Saturday 23 March 2013

చల్లటి "నెగెటివిటీ కమ్ శాడిజమ్!"


అత్యంత తక్కువ సర్క్యులేషన్ ఉన్న మన తెలుగు దినపత్రికల్లో అదొకటి. అందులో ప్రతి వారానికి ఒక రోజు సినిమాపైన ఓ నాలుగు పేజీల సప్లిమెంట్ వస్తుంది. ఆ సప్లిమెంటుకో పేరు కూడా పెట్టారు... చల్లగా, అద్భుతంగా అనిపించే ఒక అందమైన పదంతో. వాస్తవానికి, ఆ నాలుగు పేజీల్లో అత్యధిక భాగం నెగెటివిటీ... లేదంటే, శాడిజం మాత్రమే కనిపిస్తాయి.


అలా మూర్తీభవించిన నెగెటివిటీని, షుగర్ కోటింగ్ ఇచ్చిన శాడిజాన్నీ చదవడం కోసం మన సినిమావాళ్లు కొందరు, సినీ ప్రేమికులు కొందరు... వారం వారం ఆ ఒక్క సప్లిమెంట్ కోసం ఆ దినపత్రికని కొంటారు. ఆ ఒక్క రోజు మాత్రమే ఆ పత్రిక కాపీలు తొందరగా అమ్ముడుపోతాయి న్యూస్ స్టాండ్స్‌లో... విచిత్రంగా! మిగిలిన ఆరు రోజులూ ఆ పత్రికని కనీసం టచ్ చేయరు... అదే మనవాళ్లు, మన సినీ ప్రేమికులూ!!

నా బ్లాగ్ మిత్రుల కోసం రెండే రెండు అంశాలు చర్చించి ఈ బ్లాగ్ పోస్ట్‌ని ముగిస్తాను...

1. ప్రతి వారం విడుదలయ్యే సినిమాలపైన రివ్యూలని, ఆ తర్వాతి వారం ఈ చల్లటి సప్లిమెంటులో పబ్లిష్ చేస్తారు. అవి ఎలా ఉంటాయంటే - వ్యక్తిగతంగా వీరికి ఉందనుకుంటున్న మేధస్సుకి (!?) బాగా నచ్చిన సినిమాలను అకాశానికి ఎత్తేస్తారు. బయట థియేటర్లలో మాత్రం వాటికి కలెక్షన్లు సున్నా. రివ్యూల్లో వీరు పరమ  చెత్త అని ఉతికి ఆరేసిన సినిమా... అవతల థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటుంది!

అలాగని, అన్ని రివ్యూలూ ఇలాగే ఉంటాయని జెనరలైజేషన్ కాదు. ఎక్కువ భాగం మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి.  అలాగే - వీరు రాసే ప్రతి సినిమా రివ్యూలో వంద తప్పులు చూపిస్తారు. సినిమా అసలు ఎలా తీయాలో సెలవిస్తూ మరో వంద సలహాలనిస్తారు. దురదృష్టవశాత్తూ వీళ్లు ఒక్క సినిమా తీయలేరు. తీసిన జాడ లేదు.

2. పోనీ, ఈ సప్లిమెంటులో రాసే సమీక్షకులు, విశ్లేషకులు ఏమయినా అఖండ మేధావులా అంటే... అదొక పెద్ద కొశ్చన్ మార్కు!

వీరిలో ఒకాయన 'సిడ్ ఫీల్డ్' పుస్తకాలు రెండు చదివుంటాడనుకుంటాను. స్క్రీన్‌ప్లే ఇలా ఉండాలి, అలా ఉండాలి... సిడ్ ఫీల్డ్ ఇలా చెప్పాడు, అలా చెప్పాడు అని ఓ సొద రాసేస్తాడు. ఇంత తెల్సిన ఈ రచయిత ఓ అద్భుతమయిన స్క్రీన్‌ప్లే రాసి మన అగ్రస్థాయి రచయితలను, దర్శకులను ఇంటికి పంపొచ్చుగా!?  అలా చెయ్య లేరు.

చెప్పటం ఎవరయినా ఏదయినా చెప్తారు. చేసి చూపించటమే చాలా కష్టం. ఆ వైపు ప్రయత్నించాలన్నా వీరి వల్ల కాదు. పై ఖర్చుల కోసం వీరు బయట చేసే పనులు వేరే ఉంటాయి. ఆ పనుల్లో బిజీగా ఉంటారు. ఉదాహరణకి, పోస్టు ద్వారా సినీ కోర్సులు పంపించే వ్యాపారం చేసే వ్యక్తులకోసం, ఇంగ్లిష్ పుస్తకాల్లోంచి తెలుగులోకి అనువాదం చేసి - "కోర్సు మెటీరియల్" (!) తయారు చేసివ్వటం. అంటే, "కాపీ" మేస్త్రీ పని అన్నమాట!

ఈ కాపీ మేస్త్రీ పనుల్లాంటి పనులు లేకున్నా - వీరిలో ఏ ఒక్కరయినా - అద్భుతమయిన స్క్రీన్‌ప్లేలురాసి, చిత్రాలు తీసి ఒప్పించగలరా అంటే... అంత సీన్ అక్కడ లేదు.

ఇంకో గ్రేట్ సమీక్షకులవారు ఇలా రాస్తారు:

...సినిమా డైలాగులు ఏవీ "గుర్తుపెట్టుకొనే రీతిలో రాయాలని" సంభాషణల రచయిత (సో అండ్ సో )అనుకున్నట్టు లేదు!... 

అదండీ విషయం. సంభాషణల రచయిత "డైలాగుల్ని గుర్తు పెట్టుకునే రీతిలో" రాయాలట!  ఇవీ సమీక్షలు... వీరంతా సమీక్షకులు, విశ్లేషకులు! వీరంతా వండుతున్న ఈ అద్భుత సప్లిమెంటును మన సినీ జనం, సినీ ప్రేమికులు (కొందరయినా) వారం వారం ఎగబడి కొనడం నిజంగా ఆశ్చర్యకరం.

కూర్చున్న చోటే ఉండి, ఎలాంటి ప్రాథమిక అవగాహన లేకుండా - నెగెటివిటీ ఎగజిమ్ముతూనో, విషం కక్కుతూనో రెండు పేజీల రివ్యూ రాయటం చాలా ఈజీ. లక్షలు, కోట్లు సేకరించి, వందలాదిమందితో కోఆర్డినేట్ అవుతూ ఒక సినిమా తీయటం మాత్రం అంత ఈజీ కాదు.

ఆ శ్రమ పట్ల కనీస అవగాహన ఉన్నవారు రాసే విమర్శలు నిర్మాణాత్మకంగా ఉంటాయి. అద్భుతంగా ఉంటాయి.
దురదృష్టవశాత్తూ అలాంటి సమీక్షకులు, విశ్లేషకుల సంఖ్య చాలా తక్కువ... 

4 comments:

  1. Adbhuthamga undi... Ika nundi aina alaanti vaari shaili marithe ... Santhosham

    ReplyDelete
  2. నువ్వు కాబట్టి ఇన్ని నొప్పులు పడ్దావ్...నేను ఒక నొప్పికే పిల్లని కనేస్తా అందట ఒక గొడ్రాలు...అలా ఉంటుంది...మన సినీ సమీక్షకుల పద్దతి..

    ReplyDelete
  3. lol .. బాగా చెప్పారు, kvsv!

    ReplyDelete