Friday 25 January 2013

సృజనాత్మక ఉగ్రవాదం!

ఎన్డిటీవీ లో న్యూస్ ప్రజెంటర్ సోనియా అంటే నాకిష్టం. అందంగా ఉంటుందని కాదు. అందంగా, అద్భుతంగా న్యూస్ ని ప్రజెంట్ చేస్తుందని...

ఈ సాయంత్రం టీవీలో చానెళ్లను   స్కాన్ చేస్తోంటే సోనియా కనిపించింది. ఠక్కున ఆపాను. ప్రైమ్ టైమ్ న్యూస్ లో కమలహాసన్  "విశ్వరూపం" చిత్రం బ్యాన్ మీద నడుస్తోంది చర్చ. 

కల్చరల్ టెర్రరిజం... క్రియేటివ్ టెర్రరిజం...

ఎర్ర గులాబీలు, ఆకలి రాజ్యం, టిక్ టిక్ టిక్, వసంత కోకిల, అమావాస్య చంద్రుడు, సాగర సంగమం, స్వాతిముత్యం, శుభ సంకల్పం, అపూర్వ సహోదరులు, మహానది, క్షత్రియ పుత్రుడు, భామనే సత్యభామనే, మైకేల్ మదన కామరాజు, భారతీయుడు, గుణ, హే రామ్, ఈనాడు, దశావతారం... ఇలా ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు.  

ఎన్నుకొనే కథలోనూ, నటనలోనూ - తన ప్రతి చిత్రంలో ఎప్పుడూ నవ్యత కోసం తపించే అద్భుత నటుడు, ఫిలిం మేకర్... కమలహాసన్. భారతీయ చిత్రానికి ప్రపంచస్థాయి నాణ్యతనూ, ఖ్యాతినీ తీసుకురావటానికి తోడ్పడిన అతికొద్దిమంది వేళ్లమీద లెక్కించదగిన సినీ నటులు, దర్శకనిర్మాతల్లో కమలహాసన్ ఒకరు. 

ఆ కమలహాసన్ రచన, దర్శకత్వంలో... 95 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన "విశ్వరూపం" చిత్రాన్ని ఆశ్చర్యకరంగా  తమిళనాడులో బ్యాన్ చేశారు! కారణం: ఆ చిత్రం ముస్లిమ్‌ల మనోభావాలను దెబ్బతీసే విధంగానూ, ముస్లిమ్‌లను కించపర్చేదిగానూ, ఇంకేదో మన్నూ మశానం గానూ ఉందని ఆరోపణ!!

ప్రపంచవ్యాప్తంగా ఇంకొన్ని గంటల్లో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని ఏ ముస్లిం దేశం కూడా బ్యాన్ చేయకపోవటం ఇక్కడ గమనార్హం!  

ఇంకా ఆ సినిమా రిలీజ్ అవలేదు. నిజంగా అందులో అభ్యంతరకరమైనది ఏమిటో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. "నా చిత్రం మీద చేస్తున్న ఆరోపణలు నాకెంతో అవమానకరంగా ఉన్నాయి. నిజానికి నా చిత్రం చూసిన ముస్లిమ్‌లు.. వాళ్లు ముస్లిమ్‌లు  అయినందుకు గర్విస్తారు!" అని స్వయంగా కమలహాసన్ చెప్పినా ఎవరూ వినలేదు.

ఒక్క తమిళనాడులోనే ఆ చిత్రాన్ని బ్యాన్ చేశారు! అంతకుముందు కమల్ తన చిత్రాన్ని డిటిహెచ్ లో రిలీజ్ చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని కూడా పెద్ద రాజకీయం చేసి, లేని సమస్యలు సృష్టించి, ఆ చిత్రం విడుదల వాయిదాపడటానికి కూడా తమిళనాడే కారణమయింది!!  

బాధాకరమయిన విషయం ఏంటంటే - తమిళనాడు కమలహాసన్ పుట్టిన రాష్ట్రం ... 

ముస్లిమ్ దేశాలతో సహా - ప్రపంచం యావత్తూ అభ్యంతరం చెప్పని సినిమాను ఒక్క తమిళనాడు మాత్రమే బ్యాన్ చేసింది!

ప్రధానంగా "విశ్వరూపం" ఒక రెండున్నర గంటల సినిమా. ఆ సినిమా విడుదలయ్యాక, అది చూసి, అందులో నిజంగా అంత తీవ్రమయిన అభ్యంతరాలు ఉంటే అప్పుడు బ్యాన్ కోసం గొడవ చేయొచ్చు. బ్యాన్ చేయించవచ్చు. కనీసం కమల్ నటించిన, నిర్మించిన చిత్రాల ట్రాక్ రికార్డు చూసి అయినా కొంచెం ఇంగిత జ్ఞానం ఉపయోగించాలి.  

కమలహాసన్‌లో అంత బాధ్యతారాహిత్యం ఉందని నేననుకోను. నిజంగా అలాంటిది ఏదయినా ఉంటే ముందు సెన్సార్ ఆ చిత్రాన్ని బయటికి పంపదు. 

ఇదంతా పక్కనపెడితే - అసలు ఒక వ్యక్తిగా, పౌరునిగా, కళాకారుడిగా తన భావాల్ని స్వేఛ్ఛగా ఆవిష్కరించుకునే హక్కు  కమల్‌కు  ఉంది. ఆ హక్కుని కాలరాసింది తమిళనాడు.   ఈ బ్యాన్ కీ, అంతకుముందటి డిటిహెచ్ వివాదానికీ కూడా కారణం  - కుటిల రాజకీయాలు, స్వార్థపూరిత ఆలోచనలే తప్ప మరొకటి కాదు.  

ఒక సగటు పౌరునిగా, కమల్ అభిమానిగా, ఒక దర్శకనిర్మాతగా కమల్‌కు నా ప్రగాఢ సానుభూతిని ఈ బ్లాగ్ ద్వారా తెలుపుతున్నాను. ఒక్క నేనే కాదు - ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ట్వీట్లు,  ఫేస్‌బుక్  పోస్టులు కమల్ పక్షాన సానుభూతిని తెలుపుతున్నాయి. 

కమల్, మీరు తీసిన "విశ్వరూపం" హిట్టా ఫట్టా అన్నది నాకు అనవసరం. 95 కోట్లు ఖర్చుపెట్టి ఈ చిత్రాన్ని నిర్మించిన మీలోని కళాతృష్ణకు, మీ ఆత్మవిశ్వాసానికీ, గట్సుకీ  నేను "హాట్సాఫ్" చెప్తున్నాను. ఇలాంటి బ్యాన్లు మిమ్మల్ని ఆపలేవు. వాళ్లేదో  బ్యాన్ చేశారు. వాళ్లేంటో  వాళ్ల స్థాయి  ఏంటో  ప్రపంచానికి తెలుపుకున్నారు. రేపు తల దించుకోవాల్సిందీ, సిగ్గుతో చచ్చిపోవాల్సింది కూడా వాళ్లే!  

2 comments:

  1. svaami

    ide hinduvula dvaraa vyatirekata vaste mata moudhyam ani arachi golapette medhaavulevaru mee pakshaana maatlaadaru emdukani? meere apahaasyam chesinaa ,apratishtapaalcheyyaalani chusinaa srujanaatmaka peruto atmavamchanaku paalpaddaa kshamimchagaligedi himduvulu maatrame .

    kalaakaarulamtaa ekkadunnaaru , medhaavulamtaa kallumusukunnaaremo kekalu vesi pilavamdi

    ReplyDelete
  2. yes.. you are 100% right.. good openion

    ReplyDelete