Sunday 4 August 2013

ఆస్కార్ అవార్డ్ చిత్రానికి పనిచేసిన మన కిషోర్! [షాట్ బై షాట్ 3]

నా ఫేస్‌బుక్ పేజ్ ద్వారా పరిచయమయ్యాడు కిషోర్. "ఒక సారి మిమ్మల్ని కలుస్తాను సార్!" అంటుండేవాడు ఎప్పుడూ. ముందు ఫేస్‌బుక్ మెసేజ్‌లు, తర్వాత ఫోన్ కాల్స్.

ఒక రోజు అనుకోకుండా కిషోర్ ప్రొఫైల్ చూశాను. వెంటనే కలుద్దాం రమ్మన్నాను.

మా ఇంటికి దగ్గర్లో ఉన్న కాఫీ డేలో ఒక సాయంత్రం కలిశాము. తనతో పాటు తన అసిస్టెంట్ రాహుల్ కూడా వచ్చాడు. కాఫీ తాగుతూ చాలా సేపు మాట్లాడుకున్నాము.

కిషోర్ పుట్టింది విజయవాడ. నాన్న దుర్గా మల్లేశ్వర రావు, అమ్మ కనకలక్ష్మి. రవి, అనిల్ - కిషోర్ సోదరులు.

మా సంభాషణ చివర్లో ఒక విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. సుమారు 9 ఏళ్ల క్రితం ఇదే కిషోర్ నా తొలి చిత్రం "కల" కి సెకండ్ కెమెరా అసిస్టెంట్‌గా మా టీమ్‌తో మారిషస్ వచ్చాడు! అప్పుడు బహుశా కిషోర్‌కి 18 కూడా పూర్తిగా నిండి ఉండవు. మా కెమెరామాన్ శంకర్‌ గారికి  లెన్స్‌లు అందిస్తూ, కెమెరాని అటు మోస్తూ, ఇటు మోస్తూ, దాన్ని స్టాండుకి ఫిక్స్ చేస్తూ, తీస్తూ, తుడుస్తూ...ఒక కెమెరా అసిస్టెంట్‌గా ఎప్పుడూ తన పనిలో తాను మునిగిపోయి ఉండేవాడు కిషోర్.

అప్పటి ఆ సెకండ్ కెమెరా అసిస్టెంట్ కిషోర్, తర్వాత ముంబై వెళ్లాడు. అక్కడి పరిచయాలు, అతని వ్యక్తిగత ప్రవర్తన, పనితీరు అతని దశని, దిశనీ మార్చేశాయి. కట్ చేస్తే - ఆ తర్వాత కనీసం ఒక అర డజన్ హాలీవుడ్ చిత్రాలకు పనిచేశాడు. వాటిల్లో, ఎనిమిది ఆస్కార్ అవార్డులు సాధించిన మాస్టర్ పీస్ "స్లమ్‌డాగ్ మిలీయనేర్" ఒకటి. "మిషన్ ఇంపాజిబుల్ 4"  రెండోది! (పైన ఫోటోలో కెమెరా దగ్గర కూర్చున్నది కిషోర్. వెనకే "స్లమ్‌డాగ్ మిలియనేర్" డైరెక్టర్ డేనీ బాయల్ ఉన్నారు. తను మాట్లాడుతోంది DOP ఆంథొనీ మాంటిల్‌తో.)

కట్ టూ "షాట్ బై షాట్" విత్ కిషోర్ -
^^^


అసలేంటి మీ రంగుల కల? ఏం కావాలనుకొని మీరీ ఫీల్డులోకొచ్చారు? ఏ సంవత్సరం?
ఇండస్ట్రీలోకి రావాలన్నదే నా కల. సినిమాటోగ్రాఫర్ కావాలనుకున్నాను. 2002 లో రవిప్రసాద్ యూనిట్‌లో కెమెరా అసిస్టెంట్‌గా చేరటంతో ఇండస్ట్రీలో నా కెరీర్ మొదలైంది.

ఫీల్డులో మీకు మొట్టమొదటగా పరిచయమైన.. మీరు మర్చిపోలేని వ్యక్తి లేదా వ్యక్తులు ఎవరు?
2007 లో నేను ముంబైకి వెళ్లాక నాకు అక్కడ జి మోనిక్ కుమార్ పరిచయమయ్యారు. నా పని తీరు చూసి, తన దగ్గర పని ఉంది రమ్మంటూ ఆఫర్ చేశారు. అప్పుడు నాకు వివరాలేం తెలియవు. కానీ, అదొక ఇంగ్లిష్ సినిమా అని మాత్రం చెప్పారు. అదే "స్లమ్‌డాగ్ మిలియనేర్." ప్రపంచ సినిమాటోగ్రాఫర్స్‌తో నా ప్రయాణం అలా ప్రారంభమయింది. అలా, మోనిక్ కుమార్ నాకు మంచి మిత్రులు, గురువు కూడా.  

