన్ డాలర్లు చాలు!

వరలక్ష్మీ వ్రతం ఆడవాళ్లు చేసుకొనే పూజేనా కాదా.. ఆ రోజు పూజ చేస్తే డబ్బులు బాగా వస్తాయా రావా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. కనీసం ఈ ఒక్క రోజయినా మనం మన ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచిస్తాం. ఇంకా ఏం కావాలో, ఎంత కావాలో ఆలోచిస్తాం.

ఈ విషయంలో నాకు ఇంతకు మించిన క్లారిటీ అవసరం లేదు.

పొద్దుట లేవగానే ఒక పది నిమిషాలపాటు ఫేస్‌బుక్‌లో ఏదో ఒక "నాన్‌సెన్స్" పోస్ట్ చేయడం నాకలవాటు. ఇవాళ పొద్దుటే ఎందుకో కుదర్లేదు. తర్వాత ఆఫీసుకి వెళ్లేటప్పుడు హడావిడిగా నా నోట్‌బుక్ ఓపెన్ చేసాను. సందర్భంగా ఉంటుందని - లక్ష్మీదేవి ఫోటో ఒకటి పోస్ట్ చేస్తూ, "మనందరికీ లక్ష్మీదేవి కావల్సినంత ధనాన్ని ఇచ్చి అశీర్వదించుగాక!" అని ఓ లైన్ రాసి పోస్ట్ చేసేశాను.

ఉన్నట్టుండి నాలోంచి బయటికి వచ్చాడు.. నా 'డబుల్ యాక్షన్'-ఉరఫ్-'డీఏ'.

"ఏంటి.. నీకీ కొత్త అలవాటు ఎప్పట్నించి?" ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు డీఏకి నేనిచ్చిన సమాధానమే ఈ పోస్టు ప్రారంభంలో నేను రాసిన మొదటి రెండు పేరాలు!

అందరి సెంటిమెంట్లనూ నేను మనస్పూర్తిగా గౌరవిస్తాను. నా సెంటిమెంటు మాత్రం నాదే. అదే నా క్లారిటీ.

"సరే, ఏమాలోచించావు మరి ఇవాళ?" అడిగాడు నాలోని డీఏ.

"అలోచించిందంతా చెప్పనా.. అంకె చెప్పనా?" అడిగాన్నేను.

"అంకె చెప్పు చాలు!" నీ సొదంతా యెవడు వింటాడు అన్న ఫీలింగ్‌తో అన్నాడు డీఏ.

"వన్ మిలియన్ డాలర్స్!" చెప్పాన్నేను.

"యూ ఎస్ కరెన్సీలో చెప్తున్నావు!?"

"ఇండియన్ కరెన్సీలో చెప్తే అంత కిక్ రాదు!"

"పెద్ద కోరికేం కాదు. నువ్వు చచ్చేలోపు ఆ మాత్రం సంపాదించలేకపోతే వేస్టు!"

"చచ్చేలోపు కాదు. వచ్చే సంవత్సరం లోపు! అంటే, జస్ట్ ఇంకో 365 రోజుల్లో!!" అన్నాన్నేను.

అదిరిపడి చూశాడు డీఏ.

"అంత ఈజీ కాదనుకుంటాను.." లో వాయిస్‌తో అన్నాడు డీఏ.

"కొంచెం కష్టమే కావొచ్చు. బట్, ఆ అంకె నాకిష్టం." స్థిరంగా చెప్పాన్నేను.

"నిన్ను మార్చడం నావల్ల కాదు. అయినా.. ఆల్ ది బెస్ట్!" మనస్పూర్తిగా చెప్పాడు డీఏ.

కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత మళ్లీ గొంతు సవరించుకున్నాడు డీఏ.

"నువ్వింకా సినిమానే మొదలెట్టలేదు. సీన్లు మాత్రం బాగా క్రియేట్ చేస్తున్నావు. కౌంటింగ్ మిషన్ కొన్నావా మరి?"

"బ్లాక్ అయితే కౌంటింగ్ అవసరం. నాకు బ్లాక్ ఇష్టం లేదు. అంతా వైటే!"

"నువ్విప్పుడు చేస్తున్న సినిమాల ద్వారా ఇదంతా అయ్యేదేనా?" కొంచెం డల్ అయింది డీఏ వాయిస్.

"365 రోజుల్లో అవాలంటే మాత్రం ఒక్క సినిమాల్లోనే అవుతుంది!" నాలో కాన్‌ఫిడెన్స్ లెవెల్ మరింత పెరిగింది.

"ఇంకో చోట కూడా అవుతుంది.. గ్యాంబ్లింగ్!" ఏదో కొత్త విషయం కనుక్కున్నట్టుగా, తనకూ అంతో ఇంతో  తెలుసన్నట్టుగా నవ్వుతూ అన్నాడు డీఏ.

"సినిమా కూడా గ్యాంబ్లింగే!"

నాకు తెలిసిన ఆ ఒక్క ముక్క తాపీగా చెప్పేసి, నా పనిలో నేను మునిగిపోయాను.

దానికి నా 'డబుల్ యాక్షన్'-ఉరఫ్-'డీఏ' రియాక్షన్ ఎలా ఇచ్చాడో నేను చూడలేదు. అక్కడ్నించి మాయమయిపోయినట్టుగా ఒక ఫ్లాష్ సౌండ్ ఎఫెక్ట్ మాత్రం విన్నాను. 

2 comments:

 1. HaHaHa Mee DA Super andi :)
  Adi matram nijam 265 days lo sampadinchalante matram cinema thone sadyam....

  ReplyDelete
  Replies
  1. థాంక్స్. కాని, డెడ్‌లైన్ 265 రోజులు కాదు. 365! :)

   Delete