Sunday 28 July 2013

నచ్చావులే, మాధవీలత! [షాట్ బై షాట్ 2]

"కళ్లు వెళ్లిన ప్రతిచోటికి మనసు వెళ్లకూడదు. మనసు వెళ్లిన ప్రతి చోటికి మనిషి వెళ్లకూడదు!"

ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. సుమారు ఒక నలభై నిమిషాల మా సంభాషణలో ఇలాంటి స్వచ్ఛమైన తెలుగు మాటలు, కవితాత్మకమైన వ్యక్తీకరణలు ఎన్నో ఆమె నోటి వెంట అలవోకగా, అందంగా, అలా అలా దొర్లాయి. అన్నట్టు, తను కవిత్వం కూడా రాస్తుంది అప్పుడప్పుడూ.

ఆమే "నచ్చావులే"  హీరోయిన్ మాధవీలత.

మాధవీలత నాన్న రైల్వే ఉద్యోగి. అమ్మ గృహిణి. ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. ముగ్గురు చిన్నారి కోడళ్లు కూడా ఉన్నారు. అందరూ కర్నాటకలో ఉంటారు. ఒక్క చిన్నన్నయ్య మాత్రం ఉద్యోగరీత్యా 'ఆర్మీ'లో ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో ఉంటున్నారు. ఉద్యోగరీత్యానే మాధవీలత కుటుంబం కర్ణాటకలో ఉంటోంది కానీ, వారి స్వస్థలం ప్రకాశం జిల్లాలో ఓ చిన్న గ్రామం.

ఎమ్మే సోషియాలజీ (మైసూర్ యూనివర్సిటీ), ఎమ్మెస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ (UK) చేసిన మాధవీలత పుట్టింది హుబ్లీలో. అక్టొబర్ 2 ఆమె పుట్టిన రోజు కావడం మరొక విశేషం.

కట్ టూ "షాట్ బై షాట్" విత్ మాధవీలత -
^^^

మాధవీలతా, అసలేంటి మీ రంగుల కల? ఏం కావాలనుకొని మీరీ ఫీల్డులోకొచ్చారు? ఏ సంవత్సరం?

హీరోయిన్ కావాలనుకునే నేను ఫీల్డులోకొచ్చాను. అది నా చైల్డ్‌హుడ్ డ్రీమ్. 2008 లో నేను ఫీల్డులోకి ఎంటరయ్యాను.

ఫీల్డులో మీకు మొట్టమొదటగా పరిచయమైన.. మీరు మర్చిపోలేని వ్యక్తి లేదా వ్యక్తులు ఎవరు?

నేను దేనికీ ఎక్జయిట్ అవని కేరెక్టర్‌ని. సో, నాకు అంత గొప్పగా చెప్పుకొనే పరిచయం ఏదీ ఇండస్ట్రీలో జరగలేదు. ఎవరూ నాకంత స్పెషల్ అనిపించలేదు.

ఇండస్ట్రీలోకి రాకముందు మాత్రం నాక్కొన్ని ఫీలింగ్స్ ఉండేవి. జీవితంలో చిరంజీవిగారిని ఒక్కసారి చూడాలి. నా ఫేవరేట్ హీరో శ్రీకాంత్ గారిని ఒక్కసారి చూడాలి. నాకు బాగా నచ్చిన ప్రభాస్ గారిని ఒక్కసారి చూడాలి.. ఇలా కొన్ని ఫీలింగ్స్ ఉండేవి.  కానీ, ఒక్కసారి ఫీల్డులోకి ఎంటర్ అయ్యాక అన్నీ మారిపోతాయి.

మీకు వచ్చిన తొలి ఫిలిం చాన్స్ ఏది? ఆ చాన్స్ మీకు ఎలా ఉపయోగపడింది? ఎలాంటి కిక్ ఇచ్చింది?

నాకు వచ్చిన తొలి ఫిలిం చాన్స్‌తో నేను చేసిన సినిమా వేరే ఉంది. అయితే అదింకా రిలీజ్ కాలేదు. సో, ముందుగా ఆడియెన్స్‌లోకి వచ్చిన సినిమానే నేను నా తొలి సినిమాగా భావిస్తాను. అది - "నచ్చావులే" సినిమా. ఆ సినిమా ఓపెనింగ్‌కి రామోజీ రావు గారు రావటం అనేది నేనిప్పటికీ మర్చిపోలేను.

ఈ రోజు మాధవీలత అనే ఒక అమ్మాయి ఉంది అని ఆడియెన్స్‌కు గానీ, ఇండస్ట్రీకి గానీ నేనుగా చెప్పుకోవాల్సినంత అవసరం లేనంత గుర్తింపుని "నచ్చావులే" నాకిచ్చింది. నా పేరు చెప్పినా సినిమా పేరు చెప్తారు. సినిమా పేరు చెప్పినా నా పేరు చెప్తారు. కాకపోతే, దాన్ని నేనే సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాను. కారణాలు చాలా ఉన్నాయి. ఒకవైపు డాడీ చదువుకోమన్నారు. మరో వైపు నా ల్యాక్  ఆఫ్ ఇన్నోసెన్స్, ఫీల్డులో నా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్, నా కాంటాక్ట్స్, నెట్‌వర్కింగ్ ప్రాబ్లమ్... ఇలా ఏవేవో. మొత్తానికి నేనే చాలా మిస్ చేసుకున్నాను.

