Saturday 4 May 2013

ఆప్పుడూ ఇప్పుడూ ఒక్కటే!

ఈ పోస్టు రాయటం వెనక ఎలాంటి దురుద్దేశ్యాలు లేవు. నిజాలు తప్ప ..

నూరేళ్ల భారతీయ సినిమా గురుంచి "నమస్తే తెలంగాణ" వరంగల్ ఎడిషన్లో నిన్న (3 మే, 2013) ఒక మంచి ఇన్‌ఫర్మేటివ్  ఫీచర్ వచ్చింది. నిన్న నేను షిర్డీలో ఉన్నాను కాబట్టి ఆ ఫీచర్‌ను ఆన్‌లైన్లో చదివాను. వరంగల్ జిల్లా నుంచి ఎంతమంది సినీఫీల్డులోకి వచ్చారు.. ఎవరెవరి కంట్రిబ్యూషన్ ఎంత.. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు.. ఇదంతా బావుంది. అదే ఫీచర్లో - పెద్దగా ఏం సాధించకపోయినా, నా గురించి నేనే చదువుకోవడం కూడా ఒక కొత్త అనుభవం.

కట్ టూ పాయింట్ -

ఆ ఫీచర్లో నన్ను నిజంగా ఆకట్టుకున్నది ఇవన్నీ కావు. 1979 లో వరంగల్ వాళ్లు నిర్మించిన ఒక చిత్రం. ఆ చిత్రం పేరు "మంచికి స్థానం లేదు". సుమారు 34 యేళ్ల క్రితం కొంతమంది ఔత్సాహికులు రూపొందించిన ఆ సినిమాను అప్పటి సెన్సార్ అభ్యంతర పెట్టిందట. టైటిల్ మార్చాలని సూచించిందట. ఎంత హాస్యాస్పదం?!

సినిమాలో ఏవయినా అభ్యంతరకరమయిన సీన్లుంటే వాటికి సెన్సార్ అభ్యంతరం చెప్పొచ్చు. కానీ, టైటిల్ మార్చండని చెప్పడానికి సెన్సార్ ఎవరు? అంత ఘోరమయిన టైటిలా అది?? ఏ కోణంలో ఆలోచించినా ఆ టైటిల్ కు అభ్యంతరం చెప్పడానికి లేదు.

ఏవైనా మతకలహాలని ప్రొత్సహిస్తుందా ఆటైటిల్? ఏదయినా కులాన్ని గానీ, వర్గాన్ని గానీ రెచ్చగొడుతుందా ఆ టైటిల్? ఆ టైటిల్లో ఏమయినా సెక్స్ ఉందా? .. అదేమీ కాదు. ఫీచర్లో రాసినట్టు .. అది అప్పటి ఆధిపత్యం, అణచివేత కు పరాకాష్ట తప్ప మరొకటి కాదు.

ఓ పాతికేళ్ల తర్వాత, 2005 లో, కట్ టూ నా స్వీయానుభవం  -

నా రెండో సినిమా కోసం "ఒక్కటి" అన్న టైటిల్ ను రిజిస్ట్రేషన్ కోసం చాంబర్‌కు పంపాను. వాళ్లు అంతా చెక్ చేసుకుని, అప్పటి వరకూ ఎవ్వరూ ఆ టైటిల్ ని ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి, నా అప్లికేషన్‌ను తీసుకున్నారు.

సుమారు నెల తర్వాత చాంబర్ నుంచి నాకో లెటర్ వచ్చింది. సాంకేతిక కారణాలవల్ల మీరు అప్లై చేసుకున్న "ఒక్కటి" టైటిల్ ని ఆమోదించటం లేదు. మరేదయినా టైటిల్ ని కొత్తగా అనుకుని పంపించండి, పరిశీలిస్తాం .. అని ఆ లెటర్ సారాంశం.

అప్పటి మా మేనేజర్ (ఇప్పుడు ప్రొడ్యూసర్!) ని "అసలు విషయం ఏంటో కనుక్కో" అని చెప్పి పంపాను. మేనేజర్ చాంబర్‌కి వెళ్లొచ్చాడు.

విషయం ఏంటంటే, అప్పటికే 'ఒక్కడు', 'ఒక్కడే' వంటి టైటిల్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి కాబట్టి, మీ టైటిల్ కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తుందన్న ఉద్దేశ్యంతో ఆమోదించలేదు.. అని చాంబర్ వాళ్ల వివరణ!

నిజానికి అప్పడు వాళ్లు కారణంగా చూపిన ఆ టైటిల్స్ అన్నీ నాకు ఈ రోజు ఖచ్చితంగా గుర్తు లేవు. కానీ, అవన్నీ వ్యక్తిని తెలిపేవే. కానీ నా టైటిల్ అలా కాదు. "ఒక్కటి".. అంటే ఇంగ్లిష్‌లో 'వన్', హిందీలో 'ఏక్'. అసలు నా టైటిల్‌కూ, వాళ్లు చెప్పిన కారణానికీ ఏమైనా సంబంధముందా?

అదండీ విషయం. చాంబర్ మీటింగ్స్‌లో ఫిలిం టైటిల్స్ అనేవి అలా ఓకే చేయబడతాయి. లేదా, అలా రిజెక్ట్ చేయబడతాయి. ఈ స్థాయి మేధోమథనానికి నెలకుపైగా సమయం పడుతుంది!

కట్ టూ TFCC, తెలంగాణా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (Estd in 1941) -

'యురేకా సకమిక' టైటిల్‌ని ఈ మధ్యే రిజిస్ట్రేషన్‌కు పంపాను.. 'లవ్ జస్ట్ హాపెన్స్' అన్న ట్యాగ్‌లైన్‌తో సహా. కేవలం 5 వర్కింగ్ డేస్‌లో అటు చెన్నైలోనూ, ఇటు ఏపి ఫిలిం చాంబర్లోనూ ఈ టైటిల్ అంతకుముందు రిజిస్టర్ కాలేదని కన్‌ఫర్మ్ చేసుకున్నారు. 5వ రోజున నాకు TFCC ఆఫీస్ నుంచి ఫోన్ రానే వచ్చింది. "మీ టైటిల్ 'యురేకా సకమిక' రిజిస్టర్ అయ్యింది. ఎవర్నయినా పంపించండి. సర్టిఫికేట్ బై హ్యాండ్ అయినా ఇచ్చేస్తాం".. అన్నారావిడ.

నా అసిస్టెంట్ బైక్ మీద వెళ్లాడు. తర్వాతి 30 నిమిషాల్లో టైటిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌తో నా ముందు నిల్చున్నాడు!

కట్ టూ నీతి -

పనికిరాని ఈగోనో, పక్షపాతమో ప్రదర్శిస్తూ సతాయించాలనుకుంటే, ఆధిపత్యం చూపాలనుకుంటే ఏ రకంగానయినా చూపవచ్చు. సహాయపడాలి, ప్రోత్సహించాలి అనుకుంటే మరుక్షణమే అలా కూడా చేయవచ్చు. ఇది ఆయా వ్యక్తుల, గుత్తాధిపత్యంలో ఉన్న ఆయా సంస్థల ఎజెండాల మీద ఆధారపడి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త!

No comments:

Post a Comment