Monday 18 February 2013

సెల్ ఫోన్ ధ్వనిలా నవ్వేదానా!


సరిగ్గా డైనింగ్ దగ్గర కూర్చుంటుండగా ఫోన్ .. వాష్ రూం కి వెల్తుండగా ఫోన్ ..సీరియస్ గా ఏదయినా రాసుకుంటుంటే ఫోన్ .. చదువుకుంటుంటే ఫోన్ .. టైం కి డబ్బుల అడ్జస్ట్ మెంట్ సరిగా అవక టెన్షన్ తో చస్తుంటే ఫోన్ ..

ఇదీ అదీ అని ఏదీ లేదు. "ఇప్పుడు ఏ ఫోన్ రాకపోతే బాగుండు" అనుకుంటున్న సమయం లోనే ఖచ్చితంగా ఫోన్ వస్తుంది, వచ్చి తీరుతుంది! కొంతమంది మరీ మినిమమ్ మేనర్స్ లేకుండా, "ఏంటీ, మీరు ఫోనెత్తరేంటీ?" అని నిలదీస్తారు. వాళ్ల ఫోన్ ఎప్పుడొస్తుందా, ఎప్పుడెప్పుడు 'ఎత్తాలా' అని ఎదురుచూస్తూ కూర్చోవాలన్న మాట!

ఆధునిక టెక్నాలజీ మనిషి జీవితానికి మరింత ఆనందం అందించాలి. ఆ శక్తి దానికి ఉంది. కానీ, మనమే దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. చివరికి - సొల్లు కబుర్లకీ, టైం పాస్ (టైం కిల్లింగ్) కి మాత్రమే మొబైల్ అన్నట్టుగా తయారయింది పరిస్థితి.

నిజానికి - ఎంతో అత్యవసరమయితే తప్ప, కమ్యూనికేషన్ కి మరొక అవకాశం లేకపోతే తప్ప, మొబైల్ ఫోన్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఈ మెయిల్ చేయవచ్చు. మరీ కావాలనుకుంటే మెసేజ్ (ఎస్ ఎం ఎస్) చేయవచ్చు. నిజంగా అంత అవసరమయితే, దాన్ని చదువుకొని అవతలి వాళ్లే ఫోన్ చేస్తారు.

పరిస్థితి ఎంత దారుణంగా తయారయిందంటే - రోడ్డు మీద ఓ పది మంది వెల్తున్నారంటే - కనీసం ఒక 6 గురి చెవి దగ్గర సెల్ ఫోన్ ఉంటోంది! చెవికీ మెడకీ మధ్య ఫోన్ పెట్టుకొని సర్కస్ చేస్తూ డ్రయివింగులు .. ముందు కూర్చుని డ్రయివింగ్ చేస్తున్న వాడి చెవి దగ్గర వెనక కూర్చున్న వాడు ఫోన్ పెట్టడం .. ఆఖరికి, గోడకి "వన్ ఫింగర్" చేస్తూ కూడా ఫోన్ లో మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి!

అయితే ఇదంతా సగటు ప్రజానీకం, సగటు మనిషి మనస్తత్వానికీ, జీవన విధానానికీ సంబంధించింది.

కట్ చేస్తే -

జీవితం లో అత్యున్నత స్థాయి విజయాల్నీ (కొన్ని సార్లు అపజయాల్నీ) సాధించిన వారికి అసలు మొబైల్ ఫోన్ పట్ల అంత ఆసక్తి ఉండదు. మీరు గమనించండి .. వీరిలో అత్యధిక శాతం మంది చేతుల్లో అసలు మొబైల్ ఉండదు! ఇంకా చెప్పాలంటే - వీరిలో  చాలా మందికి అసలు మొబైల్ ఉపయోగించడమనేది చాలా అరుదయిన విషయం. మరి వీరంతా జీవితంలో ఎన్నెన్నో సాధిస్తున్నారు ..

ఆశ్చర్యానికి గురి చేసే ఒక వాస్తవం ఏంటంటే - మొబైల్ ని వీరిలో కొందరు అద్భుతంగా ఉపయోగిస్తారు: మొబైల్ నే కంప్యూటర్ లా చేసుకొని, ఇంటర్నెట్ ద్వారా ఈ మెయిల్స్, ఇతర ఆఫీస్ కరస్పాండెన్స్ చక చకా చేసేస్తుంటారు. అంతేనా .. కేవలం "ఎస్ ఎమ్ ఎస్" లతో  పెద్ద పెద్ద కంపెనీల బిజినెస్ లను నడిపిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే - కేవలం ఎస్ ఎమ్ ఎస్ లతో ఏకంగా పుస్తకాల్నే రాసేసి పబ్లిష్ చేస్తారు.  

ప్రముఖ మేనేజ్‌మెంట్ గురు, "ఐ ఐ పి ఎమ్" డైరెక్టర్ ఆరిందం చౌధురి తన "డిస్కవర్ ది డైమండ్ ఇన్ యు" పుస్తకాన్ని ఇలాగే ఎస్ ఎమ్ ఎస్ లతో రాసి పూర్తి చేశాడు, పబ్లిష్ చేశాడు. దాన్ని "బెస్ట్ సెల్లర్" కూడా చేశాడు. ఆయన బిజినెస్ కమ్యూనికేషన్ అంతా కూడా ఎస్ ఎమ్ ఎస్ ల ద్వారానే నడుస్తుందంటే నమ్మగలరా? నిజంగా అది నిజం కాబట్టి నమ్మి తీరాలి ..

ఆధునిక టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవటం అందరివల్లా కాదు. అలా ఉపయోగించుకున్న వాళ్లు మాత్రం ఎక్కడో ఉన్నత శిఖరాల్లో ఉంటారు. కనీసం ఆ దారిలో ప్రయాణం చేస్తుంటారు. కేవలం ఆభరణాల్లా "షో" చేసే వారు మాత్రం ఎప్పుడూ అడుగునే ఉంటారు. ఉన్నచోటే ఉంటారు.

No comments:

Post a Comment