ఫీల్డులో మీరు బాధపడిన సందర్భం గానీ, మర్చిపోలేని చేదు జ్ఞాపకం గానీ ఏదయినా ఉందా? ఉంటే ఏంటది?

అలాంటిదేమీ లేదు. నేను చాలా స్పోర్టివ్‌ని. మరోవైపు చాలా ఎమోషనల్‌ని కూడా. ఈ సందర్భంగా ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను.

ఫీల్డులోకి వచ్చేముందు మైండ్‌ని స్ట్రాంగ్‌గా ఫిక్స్ చేసుకొని రావాలి. ఫోకస్ అంతా మన లక్ష్యం మీదే ఉండాలి.

అందుకే, నాకు ఎంత అరచేతిలో స్వర్గం చూపించినా నేనసలు పట్టించుకోను. ఐ బిలీవ్ వాట్ ఐ బిలీవ్. అంతే. అందుకే నాకు ఫీల్డులో ఎలాంటి చేదు అనుభవాలుగానీ, జ్ఞాపకాలు లేవు. ఇకముందు కూడా నాకు ఎలాంటి చేదు అనుభవాలు, జ్ఞాపకాలుండవు.

ఎందుకంటే - ఇండస్ట్రీలో ఒకసారి సక్సెస్ వచ్చాక కష్టాలు చాలా తక్కువగా ఉంటాయి!

ఫీల్డులో మీరు మర్చిపోలేని మధుర స్మృతి?

హీరోయిన్ కావాలన్న నా కల నిజం కావటం. నేను నటించిన నా తొలి సినిమానే ఒక పెద్ద హిట్ కావటం.

ఇప్పటివరకు మీరు ఫీల్డులో ఎన్ని సినిమాలు చేశారు?

నచ్చావులే, స్నేహితుడా, మంచివాడు (స్పెషల్ అప్పియరెన్స్), అరవింద్-2, చూడాలని చెప్పాలని.. ఇవీ ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు. ఇప్పుడొక ప్రత్యేకమైన సినిమా చేస్తున్నాను. మొన్న 25 వ తేదీ నుంచే దాని షూటింగ్ ప్రారంభమయింది. 1950 లలోని కథ. నేషనల్ అవార్డుని పొందగల స్థాయి కూడా ఈ సినిమాకుంది.  కృష్ణ వాసా దర్శకుడు.

అంటే, ఇలాంటి ఒక మంచి స్క్రిప్టుతో మీ దగ్గరకు వస్తే, మీ రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టించుకోరనుకోవచ్చా?

అవును. కృష్ణ వాసా సినిమాకి నేనిప్పుడు కేవలం ఒక నామమాత్రపు రెమ్యూనరేషన్‌నే తీసుకుంటున్నాను.  

ఒకవేళ మీరు ఫీల్డులోకి రాకపోయి ఉంటే.. ఏమయ్యేవారు? ఏం చేస్తూ ఉండేవారు?

ఛాన్సే లేదు. ఫీల్డులోకి రావాలి, నటించాలి అన్నది నా ఫిఫ్త్ క్లాస్ నాటి డ్రీమ్! అమ్మ నేను పోలీస్ ఆఫీసర్ కావాలనుకొంది. నాన్న నేనొక డాక్టర్ కావాలనుకొన్నారు. నేను జర్నలిస్ట్ కావాలనుకొన్నాను. చివరికి నేను ఫిక్స్ అయ్యింది హీరోయిన్ దగ్గర! హీరోయిన్ కావాలనుకొన్నాను. అయ్యాను.  

ఇప్పుడు ఫీల్డులో మీ ప్రధాన లక్ష్యం ఏంటి? ఇంకా ఏంకావాలని?

స్టార్ హీరోయిన్ అవాలి. తర్వాత ఒక నేషనల్ అవార్డ్ తీసుకోవాలి. స్టార్ హీరోయిన్ అవుతానా లేదా.. నేషనల్ అవార్డ్ తీసుకుంటానా లేదా అన్నది సెకండరీ. ఇప్పుడు నేను పెట్టుకొన్న లక్ష్యాలు అవి. కలలు కనడంలో తప్పులేదు. వాటిని నిజం చేసుకొనే ప్రయత్నం  మాత్రం తప్పక చేయాలి.  

సినీ ఫీల్డుమీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడెలా ఉంది ఫీల్డు.. ఇకముందు ఎలా ఉండబోతోంది?

