Tuesday 7 May 2013

ఏ కెమెరాతో తీశాం అన్నది కాదన్నయ్యా..


ఇండస్ట్రీ చాలా చిత్రమైంది. ఇక్కడ రాజ్యమేలేది రెండే రెండు విషయాలు. ఒకటి - ఈగో. రెండోది - అజ్ఞానం.

ఇండస్ట్రీ అంటే ఇక్కడ టాలీవుడ్ అని మాత్రమే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్.. ఇంకెన్ని "వుడ్డు"లున్నాయో అవన్నీ కూడా.

కాన్స్ తో సహా, ఏ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనయినా ఎక్కువగా అవార్డుల పంట పండించుకొనేది చాలా తక్కువ బడ్జెట్‌లో తీసిన "ఇండిపెండెంట్" సినిమాలే. ఇంకా చెప్పాలంటే, "లో బడ్జెట్" సినిమాలు, "నో" బడ్జెట్ సినిమాలు. ఇవే ఎక్కువగా ఏ అంతర్జీతీయ చిత్రోత్సవాల్లోనయినా పాల్గోనేవీ, ప్రైజులు కొట్టేసేవీ.

గోవాలో ప్రతియేటా నవంబర్-డిసెంబర్లలో జరిగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు జరుగుతాయి. దీన్నే మనం ఇఫ్ఫీ (IFFI) అనికూడా అంటాం. కేవలం ఈ ఇఫ్ఫీ చిత్రోత్సవాలమీద వ్యామోహంతో నేను దాదాపు ప్రతియేటా గోవా వెళ్తుంటాను.

అంతర్జాతీయంగా ప్రేక్షకుల మన్ననలు, అవార్డులు పొందిన ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు అత్యంత తక్కువ బడ్జెట్ లో  తీసినవే. కొన్ని సినిమాల్లోనయితే, సీన్ జరుగుతుంటే పైన ఒక మూలన మైక్ వేలాడుతూ కనిపిస్తుంటుంది! కావాలంటే ఆ షాట్‌ని రీ-షూట్ చేయవచ్చు. కానీ, ఆర్టిస్టుల నటన ఆ షాట్‌లో బాగుండటం వల్ల..పైన పొరపాటుగా మైక్ అడ్డం వచ్చినా.. ఆ షాట్‌ను అలాగే పెట్టారు. కొన్ని సినిమాల విషయంలో రీ-షూట్ చేయటానికి బడ్జెట్ కూడా కారణం కావొచ్చు. ఇలాంటివి నేను ఎన్నో చూశాను.

అంతర్జాతీయంగా అవార్డులు పొందిన ఇలాంటి వందలాది చిత్రాలన్నీ కూడా అతి తక్కువ బడ్జెట్‌లో దొరికే కెమెరాలతో తీసినవే! ఇంకా చెప్పాలంటే, వీటిలో కొన్ని మామూలు హ్యాండికామ్‌లతో తీసినవి కూడా ఉంటాయి!

ఈ చిత్రాలని చూస్తున్నప్పుడు ఎవ్వరూ వాటిని ఏ కెమెరాతో తీశారు అని చూడరు. నిజానికి ఆ విషయం ఎవ్వరికీ గుర్తుకు రాదు.

కట్ టూ మన పాయింట్ -

ఫిలిం మేకింగ్ లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులొచ్చాయి. ముఖ్యంగా టెక్నికల్‌గా. ఇప్పుడసలు సినిమా తీయడంలో "ఫిలిం" అనేదే లేకుండాపోయింది. అంతా డిజిటల్ మయమైపోయింది. ఈ డిజిటల్ ఫిలిం మేకింగ్‌ని  ఆపాలని మొదట హాలీవుడ్‌లో చాలా ప్రయత్నాలు జరిగాయి. ఎందుకంటే - అప్పటికే బిలియన్ల డాలర్లు పోసి కట్టుకున్న ఫిలిం స్టూడియోలన్నీ నష్టాలపాలౌతాయి.

కానీ.. హాలీవుడ్డయినా, చివరికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి తలొగ్గక తప్పలేదు.  

