Sunday 26 August 2012

నీటిమూటలు


సినీ ఫీల్డులో 'హామీలు' అనేవి చాలామటుకు వట్టి నీటిమూటలు. బై మిస్టేక్, ఎవరైనా అలా హామీలను నమ్మారు  అంటే .. అంతకంటె పెద్ద పొరపాటు ఇంకొకటి ఉండదు. జీవితాలే అల్లకల్లోలమైపోతాయి.

నాకు తెల్సిన ఒక దర్శకుడు ఏదో ఒక చిన్న చిత్రానికి తనే నిర్మాతగా కూడా మారాల్సివచ్చింది. అదే పెద్ద తప్పు. దాన్ని మించి ఇంకో పెద్ద తప్పు చేశాడు ఆ దర్శకుడు . తన దగ్గర అంతకు ముందు ఒక చిత్రానికి పనిచేసిన ఒక వ్యక్తిని స్నేహితునిగా మనసా వాచా నమ్మాడు. అతనికి ఏదో 'బాగా' తెలుసు అనుకున్నాడు. అదే అతను చేసిన పొరపాటు.

తప్పు, తను నమ్మిన ఆ అవతలి వ్యక్తిది కాదు. అసలు అలాంటి ఫూలిష్ నిర్ణయం తీసుకొన్న ఆ దర్శకునిది.

ఆ దర్శకుడు అంత పెద్ద తప్పుడు నిర్ణయం తీసుకోడానికి కారణం -  అవతలి వ్యక్తి ఇచ్చిన హామీలు! ఫీల్డు లోని 24 క్రాఫ్టుల్లో అతనిదో క్రాఫ్టు. ఈ క్రాఫ్టు వారికి, సాధారణంగా ప్రాజెక్టులో  ఎవడు ఎలా చచ్చినా వీరికి ఎలాంటి నష్టం ఉండదు. పర్సెంటేజి పధ్ధతిలో ఫుల్లుగా క్యాష్ ఫ్లో ఉండే విభాగం అన్నమాట. అయినా సరే అతన్ని ఒక మిత్రునిగా ఆ కొత్త దర్శకుడు బాగా నమ్మాడు. అవతలి వ్యక్తి ఇచ్చిన హామీలు అలాంటివి!

ఆ వందలాది హామీల్లో అతను ఒకే ఒక్క హామీని నమ్మాడు. అతనిచ్చిన ఆ హామీ సారాంశం క్లుప్తంగా ఇది:

"సార్! మీరు ఈ సిన్మాకి ఎంతయినా ఖర్చు పెట్టండి. సినిమా ఎలాగయినా తీయండి. ఆఖరికి ఒక అత్యంత చెత్త సినిమా తీసి, ఆ డబ్బా నా ముఖాన కొట్టినా సరే... మీరు ఈ సినిమాకి ఖర్చు పెట్టిన ప్రతి పైసా కూడా నా టాలెంట్ తో వెన్నక్కి తెస్తాను. అలా చెయలేని పక్షంలో - ఎట్ లీస్ట్ .. ఒక 50%  బడ్జెట్ అయినా నేను మీకు వచ్చేలా చేస్తాను. మీ డబ్బు ఎక్కడికీ పోదు..."

పాపం ఆ దర్శకుడు ఒక్కటే నమ్మాడు. ఒకవేళ  సినిమా కిందా మీదా అయినా కూడా ఈ వ్యక్తి కనీసం 50% వెనక్కి తెస్తాడు కదా అని!

ఆ సినిమాకి అయిన ప్రతి పైసా ఆ వ్యక్తి ద్వారానే ఖర్చు అయ్యింది. అతనికి డబ్బు ఇవ్వటమే తప్ప, ఏ రోజూ లెక్క అడగలేదు. క్రాస్ చెకింగ్ చేసుకోలేదు. అదీ ఆ దర్శకుని స్థాయి.

సినిమా పోయింది. (ఎలా పోయింది..ఎలా రిలీజ్ అయింది..ఆ స్టేజిలో ఎవరెవరు ఎలా లాభపడ్డారు.. ఇదంతా ఇంకొక ఎపిసోడ్ అవుతుంది!) ఒక్క పైసా వెనక్కి రాలేదు. అయినా ఆ దర్శకుడు యెప్పుడూ ఒక్క మాట ఆ వ్యక్తిని అనలేదు. కనీసం ఆ వ్యక్తి తనకు ఇచ్చిన హామీని కూడా ఎన్నడూ గుర్తు చేయలేదు. అతన్ని ఒక్క పైసా లెక్క అడగలేదు.

కానీ, ఆ వ్యక్తి మాత్రం తన బిల్డప్ కోసం ఇండస్ట్రీ అంతా ఒక విషయం బాగా ప్రచారం చేసుకున్నాడు. "నేను ఎంతో చెప్పాను. వినలేదు. కొత్తవాళ్లతో సినిమా తీస్తే ఏమవుతుందో తెలియదా? ఫ్రీగా పని చేశాను. నా టైం వేస్ట్ అయ్యింది. నా  స్వంత డబ్బు కూడా చాలా పెట్టాను. అదీ పోయింది. ఇంక ఎవడికీ చాకిరీ చెయ్యొద్దు! బాగా బుధ్ధి వచ్చింది!!" ...అని.

ఆ వ్యక్తి డబ్బు పెట్టాడో లేదో ఆ దేవునికి, అతనికి మాత్రమే తెలుసు. అతన్ని నమ్మి, అన్ని లక్షలు చేతుల్లో పోసిన ఆ దర్శక మిత్రునికి మాత్రం తనే అప్పు ఇవ్వగలిగే స్థాయికి ఎదిగాడు ఆ వ్యక్తి!

అయితే  - ఇక్కడ విషయం డబ్బు కాదు. మాటకు ఉండే విలువ. ఒక హామీ ఇచ్చాము  అంటే దాన్ని
నిలుపుకోగలగాలి. అలా సాధ్యం కానప్పుడు, ఆ వాస్తవం ఒప్పుకొనే నిజాయితీ ఉండాలి. ఆ రెండూ లేనప్పుడు -  అసలు హామీలు ఇవ్వకూడదు. తన స్వల్పకాలిక స్వార్థంకోసం ఏదో అలా ఇచ్చే 'హామీ' తనను నమ్మి అంత డబ్బు అప్పుగా తెచ్చి పెట్టిన ఆ దర్శకుని జీవితాన్ని ఎంత దారుణంగా దెబ్బతీస్తుందో ఆలోచించగలగాలి. ఆ మానవత్వం మనుషులకు అవసరం.

కానీ, దురదృష్టవశాత్తు సినీ ఫీల్డులో ఇలాంటి మనుషులే ఎక్కువ. అమాయక 'బకరా'లు ఇలాంటి వ్యక్తులనే మళ్లీ మళ్లీ నమ్ముతారు. వారిచ్చే కొత్త హామీలను కొత్తగా నమ్ముతారు. కొత్తగా మోసపోతారు.

ఇంతకూ ఈ ఎపిసోడ్ లో తప్పు ఎవరిది? మనస్పూర్తిగా అవతలి వ్యక్తిని నమ్మిన దర్శకునిదా, లేదంటే నమ్మించిన ఆ అవతలి వ్యక్తిదా??

తప్పు ఎవరిది అయినా - ఆ దర్శకుడు  మాత్రం ఆ సినిమా కోసం తను బయట తెచ్చిన అప్పులకు ఇంకా వడ్డీలు కడుతూనే ఉన్నాడు.

దటీజ్ సినిమా!

No comments:

Post a Comment