Thursday 11 April 2013

గుర్తుకొస్తున్నాయి ...


ఉగాదికి ఒక రోజుముందు నుంచే, ఈ సారి వేప పువ్వు ఎవరింట్లోని వేపచెట్టు నుంచి తీసుకురావాలా అని ఆలోచించేవాళ్లం. తెల్లటి చేతి సంచీ తీసుకుని, పండక్కి అవసరమైన సరుకుల కోసం మా అమ్మ కిరాణం దుకాణానికి బయల్దేరేది. మేమూ వెంటవెళ్లేవాళ్లం.

సుమారు ఒక అర కిలోమీటర్ దూరంలో ఉండే ఆ కిరాణా షాపు అంగుళం అంగుళం, నన్ను ఇప్పుడు అడిగినా ఒక మంచి బొమ్మ గీసి చూపించగలను. మా ప్రాంతంలోని ఏకైక "పెద్ద దుకాణం" గా మేమందరం భావించే ఆ కిరాణం షాపు పేరు మర్చిపోవటం అంత సులభం కాదు.  అది.. తోట రామచంద్రం దుకాణం!

ఇంకా పదేళ్లు కూడా నిండని వయస్సులో మా అమ్మ వెంట మేము బొడ్రాయిలో ఉన్న ఆ దుకాణానికి వెళ్లిన ప్రతిసారీ, ఏది జరిగినా జరక్కపోయినా ఒకటి మాత్రం ఖచ్చితంగా జరిగేది. మా అమ్మ అన్ని వస్తువులూ కొనుక్కుని, డబ్బులు చెల్లించి బయటికి వచ్చేటప్పుడు, మేం అడిగినా అడక్కపోయినా - చెక్కెర గానీ, బెల్లం కానీ పిల్లలకు చేతినిండా పెట్టేవాళ్లు ఆ దుకాణంలోని గుమస్తాలు.

ఈ ఫినిషింగ్ టచ్ తాయిలం కోసం - మా అమ్మతోపాటు ఎంతసేపయినా ఆ దుకాణంలోనే గడిపేవాళ్లం మేము. అప్పటిదాకా, ఆ దుకాణంలో ఎవరెవరు ఏం కొంటున్నారు, ఎక్కడెక్కడ ఏయే వస్తువులున్నాయి, తూకం ఎలా వేస్తున్నారు, పొట్లాలు ఎలా కడుతున్నారు... ఇవన్నీ ఎంతో ఆసక్తిగా చూసేవాళ్లం.

బహుశా అందుకేనేమో, ఆ రోజుల్లో మాకు చక్కెర, బెల్లం చేతినిండా పెట్టిన ఆ గుమాస్తాలందరి ముఖాలూ, పేర్లూ ఇప్పటికీ నాకు గుర్తున్నాయి.

మరో జ్ఞాపకం ఏంటంటే, ఆ దుకాణం యజమానుల్లో ఒకరి అబ్బాయి నాకు స్కూల్లో క్లాస్‌మేట్! వాడిపేరు శివయ్య. "అరే, శివయ్యా! నిన్న మేం మీ దుకాణానికొచ్చాం. నువ్వు లేవేంటి?" అని మర్నాడు వాడ్ని అడగటం మాకొక రొటీన్. శివయ్య ముక్కు ఎప్పుడూ కారుతూ ఉండేది. మేమంతా వాడిని "చీమిడి ముక్కు శివయ్య" అని ఏడిపించేవాళ్లం. అప్పటి మా క్లాస్‌మేట్ శివయ్య ఇప్పుడు మా ప్రాంతంలోనే ఒక పెద్ద రైస్ మిల్లర్ అనీ, బిజినెస్ మ్యాగ్నెట్ అనీ ఈ మధ్యే విన్నాను!