"స్లమ్‌డాగ్ మిలియనేర్"కు పని చేయటం ఒక గొప్ప ఎక్స్‌పీరియన్స్. ఇంక ఆ తర్వాత వెనుతిరిగి చూసే అవకాశమే రాలేదు. ఒకదానివెంట ఒకటి.. చాలా అవకాశాలొచ్చాయి. ఎప్పుడూ పనిచేస్తూనే ఉన్నాను.

ఫీల్డులో మీరు బాధపడిన సందర్భం కానీ, మర్చిపోలేని చేదు జ్ఞాపకం గానీ ఏదయినా ఉందా? ఉంటే ఏంటది?
అలాంటివేమీ లేవు. కాకపోతే - మనం ఎంతో ప్యాషన్‌తో, ఎంతో కష్టపడి పనిచేసిన సినిమా ఏదయినా రిలీజ్ కావడం ఆలస్యమౌతుంటే మాత్రం చాలా బాధేస్తుంది.

ఫీల్డులో మీరు మర్చిపోలేని మధురస్మృతి?  
నేను పనిచేసిన "స్లమ్‌డాగ్ మిలియనేర్"కు 8 ఆస్కార్ అవార్డులు రావటం ఒక గొప్ప అనుభూతి. "మిషన్ ఇంపాజిబుల్" 1,2,3 లకు నేనో పెద్ద ఫ్యాన్‌ని. అలాంటిది.. "మిషన్ ఇంపాజిబుల్ -4"కు కెమెరా డిపార్ట్‌మెంట్‌లో పని చేసే అవకాశం రావటం కూడా నాకు నిజంగా ఒక మధురస్మృతే.

ఈ మధ్యే ఒక కొత్త ప్రాజెక్టు గురించి చర్చించడానికి దర్శకుడు మనోహర్ చిమ్మని గారిని కలిశాను. ఆ సమయంలోనే నేనొక విషయం రియలైజ్ అయ్యాను. ఏంటంటే, మనోహర్ గారి తొలి చిత్రం "కల" టీమ్‌లో నేను కూడా కెమెరా డిపార్ట్‌మెంట్లో పనిచేశాను. షూటింగ్ కోసం నేను వెళ్లిన మొదటి ఫారిన్ ట్రిప్ కూడా అదే. సో, మేమిద్దరం మళ్లీ అప్పటి మారిషస్ షూటింగ్ జ్ఞాపకాలు నెమరేసుకున్నాం. అదొక మంచి అనుభూతి.  

నేను మర్చిపోలేని మధురస్మృతి ఇంకొకటి చెప్పాలనిపిస్తోంది. "ది లెటర్స్" అనే హాలీవుడ్ సినిమాకు ఇటీవలే ఒక 3 నెలలపాటు పనిచేశాను. ఆ సినిమా షూటింగ్ 20 రోజులపాటు గోవాలో జరిగింది. ఆ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ (DOP) జాక్ గ్రీన్. ఆపరేటివ్ కెమెరామాన్ అతని కొడుకు పీటర్ గ్రీన్. నేనూ, నా పనీ వాళ్లిద్దరికీ బాగా నచ్చింది. ఇద్దరూ నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు. షూటింగ్ పూర్తయ్యాక చివరి రోజు జాక్ గ్రీన్ నాతో ఒక మాటన్నారు. "ఈ రోజు నుంచీ నువ్వు కూడా నాకు కొడుకువే! ఇకనుంచీ నీ పేరు కిషోర్ గ్రీన్!!" అని. ఆ రోజుని కూడా నేను మర్చిపోలేను.       

ఇప్పటి వరకు మీరు ఫీల్డులో ఎన్ని సినిమాలు చేసారు? 
ఫోకస్ పుల్లర్‌గా, ఫస్ట్/సెకండ్ కెమెరా అసిస్టెంట్‌గా తెలుగు, తమిళం, మళయాళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సుమారు 30 సినిమాలకు పని చేసాను. టీవీ కమర్షియల్స్ కూడా చాలా చేశాను.  "బాయ్ మీట్స్ గాళ్", "సంద్రం" అనే ఈ రెండు తెలుగు సినిమాలకు ఈ మధ్యే (2013) పూర్తిస్థాయి సినిమాటోగ్రాఫర్‌/డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ (DOP) గా పనిచేశాను.  అవి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

