Monday 20 May 2013

ఆడియో ఫంక్షన్స్ ఇలా కూడా చేస్తారా?


ఇందాకే కృష్ణవంశీ "పైసా" ఆడియో రిలీజ్ ఫంక్షన్ని టీవీలో చూశాను. ప్రారంభం నుంచి చివరిదాకా కాదు. అక్కడక్కడా, అంతా కలిపి ఓ నలభై నిమిషాలు చూశాను. ప్రోగ్రాం నిజంగా వెరైటీగా ఉంది.

ఇక్కడ "డిఫరెంట్"గా ఉంది అని చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే సినీఫీల్డులో "డిఫరెంట్" అనే పదం తన అసలు అర్థం కోల్పోయింది. ప్రతివాళ్లూ, ప్రతి విషయాన్నీ, ప్రతి చోటా.. మాది డిఫరెంటు, మాది డిఫరెంటు అని చివరికి డిఫరెంటుని ఒక ఎందుకూ పనికిరాని "రొటీన్" చేసేశారు!

నాని, అల్లరి నరేష్, శర్వానంద్, తరుణ్, బ్రహ్మాజీ మొదలైనవారి వెరైటీ బట్ సింపుల్ యాంకరింగ్.. మధ్య మధ్యలో యాంకర్ సుమ (ఒక మంచి కార్పొరేట్ డ్రెస్‌లో) ఎంటరై "ఇంక అంతా మీరే యాంకరింగ్ చేసుకుని, అసలు యాంకర్ని తొక్కేయండి" అని చెణుకులు.. అంతా బావుంది. నిజంగా.

ఎదురుగా స్టేజీ మీద జరుగుతున్న యువతరంగం తతంగాన్ని -  చిరునవ్వులు, నవ్వులు చిందిస్తూ ఎంజాయ్ చేస్తూ, ఆడియన్స్‌లో కూర్చున్న కృష్ణవంశీ ఒక ప్రత్యేక ఆకర్షణ. ఆయన బహుశా ముందే మాట్లాడారో, లేదంటే చివర్లో మాట్లాడారో నాకయితే తెలీదు. నేనా పార్ట్ మిస్సయ్యాను.

కృష్ణవంశీ "మొగుడు" తప్పకుండా ఒక నిన్నే పెళ్లాడతా రేంజిలో హిట్టవుతుందని నేను ఆశించాను. అలా జరగలేదు. కాని, ఎందుకో ఈ "పైసా" మాత్రం తప్పకుండా కృష్ణవంశీ చాలాకాలంగా ఎదురుచూస్తున్న హిట్టునిస్తుందని భావిస్తున్నాను. ఇవాలని మనసారా కోరుకుంటున్నాను.

నా ఉద్దేశ్యంలో, తెలుగులో మనకున్న అతి కొద్దిమంది నిజమైన క్రియేటివ్ డైరెక్టర్లలో ఆయన ఒకరు.

హిట్లూ, ఫట్లూ ఎలా ఉన్నా.. అనవసరమైన అతి చెత్త స్థాయిలో వంశాల పొగడ్తలు, స్టార్ కుటుంబాల ఇంటిపేర్లను, బిరుదులను పదే పదే వల్లిస్తూ చేసే 'వంది మాగధుల తాతల రేంజి' పొగడ్తలు లేకుండా.. చాలా సింపుల్‌గా, వెరైటీగా, బోర్ కొట్టని విధంగా, ముఖ్యంగా ఆడియెన్స్ మస్ఫూర్తిగా ఎంజాయ్ చేసే విధంగా "పైసా" ఆడియో ఫంక్షన్ ను డిజైన్ చేసిన పధ్ధతి ఒక కొత్త స్టయిల్‌కు నాంది అయితే బావుండు అని నాకనిపిస్తోంది. అవాలి కూడా.

కట్ టూ "పైసా" మ్యూజిక్ డైరెక్టర్ -

సాయికార్తీక్ ని నేను ఒకసారి.. ఫిలిం నగర్లో ఉన్న ఒక గెస్ట్‌హౌజ్ లో తను సీరియస్‌గా మ్యూజిక్ వర్క్ చేసుకుంటుండగా కలిశాను. అప్పుడు ఆయన నా సినిమాకి చేస్తానన్న బడ్జెట్ వింటే ఇప్పుడు ఎవ్వరూ నమ్మరు. పైగా నా ముఖం మీదే నవ్వేస్తారు, నావి ఉట్టి కోతలు అంటూ. మళ్లీ ఓ మూడేళ్ల క్రితం శ్రీనగర్ కాలనీలోని ఆయన ఫ్లాట్‌లోనే ఉన్న సొంత మినీ రికార్డింగ్ స్టూడియోలో కలిశాను. అప్పుడు నా సినిమా పాటల్ని అక్కడ రికార్డ్ చేశారు మా మ్యూజిక్ డైరెక్టర్.