నేను ఇష్టపడి వచ్చిన ఫీల్డు కాబట్టి నాకు బాగానే ఉంది. ఎప్పుడు గానీ ఫీల్డులో తప్పు ఉండదు. మనుషుల్లో ఉంటుంది.

ఫీల్డులో బ్రతకడం ఈజీ. సమాజంలో బ్రతకడమే కష్టం. ఫీల్డులోకెళితే చాలా సేఫ్‌గా, సెక్యూర్డ్‌గా ఇంటికి రావొచ్చు. బయటికి వెళ్తేనే ఇంటికి వచ్చేవరకూ నమ్మకం ఉండదు. అలా ఉంది ఇప్పటి సమాజం. దాంతో పోలిస్తే సినీ ఫీల్డు చాలా బాగుంది. ఇదొక ఫ్రీ వరల్డ్. ఇక్కడ నీకు నచ్చితే చేయవచ్చు. నచ్చకపోతే వదిలేయవచ్చు. తప్పు ఎవరిదీ కాదిక్కడ. మన జీవితం. మన ఇష్టం. ఇకముందంటారా.. మనం మంచిగా ఉంటే, ఫీల్డులో మన చుట్టూ ఉండే నలుగురు కూడా మంచివాళ్లే ఉంటారు.

ఇంతకు ముందయినా, ఇప్పుడయినా, ఎప్పుడయినా.. చాలా వరకు, అంతా మనల్ని బట్టీ, మనం ఎంచుకునే మనుషుల్ని బట్టే ఉంటుంది.

కట్ టూ నగ్నచిత్రం -

ఎన్నో విషయాలను, ఎంతో అలవోకగా నాతో మాట్లాడిన మాధవీలతలో కొన్ని(పాజిటివ్) బలహీనతల్ని కూడా నేను మాటల మధ్యలో గుర్తించాను. అయితే, ఆ బలహీనతలే ఒక రకంగా తన బలం అంటుంది మాధవీలత.

"నేను బయటికి ఎంతో గర్విష్టిలా కనిపిస్తాను చాలా మందికి. కానీ - నా అంత ఎక్స్‌ట్రీమ్‌లీ ఎమోషనల్, నా అంత ఎక్స్‌ట్రీమ్‌లీ సెంటిమెంటల్ బహుశా ఎవరూ ఉండరు. అలాగే, నేను ఎంత సున్నితమైనదాన్నో అంత గట్టిదాన్ని కూడా" అంటుంది మాధవీలత.

"చాలా మంది సినీ ఫీల్డులో - తాము అనుకున్న గోల్ రీచ్ కావడానికి ఎంతటి మూల్యాన్నయినా చెల్లిస్తారు. దేన్నయినా వొదులుకుంటారు. స్నేహాలు, ప్రేమలు, బంధాలు, అనుబంధాలు.. ఏవయినా కావొచ్చు. తమ కెరీర్ కోసం వాటిని తృణప్రాయంగా వొదిలేస్తారు. అది నేను చేయలేను. బహుశా అదే నా బలహీనత. అదే నా బలం కూడా. నా తొలి సినిమా మంచి హిట్టయినా నేను దాన్ని క్యాష్ చేసుకోలేకపోడానికి ఇది కూడా ఒక కారణం" అంటుంది మాధవీలత.

చివరగా, తన మనసులోని కొన్ని కఠోర వాస్తవాల్ని కూడా నగ్నచిత్రంతో పంచుకొంది మాధవీలత..

"మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎవరు ఎన్ని చెప్పినా ఒక్కటి మాత్రం నిజం. ఆడది ఆడదే. ఆది నుంచీ ఒక వస్తువుగానే చూడబడింది. ఇప్పుడూ అంతే. కారణాల జోలికి నేను పోవటం లేదు. ఇది మాత్రం నిజం."

"మాధవీలతది సినిమా ఇండస్ట్రీకి పనికొచ్చే మైండ్‌సెట్ కాదు. కేవలం నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి నేనిక్కడ ఉన్నాను!"

ఇంత మంచి భాష, భావుకత్వం, వ్యక్తీకరణ, స్వీయ విశ్లేషణ ఉన్న మన తెలుగు హీరోయిన్ మాధవీలతకి.. ఆమె కలలన్నీ త్వరలోనే నిజం కావాలని "బెస్టాఫ్ లక్" చెప్పకుండా ఎలా ఉండగలం?  

2 comments:

  1. సున్నితత్వం,భావుకత్వం,కవిత్వం గుండెనిండుగా నింపుకున్నవారు మాధవీలత!సినిమాచెట్టు చుట్టూ ఈ మాధవీలత దట్టంగా అల్లుకోవాలంటే వెంటనే కావలసింది ఒక పెను ఘన విజయం!గత విజయం చుట్టూ గంతలు కట్టుకొని, కట్టలు పట్టుకొని మోకరిల్లే వింత జంతువు తెలుగుసినిమాపరిశ్రమ!award winning నాయికలు వీరికి ఆననే ఆనరు!

    ReplyDelete