మన తెలుగులో ఈ మధ్య విడుదలై విజయఢంకా మోగించిన కొన్ని యూత్ చిత్రాలను డిజిటల్లోనే తీశారు. అదీ కానన్ 5డి కెమెరాతో. అయితేనేం.. ప్రేక్షకులకెవ్వరికీ అది 5డి  కెమెరాతో తీశారా, లేకపోతే ఫిలిం కెమెరాతో తీశారా అన్నది తెలీదు. సినిమా నచ్చింది, ఆడించారు. కావల్సింది కూడా అదేగా!

కానీ, మన ఇండస్ట్రీలకి ఇది మింగుడు పడలేదు. అంత చిన్న బడ్జెట్‌లో.. అలాంటి ఊహించని ఆధునిక పరిజ్ఞానంతో, 5డి వంటి కెమెరాలతో సినిమాలు తీయటం, అవి ఆడటం వారు ఒప్పుకోలేకపోతున్నారు. సినిమా అంటే, భారీ హీరోలూ, భారీ బడ్జెట్లే వారి దృష్టిలో!

ఫలితంగా.. చెన్నైలో అసలు 5డి  తో సినిమాలు తీయటం బ్యాన్ చేశారు! ఇక్కడ మనవాళ్లు 5డి  తో చేసేవాళ్లకి రకరకాల చెక్కులు పెడుతున్నారు. శాటిలైట్ రైట్స్ వాళ్లంతా సిండికేటై అసలు 5డి  తో తీసిన సినిమాలను కొనొద్దు అనుకున్నారట కూడా! అసలు ఇలా తక్కువ బడ్జెట్‌లో తీయడనికి వీలయ్యే 5డి  ఫిలిం మేకింగ్‌ని చెన్నై తరహాలోనే బ్యాన్ కూడా చెయ్యాలనుకుంటున్నారట!

ఇదే గాని నిజమయితే, ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉండదు. ఈగో కూడా కాదు.. ఇది నిజంగా మనవారి అజ్ఞానమే ఔతుంది.

భారీ బడ్జెట్‌లో తీసినా, తక్కువ బడ్జెట్‌లో తీసినా.. సినిమా బాగాలేకపోతే దాన్ని వెనక్కి పంపేది ప్రేక్షకులే. మధ్యలో వీరి బాధ ఏంటి?

సినిమాలో విషయం ఉంటే ఆడతాయి. లేదంటే ఆడవు. అసలు రిలీజే కావు. వీరికేంటి బాధ? భారీ బడ్జెట్లో, భారీ కెమెరాలతో తీసినా..అసలు సినిమాలో విషయం లేని చెత్త సినిమాలు ఎన్ని రావటం లేదు? వాటిని ఆపగలుగుతున్నారా?

ఒక్క సినిమాల విషయంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఏ రంగంలోనయినా, ఆధునికంగా వచ్చిన పరిజ్ఞానాన్ని ఉపయోగించకుండా ఎవ్వరూ దేన్నీ ఆపలేకపోయారు. ఆపగలిగిన దాఖలాలు చరిత్రలో ఎక్కడా లేవు. ఉండవు కూడా. ఏ చట్టం అందుకు ఒప్పుకోదు అన్నది కామన్ సెన్స్.

ఇక్కడ విషయం.. సినిమాను ఏ కెమెరాతో తీశారన్నది కాదు. అది ఎలా ఆడిందన్నదే ముఖ్యం.

6 comments:

  1. మీ పోస్ట్ చాలా బావుంది ,

    మంచి సమాచారం అందించారు ,

    ధన్యవాదాలు,

    సుదీర్

    http://techwaves4u.blogspot.in/

    తెలుగు లో టెక్నికల్ బ్లాగు

    ReplyDelete
  2. థాంక్ యూ, సుధీర్. మీ బ్లాగ్ బాగుంది. Keep it up!

    ReplyDelete
  3. పెద్ద స్టార్ ల సినిమాలని చూస్తుంటే audience ని వారి విచక్షణా శక్తిని ఎంత తేలికగా చూస్తారో అర్ధం అవుతుంది.నిజానికి వీరే నిజమైన సృజనాత్మకతకి పెద్ద శతృవులు.ఏ మార్పునైనా చాలా కొద్ది కాలమే ఆపగలరు.మంచి వ్యాసం రాశారు.

    ReplyDelete
    Replies
    1. థాంక్స్, మూర్తి గారు!

      Delete