ఉగాదికి - ఎప్పుడూ కొత్త కుండలో పచ్చడి, శనగపప్పు బెల్లంతో భక్ష్యాలు చేసేది మా అమ్మ.  (సుమారు 150 కిలోమీటర్ల దూరంలో వరంగల్లో ఉన్న మా అమ్మ - తన డెభ్భై ఏళ్ల వయస్సులో, ఈ రోజు కూడా, ఆ రొటీన్ బ్రేక్ చేయలేదు!) ఆ భక్ష్యాలు చేసేటప్పుడు వాటి చుట్టూరా  వంకలు వంకలుగా రావటం కోసం, చివర్లో చక్రం ఉన్న ఒక ఇత్తడి చెంచాని వాడేది మా అమ్మ. చక్రం ఉన్న ఆ చెంచాతో భక్ష్యాన్ని డిజైన్లు డిజైన్లుగా కట్ చేయటం కోసం మా అన్న, నేను తెగ పోటీపడేవాళ్లం. ఓ పదేళ్ల క్రితం కూడా నేను వరంగల్ వెళ్లినప్పుడు ఆ చెంచాని మా ఇంట్లో చూశాను.

మా చిన్నప్పటి జ్ఞాపకాల్ని మా అమ్మ అంత సులభంగా చెరిగిపోనీయదు. మా ఇంట్లోని ప్రతి వస్తువూ, ఆ వస్తువుతో మా అనుబంధం.. బహుశా మా అమ్మకు కూడా ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. వరంగల్లోని మా ఇల్లు శిథిలమౌతున్నా - మా బాల్యం నాటి జ్ఞాపకాల్ని శిథిలం కానివ్వటం ఇష్టం లేని మా అమ్మ గుర్తుకొస్తేనే నా కళ్లల్లో నీళ్లు వస్తాయి. ఎప్పుడూ.

కట్ టూ ప్రజెంట్ -

నా భార్య, సిటీలోనే మరో మూలనున్న వాళ్ల చెల్లెలు ఇంటికి వెళ్లే తొందర్లో ఉంది. నేను ఓ గంట క్రితమే రెండు చపాతీలు తిన్నాను. నా డ్రైవర్ అంజి రావటం ఇంకా లేట్ అవుతుందని ఇలా బ్లాగ్ రాస్తూ కూర్చున్నాను. ఒక ఇంపార్టెంట్ కాల్ గురించి కూడా ఎదురుచూస్తున్నాను. ఆ మీటింగ్ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాను.

మా పెద్దబ్బాయి ప్రణయ్ హంగామా చానెల్లో డోరెమాన్ చూస్తున్నాడు. మా చిన్నబ్బాయి ప్రియతమ్ "యాష్" గేమింగ్ జోన్ కు వెళ్లి ఆడుకోడానికి రెడీగా ఉన్నాడు. వాడూ నా డ్రైవర్ ఎప్పుడొస్తాడా అని ఒక వైపు ఎదురు చూస్తూనే, మరోవైపు వాడి డెల్ స్మార్ట్ ఫోన్లో ఏదో గేమ్ ఆడుతున్నాడు!

ఇప్పుడు సమయం ఉదయం 11.55. మేమెవ్వరం ఇంకా ఉగాది పచ్చడి, భక్ష్యాలు తినలేదు. తింటామన్న గ్యారంటీ లేదు. దీనికి నేను ఎవ్వర్నీ తప్పు పట్టడం లేదు. ఆధునిక నగర జీవన శైలి అలా అయిపోయింది. అలా చేసుకుంటున్నాము. చేసుకున్నాము.

కట్ టూ.. నా ఫీలింగ్స్ -

నేను అనుభవించిన అద్భుతమైన బాల్యాన్ని నా పిల్లలకు ఇవ్వలేక పోతున్నందుకు మాత్రం చాలా గిల్టీగా ఫీలవుతున్నాను. అవక తప్పదు. నెమ్మదిగా, నా సహజ జీవన శైలికి మళ్లుతున్న ఆ సమయంలో ఇదంతా గుర్తుకి తెచ్చుకోవటం, నన్ను నేను పలకరించుకోవటం.. ఇలా ప్రశ్నించుకోవటం.. నాకు కొంచెం బాధగానే ఉన్నా, మరోవైపు సంతోషంగా కూడా ఉంది. ఎందుకో మీకు తెలుసు.

No comments:

Post a Comment