ఈరోజు - అదే సాయికార్తీక్‌ని కృష్ణవంశీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా.. ఆయన్ పక్కనే కూర్చుని, తన ఆడియో రిలీజ్ ప్రోగ్రాం ని చూస్తూ చిరునవ్వులు చిందిస్తూండటం చూశాను. ఆ చిరునవ్వుల వెనక ఎంతో శ్రమ ఉంది. ఎన్నో ఏళ్ల పరిశ్రమ ఉంది. అనవసరమైన ఈగోలు లేకుండా, ఒకే లక్ష్యంతో కృషి చేసేవాళ్లు ఎవరైనా, ఎక్కడయినా.. ఏదో ఒక రోజు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతారు అన్నదానికి తాజా ఉదాహరణ సాయికార్తీక్. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్!

కట్ టూ మాస్క్ మ్యూజిక్ డైరెక్టర్స్ -

ఫిలిం నగర్లో, క్రిష్ణా నగర్లో, ఇందిరా నగర్లో, ఇంకా.. ఆ చుట్టుపక్కల నేను ఎందర్నో చూశాను. "సాంగ్ బ్యాంక్"ల మ్యూజిక్ డైరెక్టర్లు, బాత్ రూమ్ రికార్డింగ్ స్టూడియో మ్యూజిక్ డైరెక్టర్లూ, అసలు మ్యూజిక్ లో అ ఆ లు కూడా తెలియని మ్యూజిక్ డైరెక్టర్లూ.. ఇలా ఎందరినో చూశాను. అయితే వీరి విషయం నేను మాట్లాడ్డం లేదు.

కొందరు మ్యూజిక్ డైరెక్టర్లకి టాలెంట్ ఉంటుంది. కాని, దాన్ని ఉపయోగించుకోవటంలో ఎన్నో రకాల ఈగోలు ఫీలౌతారు. కొందరయితే ఇంక ఫిలిం చేయకుండానే "నాది మణిశర్మ రేంజ్" అని చెప్పేస్తుంటారు. కొందరయితే, నేను మణి దగ్గర (అంటే మణిశర్మ!) పని చేసేటప్పుడు చిరంజీవి నన్ను ఇలా మెచ్చుకున్నాడు, అలా మెచ్చుకున్నాడు అని తెగ కోసేస్తుంటారు. కొంతమంది వాళ్లు ఇచ్చే మ్యూజిక్ కి ఒక భారీ రేంజ్ బడ్జెట్ చెప్తారు. అసలు నిజంగా అంత బడ్జెట్ ఉంటే ఈ కొత్త వాళ్లని, కోతలరాయుళ్లని ఎందుకు పెట్టుకుంటారు?

ఇలాంటి వాళ్లకి వంది మాగధులు కూడా ఉంటారు. "అవును.. అంత తక్కువ బడ్జెట్ లో పాటలు చేయగలిగితే.. రెహమాన్, దేవిశ్రీ, మణి, చక్రి, తమన్‌లు అంతెందుకు తీసుకుంటారు" అని కామన్ సెన్స్ లేని ఓ పెద్ద లా పాయింట్ లేపుతారు. చర్చిస్తే ఇదో పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. పుస్తకం కూడా  రాయొచ్చు. త్వరలోనే ఒక ఎట్రాక్టివ్ టైటిల్‌తో సినీఫీల్డుపై నేను రాసి, పబ్లిష్ చేస్తున్న పుస్తకంలో ఈ చాప్టర్ తప్పక ఉంటుంది.

కట్ టూ మై లేటెస్ట్ ఎండి -

నా తాజా చిత్రం "యురేకా సకమిక" కు నేనిప్పుడో కొత్త ఎండీని (మ్యూజిక్ డైరెక్టర్ని) పరిచయం చేస్తున్నాను. సంగీతం అతనికి ప్యాషన్. నాకు కావలసింది అదొక్కటి మాత్రమే. పనికిరాని ఈగోలు, మాస్కులు కావు.  

2 comments: