Sunday 12 May 2013

బోధివృక్షం క్రింద బిజినెస్‌మేన్!

నా మిత్రుల్లో చాలామంది చాలా విషయాల్లో నిష్ణాతులు. వాళ్లల్లో ఒకడింకా పెళ్లికూడా చేసుకోలేదు. అలాగని, ఏదో ప్లేబాయ్‌లా లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడని అనుకోడానికి కూడా లేదు. ఏమో, నేనయితే అలా అనుకుంటున్నాను.  నిజానిజాలు వాడికీ, ఆ పైవాడికీ మాత్రమే తెలియాలి. అయినా అదంతా వ్యక్తిగతం.

అన్నట్టు ఈ మిత్రుడు మంచి కవి, రచయిత కూడా. కానీ రాయడు. వాడికి అదొక రోగం. అదొక టైప్ అన్నమాట!

కవిత్వం, కథలు, స్క్రిప్టులు రాయరా బాబూ అంటే.. మెహర్బానీ కోసం ఇంకా ఏవేవో పనికిరాని పనులు చేస్తుంటాడు. ఈ ఒక్క మెహర్బానీ గుణమే ('గుల' అంటే కరెక్టేమో!) వాడి కొంప ముంచింది. ఇదొక్కటి మినహాయిస్తే, చాలా మంచివాడు. వాడు నిజంగా ప్రయత్నిస్తే సినిమాల్లో బాగా పైకి వస్తాడని నాకు ఇప్పటికీ గట్టి నమ్మకం.

కట్ టూ పాయింట్ -

ఇప్పుడు నేను తీస్తున్న మైక్రో బడ్జెట్ (నిజానికి ఇది అసలు బడ్జెట్టే కాదు!) సినిమాకు సంబంధించి,  ఈ రైటర్ మిత్రుని ద్వారా ఇంకో మిత్రునితో మాట్లాడ్డం జరిగింది, ఒక విషయంలో. "నేను అంత తక్కువలో ఆ పని చేయలేను, సాధ్యం కాదు" అన్నాడతను. అతని స్థాయిని, ఉద్దేశ్యాన్ని నేను అర్థం చేసుకున్నాను. నో ప్రాబ్లం. అతని నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తాను.

నేనేదో మైక్రో బడ్జెట్లో సినిమా తీస్తున్నానని అతను తన స్థాయిని మైక్రో లెవెల్ కు తగ్గించుకోనవసరంలేదు.

కానీ, దీన్ని ఇక్కడితో వదిలేయకుండా, దీనికి నానా భాష్యాలు చెప్పాడు నా మిత్రుడు. నేను ఎలా "బిజినెస్" చేస్తున్నదీ చెప్పాడు. ముమ్మాటికీ నాది బిజినెస్సేనన్నాడు! నా కళ్లు తెరిపించాడు. నాకు జ్ఞానోదయం కావించాడు.

కట్ టూ .. నాకు తెలిసిన ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ -

నాకు చాలా దగ్గరగా తెలిసిన ఒక దర్శక నిర్మాత తీసిన ఓ చిన్న సినిమాకు ఇలాంటి ఓ రచయితే పాటలు రాశాడు, అతి కష్టం మీద తన విలువైన టైమ్ అడ్జస్ట్ చేసుకుంటూ! వివిధ కారణాలవల్ల ఆ సినిమా ఆగుతూ, ఆగుతూ పూర్తయి, చివరికి ఎలాగో రిలీజయింది. ఫ్లాపయింది.

సుమారు ఒక అరవై లక్షలు డబ్బు పోగొట్టుకుని ఆ ఫిలిం మేకర్ చావాలా బ్రతకాలా అని ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటే, ఆ రైటర్ ఓడియన్ థియేటర్ నుంచి ఆయనకి ఫోన్ చేసి అడిగే పధ్ధతి ఇలా ఉంటుంది:

"నేను నా లైఫ్ అంతా ధారపోసి మీ సినిమాకు పాటలు రాశాను. థియేటర్ దగ్గర కనీసం ఓ పెద్ద ఫ్లెక్సీ లేదు. ఒక ప్రమోషన్ లేదు, ఏం లేదు. ఏం పట్టించుకోరు. ఏం మనుషులు మీరు!?"

