Saturday 29 December 2012

రాజధాని నగరంలో


ఇది పూర్తిగా నా నేచర్ కి సరిపడని అంశం. నేను ఆలోచించడానికే అసహ్యించుకొనే అంశం. పైగా బ్లాగ్ లో దీని గురించి ఇప్పటికే ఒకసారి రాశాను. అయినా, రెండోసారి కూడా అంశంపైన రాస్తున్నాను అంటే ... అంతగా చలించిపోయాను

పరిచయం లేని ఒక వ్యక్తితో మాట్లాడ్డానికే మనం ఆలోచిస్తాం. పరిచయం లేని ఒక వ్యక్తిని అసలు తాకలేం. అది ఆడవాళ్లయితే  ఇంకాస్త దూరంగా జరుగుతాం. ఇక, అంగీకారం లేకుండా, సాక్షాత్తూ జీవిత భాగస్వామితో కూడా అసలేమీ చేయలేంఅలాంటిది - 

దేశ రాజధాని నడి వీధుల్లో - నడుస్తున్న బస్సులో -
ఒక అమ్మాయిని రేప్ చేయడం ...
అమానుషంగా గ్యాంగ్ రేప్ చేయడం ...
అత్యంత హీనమయిన రాక్షసత్వపు హింసతో చావు అంచులదాకా చేర్చడం ...

కనీసం - " శరీరం మా రాక్షస క్రీడకు ఉపయోగపడిందే" అన్న కృతజ్ఞత కూడా లేకుండా - ఒక నిర్జీవమయిన సిమెంట్ బ్యాగ్ ని తోసేసినట్టు - నడుస్తున్న బస్ లోంచి కిందకి తోసివేయడం ...

అసలు యుగంలోకి వెళ్తున్నాం మనం? అనాగరిక యుగంలోనయినా ఇలాంటి హింస ఉందా?? అత్యంత హేయమయిన సంఘటన గురించి, నా మనసులోని ఫీలింగ్స్ అన్నింటిని సంపూర్ణంగా బ్లాగ్ లో పెట్టలేకపోతున్నందుకు కూడా నేను నిజంగా సిగ్గు పడుతున్నాను.

కనీసం సంఘటనతోనయినా దేశం కళ్లు తెరిచింది. డిల్లీ వీధులు ఉలిక్కి పడ్డాయి. పొలిటీషియన్లు తమ కుంభకర్ణ నిద్రలోంచి ఒక్క క్షణం అదిరిపడుతూ లేచారు.

డిల్లీ లోనూ, దేశంలోని ప్రతిమూలా, ప్రతిరోజూ రేప్ సంఘటనలు జరుగుతూనే ఉన్నా - రొటీన్ జీవితపు టెన్షన్లలో ఎన్నడూ పట్టించుకోని మనం కూడా ఇప్పుడు సంఘటన గురించి ఆలోచిస్తున్నాం. ఫేస్ బుక్కుల్లొ నిరసనల్ని "లైక్" చేస్తున్నాం. నేరుగా మన ఆక్రోశాన్ని పోస్ట్ చేస్తున్నాం. కవితలు రాస్తున్నాం. బ్లాగులు రాస్తున్నాం. ఇంకా ఏదో చేయాలనుకుంటున్నాం. ఏమీ చేయలేమనే మన నిస్సహాయతకు బాధపడ్తున్నాం.   

సింగపూర్ స్థాయి వైద్యం మన దేశంలో లేదా? స్థాయి వైద్యులు మన దగ్గర లేరా? పెద్ద జోక్. అంతా వాష్. హై డ్రామా.

చివరికి తన మరణంతో దేశం మొత్తం కనీసం కొన్ని క్షణాలయినా ఆలోచించేలా, ఆలోచించి సిగ్గుపడేలా చేసి శెలవు తీసుకుంది నిర్భయ

మన పొలిటీషియన్లు కొత్త చట్టాలు తెస్తారో, ఏం సాధిస్తారో చూడాలి. ఉన్న చట్టాల్ని అమలు చేయడానికే మనకు గతి లేదు. ఇంక కొత్త చట్టాలు తెచ్చి వీళ్లేం సాధిస్తారో మనకు తెలీని కొత్త విషయం కాదు.

మన  అమ్మాయిలు, మన అబ్బాయిలు - ఎవరినీ ఇబ్బంది పెట్టని పూర్తి స్వేఛ్ఛతో, స్వఛ్ఛంగా, వారి ఇష్టా రాజ్యంగా తిరిగే దేశం కావాలి మనకు. అదెలాగూ కుళ్లిపోయిన పొలిటికల్ వ్యవస్థలో సాధ్యం కాదు. కనీసం మన అబ్బాయిలను మనం మంచి నడవడితో పెంచుదాం. మానవ మృగాల సంఖ్య కొంతయినా తగ్గించుకుందాం.   

1 comment: