Sunday 4 November 2012

బ్యాన్ ది సినిమా!


2010 లో డేవిడ్ ఫించర్ అనే డైరెక్టర్ "ది సోషల్ నెట్ వర్క్" అనే ఒక హాలీవుడ్ పిక్చర్ తీశాడు. అది పూర్తిగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా. వ్యక్తి, ఒక రకంగా ఆలోచిస్తే, ఎవరో సామాన్యమైన వ్యక్తి కాదు. ఫేస్ బుక్ ని లాంచ్ చేసిన మార్క్ జుకేర్బర్గ్. ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 మిలియన్ల మందిని అమితంగా ప్రభావితం చేసిన వ్యక్తి.

"ది సోషల్ నెట్ వర్క్" అనే సినిమా తననూ, తన జీవితంలోని అత్యంత సున్నితమైన అంశాలనూ గ్లోరిఫై చేస్తూ తీస్తున్న సినిమా అని మార్క్ కి తెలుసు. దీని గురించి సినిమా మేకింగ్ సమయం లోనే అంత బాహాటంగా ప్రమోషన్ జరిగింది మరి!

తను కావాలనుకొంటే - అనుకున్న క్షణంలోనే - సినిమాను, దాని నిర్మాణ సమయంలోనే ఆపేయించగల సత్తా, నెట్ వర్క్, ధనం మార్క్ కి ఉంది. కానీ, మార్క్ పని చేయలేదు. అలా చేయకపోవటంవల్ల - తను ఎంతో కష్టపడి, ఎంతో జాగ్రత్తగా నిర్మించుకున్న అద్దాలమేడలాంటి తన ఇమేజ్ కి ఎంతో రిస్క్ ఉందన్న విషయం తనకి తెలుసు. అయినా మార్క్ పని చేయలేదు. కనీసం సినిమా రిలీజ్ సమయంలో కూడా ఆపవచ్చు.   తను కావాలనుకొంటే కనీసం వంద మిలియన్ డాలర్ల నష్టపరిహారం కోసం కోర్టుకెళ్లవచ్చు. కానీ, పని కూడా చేయలేదు మార్క్.

జస్ట్ - సినిమా రిలీజ్ కి ముందు ఫేస్ బుక్ తరపున న్యూజెర్సీ లోని నెవార్క్ స్కూల్ సిస్టం కు వంద మిలియన్ డాలర్లు ఉదారంగా సహాయం చేశాడు మార్క్.   తను ఏంటో, తన వ్యక్తిత్వం ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశాడు. తన స్థాయిని హాలీవుడ్ సినిమానో, ఎల్లో టాబ్లాయిడ్ పత్రికలో పడగొట్టలేవని నిరూపించుకున్నాడుప్పుడు, మార్క్ వయస్సు కేవలం 26 సంవత్సరాలు!

కట్ చేస్తే -

మన దగ్గర ఏం జరుగుతోంది? సృజనాత్మక స్వాతంత్ర్యం ముసుగులో ఏదయినా వీడియో గానీ, సినిమా గానీ, మరేదయినా కళారూపంగానీఒక వ్యక్తినయినా, ఒక  ప్రాంతాన్నయినా, ఒక ఉద్యమాన్నయినా నిజంగా కించపర్చిందనుకొంటే - దాన్ని వ్యతిరేకించడానికి, నిరసన తెలపడానికి తెలివైన మార్గాలు, చట్టపరమైన మార్గాలు  చాలా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోకుండా, ఏవో చవకబారు పధ్ధతులద్వారా  ఏదో సాధించగలుగుతున్నాం అనుకోవటంలో అంత అర్థం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం.    

(ఇక్కడ - ఒక సినిమాలో - వందలాది మంది విద్యార్థులు జీవితాల బలిదానంతో, సీరియస్ గా కొనసాగుతున్న ఒక ఉద్యమాన్ని తక్కువచేసి కించపర్చటం అనే విషయాన్ని పక్కన పెడదాం. వివరంగా డిస్కస్ చేయాలంటే, ఇది ఇంకో పెద్ద బ్లాగ్ పోస్ట్ అవుతుంది!)

పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన టీవీ చానెళ్లు కూడా - తమకు వేయడానికి మరే ప్రోగ్రాములు లేక, ఏవో "ఫిల్లర్స్" వేస్తున్నట్లు - పొద్దున లేస్తే ఇదే నిరసనల సోదితో గంటలు గంటలుగా ప్రోగ్రాముల్ని లైవ్ గా నడిపించటం మరింత దారుణం.

లేదూ, మనం చేస్తున్నదే కరెక్ట్ అనుకొంటే మాత్రం - 1922 లో మన తెలుగువాడు ఆర్ యస్ ప్రకాష్ నిర్మించిన తొలి తెలుగు మూకీ సినిమా "భీష్మ ప్రతిజ్ఞ" నుంచి, ఇప్పటి "దేనికయినా రెడీ" వరకు - ప్రతి సినిమాకూ మళ్లీ ఒక రివ్యూ కమిటీ వేయటం చాలా చాలా అవసరం. ఎందుకంటే - అప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఒక్క సినిమానూ, ఏదో ఒక గొప్ప/చెత్త కారణంతో బ్యాన్ చేయవచ్చు. ఆయా దర్శక నిర్మాతలను (బ్రతికుంటే వారినీ, లేకపోతే వారి వారసుల్ని!) కటకటాల్లోకి నెట్టవచ్చుఅప్పుడింక సినిమా ఇండస్ట్రీ అనేదే ఉండకుండా పోతుంది. అంతా సుఖాంతం..

మరి - వాట్ నెక్స్ ట్? మనవాళ్లకి టైమ్ పాస్ ఎలా?? మన టీవీ చానెళ్లకి ఫుడ్ ఎలా దొరుకుతుందీ, పాయింట్స్ ఎలా వస్తాయి???  

డోంట్ వర్రీ .. సంవత్సరాలుగా సాగుతున్న సీరియళ్లున్నాయిగా! సీరియల్ ను పట్టుకున్నా చేతినిండా పనే!! 

2 comments:

 1. అసలు సమాజం పై సినిమా ప్రభావం చూపుతుందా? భావ వ్యక్తీకరణ స్వేఛ్ఛ, సృజనాత్మకత పేరుతో సినిమా సమాజాన్ని ఎంత ప్రభావితం చేస్తోందో, ఎవరు గమనించుకోవాలి? మంత్రిగారి వియంకుడు సినిమాలో కూడా సైకిలు చైను సన్నివేశాలు ఉన్నాయి.కానీ శివ వచ్చేవరకు సైకిలు చైను గొప్పదనం "అందరికీ" తెలియదనేది వాస్తవం. సమాజంలో వున్న వాస్తవాలను మాత్రమే సినిమాలో చూపిస్తున్నామనే వారందరూ ఒక విషయం గుర్తెరగాలి. సినిమాను చూసి మంచి ఎవరూ నేర్చుకోరనేది ఎంత వరకూ వాస్తవమో చెప్పలేను కానీ చెడు మాత్రం చాలా త్వరగా సమాజంలోకి చేరిపోతుందనేది తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిన నిజం.ప్రేమ విఫలమైతే తాగుబోతు కావాలని - దేవదాసు, ప్రేమ విఫలమైతే ఆత్మహత్య చేసుకోవాలని - మరోచరిత్ర, ప్రేమిస్తే గెలవాలి లేదా చావాలి అని సెకండ్ షోలో ఇడియట్ సినిమాలో ఒక పాటలో చూసి దాదాపు గంటన్నర సేపు రైల్వే ట్రాక్ పై కూర్చుని ఆలోచించి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఇలా చెప్పుకుంటూ పోతే శతకోటి.సమాజంలో ఎక్కడో ఒక పది శాతం ఉన్న చెడును గ్లోరిఫై చేసి చూపించి, దానికి బాగా ప్రచారం కల్పించి అదేమంటే సమాజంలో ఉన్నదే చూపిస్తున్నామనే వారందరూ మంచిని గ్లోరిఫై చేసి చూపిస్తే బాగుంటుందేమో ఆలోచించాలి. సరే ఇలా చాలా చెప్పాలేమో!!
  ప్రస్తుత విషయానికి వస్తే, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తీస్తున్నప్పుడు తెలంగాణా ఉద్యమాన్ని తెలుగు ఉద్యమంగా కావాలని తీయలేదంటే నమ్మగలమా? ఉద్యమంపై కావాలని తీసిన సినిమాగా ఒప్పుకోకపోగా, పొరపాటు జరిగిందనటం దారుణం కాదూ?
  సినిమా అంటే వినోదం అనే వారు, వాస్తవాలపై వినోదం ఏమిటో ఆలోచించాలి! సినిమాని కళగా అనుకోవాలంటే అసలు కళ అని దేనిని అంటారో? సమాజంలో రుగ్మతలని పోగొట్టేదా? రెచ్చగొట్టేదా??ప్రస్తుతం సినిమా కళగా కాకుండా వ్యాపారంగా మారిందనేది వాస్తవం. ఐతే ఎలాంటి వ్యాపారం? పాల వ్యాపారం లాంటిదా? వైన్ వ్యాపారం లాంటిదా? ఇది పాలనో, వైననో ఒప్పుకుంటే పర్వాలేదు. కానీ ఇప్పుడు జరిగేది పాల వ్యాపారం ముసుగులో వైన్ వ్యాపారం కాదూ???
  ముఖ్యమైన విషయం ఏమంటే రెండు విషయాలు పోల్చేటపుడు ఒక విషయం ముఖ్యంగా చూడాలి.రెండు ఒకే రకమైన వాటిని మాత్రమే ’కంపేర్’ చేయాలి. ఒక వ్యక్తి మీద సినిమా వ్యక్తికి మాత్రమే కదా నష్టమో, లాభమో....... కానీ ఒక వ్యవస్థ మీద సినిమా సమాజానికి కదా చేటో, ఇంకేదో చేసేది. ఈవ్ టీజింగ్ లు హీరోయిన్ ని టీజ్ చేస్తూ హీరో పాడే పాటల ప్రభావం కాదూ? యాదృఛికమేమో గానీ ఈ నా అభిప్రాయం టైప్ చేస్తుంటే జీ తెలుగులో శివ సినిమా వస్తోంది. రామాయణం తెలంగాణా యాసలో ఉత్తేజ్ పాత్ర చెప్తుంటే అందరూ నవ్వుతున్నారు.ఇప్పుడు ఇదే సీను తీస్తే తెలంగాణా వాదులు అభ్యంతరం చెప్తే అప్పుడు తీసిందే తీసామనటం తప్పు కాదూ?అప్పుడు ఆ సీను జస్ట్ సీన్ ... కానీ ఇప్పుడు తెలంగాణాను కామెడీ చేయటమేగా?బహుశ దేనికైనారెడీ కూడా అంతేనేమో నేను చూడలేదు కానీ ఆ భాషలో ఏమనలేదు.... ఎక్సెట్రాలన్నీ ట్రాష్..!!! మన సమాజాన్ని, ప్రస్తుత పరిస్థితులను బట్టి కదా ఏ విషయాన్నైనా చూడాలి.

  ReplyDelete
 2. "..ప్రస్తుతం సినిమా కళగా కాకుండా వ్యాపారంగా మారిందనేది వాస్తవం. ఐతే ఎలాంటి వ్యాపారం? పాల వ్యాపారం లాంటిదా? వైన్ వ్యాపారం లాంటిదా? ఇది పాలనో, వైననో ఒప్పుకుంటే పర్వాలేదు. కానీ ఇప్పుడు జరిగేది పాల వ్యాపారం ముసుగులో వైన్ వ్యాపారం కాదూ???.."
  ***
  100 శాతం వాస్తవం!

  ReplyDelete