Friday 23 November 2012

కమర్షియల్ ఆర్ట్ సినిమా!


నా మిత్రుడు గుడిపాటి సాహిత్య పత్రిక "పాలపిట్ట" లో ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చదివాను. అది ఓల్గా, కుటుంబరావుల ఇంటర్వ్యూ. సత్యజిత్ రే ని వాళ్లు కలిసినప్పుడు ఒక సందర్భంలో ఆయన ఇలా అన్నాట్ట: "సినిమా తీయాలన్న కమిట్మెంట్ ఉంటే చాలు. డబ్బులు ఎప్పుడూ సమస్య కాదు" అని! ఎలా కాదనగలం?

సత్యజిత్ రే "పథేర్ పాంచాలి" అలాగే తీశాడు. ఉద్యోగం చేస్తూ, జీతం వచ్చినపుడల్లా ఆ డబ్బుతో షూటింగ్ ప్లాన్ చేస్తూ, మరికొంతమంది మిత్రుల ద్వారా కూడా అవసరమయిన డబ్బు ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూ, అంచెలంచెలుగా తీశారు. అలాంటి అనుభవంతో చెప్పిన మాట అది. ఆ సినిమానే ఆయనకు అంత పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సత్యజిత్ రే ఇంకెన్నో పిక్చర్లు తీశారు. ఆయన అనుకున్న సినిమాలే తీశారు. విషయం ఇక్కడ ఆర్ట్ సినిమాలా, కమర్షియల్ సినిమాలా అన్నది కాదు. అనుకున్న సినిమాని ఒక కమిట్మెంట్ తో చేయగలగటం.

అయితే ఇక్కడో నిజం చెప్పుకోవాలి. ఆర్ట్ సినిమాలకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. కారణం,  ఎక్కడో అక్కడ ఆర్ట్ సినిమాని ప్రేమించే ప్రొడ్యూసర్లుంటారు. లాభాపేక్ష లేకుండా వీలయినంత ఇన్వెస్ట్ చేస్తారు. కమర్షియల్ సినిమాల విషయంలో మాత్రం డబ్బే కష్టం, ఇటీవలి వరకూ. కానీ, ఇప్పుడా సమస్య లేదు. ఫిల్మ్ మేకింగ్ లో వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ఇందుకు దోహదం చేస్తోంది.

నిజంగా సినిమా తీయాలనుకుంటే ఇప్పుడు డబ్బు సమస్య కాదు. అంత తక్కువ బడ్జెట్ లో ఈ రోజుల్లో సినిమా తీయొచ్చు. అంతా కొత్తవాళ్లతో, నేచురల్ లొకేషన్లలో సినిమా తీస్తే - దాదాపు అది "నో బడ్జెట్" సినిమానే! ఇటీవలి కాలంలో వచ్చిన ఎన్నో యూత్ ఫుల్ కమర్షియల్ సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. పుష్కలంగా డబ్బుల వర్షం కురిపించాయి.

అంతా కొత్త వాళ్లతో, ఇప్పుడు నేను ప్లాన్ చేస్తున్న మైక్రో బడ్జెట్ సినిమాలూ ఇలాంటివే. యూత్ ఫుల్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్. కేవలం బడ్జెట్ దృష్టితో చూస్తే, వీటిని కమర్షియల్ ఆర్ట్ సినిమాలనవచ్చేమో! ఏ కొంచెం హిట్ టాక్ వచ్చినా, వీటి కలెక్షన్ ఇంచుమించు పెద్ద సినిమాలకు పోటీగా ఉంటుంది. సినిమా ఆడకపోయినా, ఈ రేంజ్ బడ్జెట్ లో అసలు రిస్క్ అనేదే ఉండదు. ఇంకేం కావాలి?

2 comments:

 1. మనోహర్ గారు. సినిమా కోసం ఇంత తపన పడుతున్న మీకు ధన్యవాదాలు. మీ ప్రయత్నం నిజంగా అభినందనీయం.
  సర్వకళల సమాహారమైన సినిమా ద్వారా....వినోదమైనా...ప్రభావంమైనా ఇతర కళల అన్నిటికన్నా ఎక్కువగా ఉంటుంది.
  ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాల్లో పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో వినోదాన్ని అందిస్తోంది సినిమానే.
  కనుక ఆ వర్గాలపై సినిమా ప్రభావం మరీ అధికం.
  అందుకే సినిమా రాజకీయనాయకులకూ జన్మనిచ్చింది.
  అటువంటి సినిమా కొందరు పెట్టుబడి దారుల చేతుల్లోకి వెళ్లింది.
  సినిమా తీయడం అనేది ఒక ఖరీదైన వ్యవహారంగా ....మారింది.
  ఎంత ఘోరమండి...?
  సినిమా హీరోకి పదిహేను కోట్లా. ? దర్శకునికి పది కోట్లా.? నటన అంటే తెలీని, కనీసం భాష కూడా రానీ హీరోయిన్లకు కోట్లా...?
  వాళ్లకు ఒక్కనికిచ్చే డబ్బుతో పది సినిమాలు తీయొచ్చు. పది సినిమాలంటే కనీసం ఎంతలేదన్నా...సినిమాకు యాభైమంది టెక్నీషియన్లను అనుకున్నా....ఐదొందల మందికి ఉపాధి దొరుకుతుంది.
  కొందరు డిమాండ్ అండ్ సప్లైని బట్టే ఇస్తున్నారని అనొచ్చు. కానీ అది పచ్చి అబద్ధం. ఎందుకంటే...తమ వారసులు, మనుమలనే జనం మీదకు వదులుతూ...పరిశ్రమలోకి ఇంకెవర్నీ రానీకుండా మోకాలడ్డుకొంటూ...
  వేల థియేటర్లలో సినిమాలు విడుదల చేసి...చిన్న సినిమాలకు కనీసం నిలువనీడ లేకుండా చేస్తుంటే ఇక కొత్తవారు ఎలా వస్తారండీ..?
  ఈ పరిస్థితిలో ఇప్పుడొస్తున్న టెక్నాలజీ ఔత్సాహికులకు అనుకోని వరంగా మారింది.
  మీలాంటి అనుభవజ్ఞులు, తక్కువ బడ్జెట్ సినిమాల్ని ఒక ఒక ఉద్యమంలా కొనసాగించాలి.
  ఆ మధ్య బెంగాల్లో ఎవరో వినూత్న ప్రయోగం చేశారట మీకు తెలిసే ఉంటుంది.
  అందర్నీ తలా ఒక్క రూపాయి మాత్రమే అడిగి...కొంత డబ్బు పోగేసి సినిమా తీశారట.
  ఇలాంటివి అనేక ప్రయోగాలు జరగాలి. మీ ప్రయత్నం విజయవంత కావాలి.

  చివరగా ఒక్కమాట. సినిమా అందరికోసం ఉన్న కళ. అంతేకానీ అందని కల మాత్రం కాదు. కాకూడదు.

  ReplyDelete
 2. బాగా చెప్పారు. మీ లాంటి కళా ప్రియులు కూడా కొంత పూనుకోవటం అవసరం. నా ఇంకో బ్లాగ్ లో "క్రౌడ్ ఫండింగ్" గురించి రాశాను:

  http://45rojulachitram.blogspot.in/2012/11/blog-post_23.html

  చదవండి. థాంక్స్!

  ReplyDelete