పాపం ఆ ఫిలిం మేకర్ ఎన్నో యేళ్ల తర్వాత, ఇతన్ని వెతుక్కుంటూ వెళ్లి మరీ పాటలు రాయించుకున్నాడు. వేరే గీత రచయితలు దొరక్క కాదు. ఇతనితో రాయించాలన్న అభిమానంతో! తప్పు ఫిలిం మేకర్‌దే. కో అంటే కోటిమంది అత్యంత సమర్థులైన కొత్త రచయితలు ఫ్రీగా రాయడానికి రెడీగా ఉన్నా, ఈయన్ని రాయమనటం నిజంగా తప్పే.

అప్పుడు అతను పిలిచి ఇచ్చిన అవకాశమే. మళ్లీ ఎందుకో ఇప్పటి వరకూ మరే చిత్రానికీ పాటలు రాయలేకపోయాడు ఆ రైటర్!

కట్ టూ అసలు పాయింట్ -

సమర్థులైన గీత రచయితలు ఎందరో ఫిలిం నగర్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పరిచయం చేస్తే చాలు.. వీళ్లు ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా పని చేస్తారు. ఇంకా నాకు తెలిసిన సీనియర్లు ఉన్నారు. నా సినిమా కోసం ఎలాంటి సహాయమైనా చేస్తారు. వీరందరినీ కాదని, నేను కూడా, కనీసం ఇంకా పేరుకూడా బయటికి రాని నా మిత్రున్ని వెతుక్కుంటూ వెళ్లి పాటలు రాయించటం "బిజినెస్" ఔతుందని నాకు ఈ బోధి వృక్షం కిందే తెలిసింది!

నేనెప్పుడో ఆలిండియా రేడియోలో పని చేస్తున్నప్పటి పరిచయాన్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకుని, నా సినిమాలో రెండవ అతి ప్రాముఖ్యమైన విభాగానికి చీఫ్ టెక్నీషియన్‌గా ఇంకో మిత్రుడిని పరిచయం చేయటం కూడా "బిజినెస్సే"నని నాకు ఈ మిత్రుడి ద్వారానే.. ఈ బోధి వృక్షం కిందే తెలిసింది!

ఒక సినిమాలో అవకాశం దొరకడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఒక దశాబ్దం గడచినా ఆ అదృష్టం వరించని వాళ్లు ఎప్పుడూ వేలల్లో ఉంటారు. ఈ కఠోర సత్యం నా మిత్రునికీ తెలుసు. ఆ నిజం అలా ఉంటే, అభిమానంతో పిలిచి అవకాశం ఇవ్వటం నిజంగా బిజినెస్సే!

నా కళ్లు తెరిపించిన నా మిత్రునికి ధన్యవాదాలు చెప్పితీరాల్సిందే. ఇప్పుడు నేను అభిమానంతోనో, ఆబ్లిగేషన్‌తోనో పిలిచి అవకాశం ఇచ్చే బిజినెస్ పూర్తిగా మానుకున్నాను. సినీఫీల్డులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమర్థులు ఎందరో ఉన్నారు. ఇప్పటికే అలాంటివారిని ఎందరినో నేను పరిచయం చేశాను. వాళ్లల్లో చాలామంది ఫీల్డులో మంచి పొజిషన్లో ఉన్నారిప్పుడు. అలా పరిచయం చేస్తే కనీసం కృతజ్ఞతాపూర్వకంగా గుర్తుపెట్టుకుంటారు. వారు గుర్తుపెట్టుకోకపోయినా నష్టం లేదు. సమర్థులైన వాళ్లను పరిచయం చేసిన తృప్తి ఉంటుంది నాకు. ఆ తృప్తిలోఉన్న కిక్ మరెక్కడా దొరకదు. ఆ కిక్ చాలు నాకు.

4 comments:

 1. మనవాళ్ళకి ఈస్థటిక్ సెన్స్ తక్కువ...బండగా అర్ధం పర్ధం లేకుండా ఫారిన్ లొకేషన్లలో ఎగురుతుంటే మరి వాళ్ళేం అనుకుంటారో నాకు తెలియదు గాని...సరుకు లేనివాడు గల్లీలో వున్నా ఒక్కటే డిల్లీలో వున్నాఒక్కటే అనిపిస్తుంది..!

  ReplyDelete
  Replies
  1. బాగా చెప్పారు. థాంక్స్, మూర్తి గారు!

   Delete
 2. Jeevitham.. Mastaarooo idi... Illantivi common... Munduku saaguthoone undaali.. Ilantivaarevaraina light ga.. Theeskondi.. Good luck.

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పినట్టు.. యమ లైట్‌గా తీసుకున్నాను మాస్టారు! అందుకే అంత ఈజీగా ఈ పోస్టు రాయగలిగాను, బహుశా. Thank you so much.

   Delete