Wednesday 28 November 2012

చాయిస్ ఎప్పుడూ మనదే!


అమెరికాలో ఒక దివాలా తీసిన వ్యక్తి - సర్వస్వం కోల్పోయి, పీకలదాకా అప్పుల్లో కూరుకుపోయిన స్థితి నుంచి, కేవలం మూడేళ్లలో 600 మిలియన్ల డాలర్లు సంపాదించాడు. అంటే, మన ఇండియన్ కరెన్సీలో సుమారు 2400 కోట్లు అన్నమాట!

"ఇదెలా సాధ్యమయ్యింది?" అని ఆయన్ని ప్రశ్నించినపుడు ఆ రహస్యాన్ని ఆయన కేవలం ఒకే ఒక్క వాక్యంలో చెప్పాడు - "నేను ఎప్పటినుంచయితే భారీ స్థాయిలో ఆలోచించటం మొదలెట్టానో, ఆ క్షణం నుంచే నా జీవితం పూర్తిగా మారిపోయింది!" 

ఆ వ్యక్తి ఇప్పటికి ఇంకెన్నో వందల కోట్లు సంపాదించాడు. క్రమంగా ఒక మిలియనేర్ ట్రెయినర్ గా మారిపోయి, ఆ రంగంలోనూ కోట్లు సంపాదిస్తున్నాడు. అతనే బ్రయాన్ ట్రేసీ.

ఇక్కడ భారీ స్థాయిలో ఆలోచించడం అంటే "థింకింగ్ బిగ్" అన్న మాట. సక్సెస్ సైన్స్ కు సంబంధించి ఈ రెండు పదాలకి చాలా అర్థం ఉంది. ఇంట్లో ముసుగుతన్ని పడుకొని, పగటి కలలు కనడం, ఆకాశానికి నిచ్చెనలు వేయడం "థింక్ బిగ్" ఎప్పుడూ కాదు. క్యాలిక్యులేటెడ్ రిస్క్ తో అతిపెద్ద లక్ష్యాల్ని నిర్దేశించుకొని, సంపూర్ణ సామర్థ్యంతో కృషి చేయడమే క్లుప్తంగా దీని నిర్వచనం. 

ఈ సందర్భంగా "లా ఆఫ్ ఇన్‌కమ్" గురించి కూడా కొంత తెలుసుకోవడం అవసరం. వ్యక్తిగా నీకు, వృత్తిపరంగా నీ నైపుణ్యాలకు మార్కెట్లో ఎంతమేరకు నీ విలువను పెంచుకోగలవు అన్నదాన్నిబట్టి నీ ఆర్థిక సంపాదన ఉంటుంది. ఇదే ఆదాయ సూత్రం. ఏ రంగంలోనివారికయినా ఈ సూత్రమే వర్తిస్తుంది. ఈ బేసిక్ ఎకనమిక్స్ తెలుసుకోకుండా ఎవ్వరూ ఆర్థికంగా ఎదగలేరు. దీనే మరో రకంగా కూడా చెప్పుకోవచ్చు…

జీవితం ఎప్పుడూ "నేను" కాదు. సమాజంలో ఎంతమందికి నీ కంట్రిబ్యూషన్ ఉంది అన్నదే సిసలయిన జీవితం. రచయిత, చిత్రకారుడు, వ్యాపారవేత్త, రాజకీయవేత్త, డాక్టర్, ఇంజినీయర్, కార్మికుడు, వ్యవసాయదారుడు... ఎవరయినా కావొచ్చు. ఏ రంగమయినా కావొచ్చు. నీ చుట్టూ ఉన్న ఒక ప్రపంచం ఒక మార్కెట్ అనుకుంటే - అందులో నీకంటూ నువ్వు సృష్టించుకున్న "డిమాండ్" ఏంటి అన్నదాని మీద ఆధారపడే నీ విజయం ఉంటుంది. ఆ విజయమే నువ్వు కోరుకున్న సాంఘిక, ఆర్థిక స్థాయికి నిన్ను తీసుకెళుతుంది. 

ఇదే సందర్భంలో బంకర్ హంట్ గురించి కూడా చెప్పుకోవచ్చు. ఒక సాధారణ ప్రత్తి రైతు స్థాయి నుంచి, బిలియన్ల డాలర్ల కాటన్ ఇండస్జ్ట్రియలిస్టుగా ఎదిగిన ఈ వ్యక్తిని ఒక టీవీ చానెల్ వాళ్లు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో, "ఆర్థికంగా విజయం సాధించాలనుకొనేవాళ్లకు మీరిచ్చే సలహా ఏంటి?" అని ఒక రొటీన్ ప్రశ్న వేశారు. దానికి హంట్ ఇచ్చిన సమాధానం ఇది...

"ఆర్ధికంగానే కాదు - జీవితంలోని ఏ దశలోనయినా, ఏ పార్శ్వంలోనయినా విజయం సాధించడమనేది అందరూ అనుకునేంత కష్టతరమయినది, భయంకరమయినది కానే కాదు. దీనికి రెండే కావాలి. ఒకటి - నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో కచ్చితంగా నిర్ణయించుకోవాలి. రెండోది - ఆ నిర్ణయాన్ని నిజం చేసుకోడానికి నువ్వు చెల్లించాల్సిన మూల్యం ఏంటో కూడా నిర్ధారించుకోవాలి. ఆ మూల్యం చెల్లించే విషయంలో నువ్వు కమిట్ అవ్వాలి."    

ఎవరయినా ఏదయినా సాధించాలనుకొంటే ఇంతకు మించిన స్పష్టత ఏదీ ఉండదు. అవసరం లేదు. అయితే సమస్యంతా ఇక్కడే ఉంది. మనలో దదాపు 95 శాతం మంది అవ్వా, బువ్వా రెండూ కావాలనుకొంటారు. తెలిసి చేసే ఈ పొరపాటువల్ల రెంటినీ కోల్పోయి, ఏదీ సాధించక, చివరకు త్రిశంకు స్వర్గంలో వేలాడుతుంటారు. (ప్రస్తుతం నేనూ అక్కడే ఉన్నాను!)

ఇప్పుడు భారీగా ఆలోచించండి. మీలోని నేచురల్ గిఫ్ట్స్ ని, నైపుణ్యాన్ని ఎంత భారీగా ఉపయోగించే అవకాశాలున్నాయి? ఏ దిశలో వెంటనే ప్రయత్నాలు ప్రారంభించాలి? ఏ భారీ లక్ష్యం అధిగమించాలి? ...  ఈ ప్రశ్నలకి సమాధానాలు మీరు తెలుసుకోవాలి. ఈ క్షణం నుంచే ఆ దిశలో పని చేయడం ప్రారంభించాలి. ఈ మొదటి అడుగులే భవిష్యత్తులో మీ జీవితంలోని ఎన్నో భారీ ఆర్ధిక విజయాలకు, జీవితంలో అర్థానికి, పరమార్థానికీ పునాదులవుతాయి. నిజం, చాయిస్ ఎప్పుడూ మనదే!

5 comments:

 1. very good analysis Manohar !!!

  ReplyDelete
 2. very good and inspiring ..keep it up

  ReplyDelete
 3. హాయ్ సర్ ...iam వెంకటేష్
  సూపర్ సర్ ... మీ మాటలు చదీవీతే కొత్త బలం వస్తుందీ సర్ ...

  ReplyDelete