ఒకవేళ ఫీల్డులోకి రాకపోయి ఉంటే ఏమయ్యేవారు మీరు? 
దాదాపు మా కుటుంబమంతా సినిమాలోనే ఉంది. మా నాన్న దుర్గా మల్లేశ్వరరావు గారు మంచి స్టేజ్ ఆర్టిస్టు, పెయింటర్, మంచి రైటర్ కూడా. నా చిన్నతనంలో మా నాన్న ఫోటో సీరియల్స్ చేస్తుండేవారు. మా అన్నయ్య ఇటీవలివరకూ ముంబైలోనే కెమెరా డిపార్ట్‌మెంట్లోనే పనిచేశారు. మా ఇంకో సోదరుడికి ఈ మధ్యే డైరెక్టర్‌గా ఒక ప్రాజెక్ట్ వచ్చింది. అది త్వరలో మొదలవబోతోంది. అలాగే మా నాన్న ఇద్దరు తమ్ముళ్లు కూడా ఫీల్డులోనే ఉన్నారు. ఒకరు సినిమాటొగ్రాఫర్ రామ్ కుమార్. మరొకరు ప్రముఖ PRO బి ఏ రాజు. ఇలా మా కుటుంబమంతా సినిమా ఫీల్డులోనే ఉంది. సినిమా తప్ప వేరొకదాని గురించి నేనసలు ఆలోచించలేదు.

విజయవాడ నుంచి హైద్రాబాద్ రాగానే ఒక షూటింగ్ చూడ్డానికెళ్లాను. అక్కడ పని చేస్తున్న ప్రతి ఒక్కరినీ గమనించాను. అప్పుడే నేను డిసైడ్ అయిపోయాను సినిమాటోగ్రాఫర్ కావాలని. అయ్యాను.

ఇప్పుడు ఫీల్డులో మీ ప్రధాన లక్ష్యం ఏంటి? ఇంకా ఏం కావాలని? 
ఇంకా బాగా కష్టపడాలి. ఫీల్డులో ఒక మంచి సినిమాటోగ్రాఫర్‌గా, మంచి మనిషిగా పేరు తెచ్చుకోవాలి. అంతే.

సినీ ఫీల్డు మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడెలా ఉంది ఫీల్డు.. ఇకముందు ఎలా ఉండబోతోంది? 
సినీ ఫీల్డంటే నాకు చాలా గౌరవం. ఈ ఫీల్డు మీద ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు బ్రతుకుతున్నాయి. అయితే - సినిమా ప్రొడక్షన్ విషయంలోనూ, రిలీజ్ విషయంలోనూ చాలా మార్పులు రావాలి ఇక్కడ. ఫిలిం మేకింగ్‌లో ఆధునికంగా, వేగంగా వస్తున్న మార్పుల్నీ, అభివృధ్ధినీ ఇండస్ట్రీ ఎప్పుడూ ఆహ్వానించాలి. అడ్డుపడకూడదు. అలాగే - కేవలం కొంతమంది చేతుల్లోనే థియేటర్లు ఉండటం దురదృష్టకరం. చిన్న సినిమాల ప్రదర్శనకు పెద్ద ఆటంకమైన ఇలాంటి ధోరణులు సమూలంగా తొలగిపోయే మార్పు ఇండస్ట్రీలో రావాలి. దీనికి ఇంకొంత సమయం పడుతుంది. కానీ ఆ మార్పు తప్పక వస్తుంది.
^^^
 

కట్ టూ నగ్నచిత్రం -

కిషోర్ పెద్దగా చదువుకోలేదు. సినిమాటోగ్రఫీ గురించి కూడా ఏ ఫిలిం స్కూలుకి వెళ్లలేదు. పని చేస్తూ నేర్చుకున్నదే అంతా! "ముందు మనం చేసే పనిని గౌరవించాలి" అంటాడు కిషోర్. అలాగే, "నాకు పెద్ద ఎడ్యుకేషన్ లేకపోవడం అనేది ఒక అడ్దంకిగా నాకెప్పుడూ అనిపించలేదు" అంటాడు మన కిషోర్. ఆ నిజం మనం ఒప్పుకోవాలి. డేనీ బాయల్, బ్రాడ్ బర్డ్ వంటి హాలీవుడ్ డైరెక్టర్స్‌తో పని చేసాడు కిషోర్!

కిషోర్ నాన్నకి డ్రామా అన్నా, సినిమా అన్నా చాలా ఇష్టం. ఆయన నుంచే కిషోర్‌కి సినిమా మీద, సినిమాటోగ్రఫీ మీదా ఆసక్తి పెరిగింది. దురదృష్టవశాత్తూ కిషోర్ నాన్న కేవలం ఒక వారం క్రితం మొన్న సోమవారమే (29 జూలై) మరణించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలనీ, మన కిషోర్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలనీ, తన కలలన్నీ నిజం చేసుకోవాలనీ మనసారా కోరుకుందాం ..
^^^
Follow Kishore on Facebook:
https://www.facebook.com/kishor.boyidapu     

3 comments:

  1. All the best for bright fuetur

    ReplyDelete
  2. దుర్గా కిషోర్ బోయిడపు గారితో ముఖాముఖి బాగుంది!సినిమా కుటుంబం నుంచి వచ్చినవారు cinematographyని వృత్తిగా చేసుకోవడంలో ఆశ్చర్యం లేదు!

    ReplyDelete
  3. All the Best ............Brother...........

    ReplyDelete