Friday 24 August 2012

జూదం

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం...

సినిమా ఒక అద్భుతమైన కళ నిజమే. కానీ ఇది ఒక వ్యాపారం. ఒక జూదం. కొంచెం అటూ ఇటూగా, మహాకవి శ్రీ శ్రీ ఇదే అన్నారు.  నా పుస్తకం 'సినిమా స్క్రిప్టు రచనా శిల్పం' లో దీన్ని ఎక్కడో 'కోట్' చేసినట్టు కూడా గుర్తు.

ముఖ్యంగా సినీ ఫీల్డు లో వున్నవాళ్లు - వున్నామని అనుకొనే వాళ్లు - ఇప్పటికి ఫీల్డులో లేకపోయినా, ముందు ముందు ఎలాగయినా సరే ఎంటరయి 'ఫీల్డులో వుండాలని' అనుకొనే వాళ్లు .. ఎవ్వరూ ఈ నిజాన్ని ఒప్పుకోరు. కానీ, వాస్తవం మాత్రం ఇదే.

ఒక నిర్మాత యాంగిల్లో చూసినా, ఆర్టిస్టుల కోణంలో చూసినా, టెక్నీషియన్స్ దృష్టిలో చూసినా ఇదే నిజం. సినిమా ఒక జూదం...

ఇక - సినిమాతో ఎలాంటి సంబంధంలేని బయటివారి కోణంలో చూస్తే  పరిస్థితి  అత్యంత దారుణం. దాదాపు 90 శాతం మంది దృష్టిలో సినిమా అనేది ఒక అంటరాని.. అసహ్యకరమయిన వస్తువు! సినిమాతో కొంచెమయినా లింకు వున్న 'సినిమా వాళ్లు'  అంటే 90 శాతం మందికి ఒక రకమయిన చెత్త అభిప్రాయం వుంటుంది. 'సినిమా వాళ్లని నమ్మొద్దు' అని ముఖం మీదే అనేస్తారు మాత్రం  మొహమాటం లేకుండా!

అయితే - 90 శాతం మందికికూడా  - టీవీ చానెల్ పెట్టినా సినిమాలే కావాలి. న్యూస్ పేపర్, మ్యాగజైన్ తిరగేసినా సినిమా వాళ్ల న్యూస్, సినీ హీరోయిన్ల బొమ్మలే కావాలి. అవి లేకుండా  వారి జీవితం జీవితం కాదు. వారు బ్రతకలేరు!!

అయితే - సినిమా మీదా, సినిమా వాళ్ల మీదా అభిప్రాయం ఇప్పటికిప్పుడు పుట్టిందికాదు. సినిమా పుట్టినప్పట్నించీ వుంది. 60 యేళ్ల కిందటే  ఒక అగ్రశ్రేణి నటుడు సినిమా హీరో అయిన పాపానికి నీకు  'పిల్లనివ్వం ఫో' అన్నారట! ఇప్పుయితే - 'సినిమా వాళ్లు' అయిన పాపానికి సింపుల్ గా 'ఇల్లు అద్దెకివ్వం ఫో' అంటున్నారు!! 
బయటవాళ్లు అనటం కాసేపు పక్కన పెడదాం. అసలు మనమే చాలా సందర్భాల్లో మన సినిమా నేపథ్యం చెప్పుకోడానికి ఇబ్బంది పడతాం.

అసలు ఎందుకని ఇలాఇదేమయినా 'ప్రొహిబిటెడ్' ప్రొఫెషనా? కాదు. మరి ఇలాంటి ఇబ్బందికరమయిన పరిస్థితి సినిమాకు, సినిమా వాళ్లకు ఎందుకు?? 

ఎందుకంటే ఇదొక జూదం కాబట్టి. ఇక్కడ దేనికీ గ్యారంటీ వుండదు కాబట్టి...

ఇండస్ట్రీకి వున్న ఒకే ఒక్క లక్షణం ...  ఇండస్ట్రీలోని ఎంతోమంది చేత ఎన్నో అబధ్ధాలు చెప్పిస్తుంది. ఎన్నో మేనిప్యులేషన్స్ చేయిస్తుంది. ఎన్నో మోసాలకు, వెన్నుపోట్లకు కారణమవుతుందిఎంతోమంది జీవితాలు, కుటుంబాలు రోడ్డునపడ్డానికి కారణమవుతుంది. ఇండస్ట్రీలో కష్టసుఖాలు పంచుకొంటూ, సహజీవనం చేయాల్సిన తోటి మనుషులను నిలువునా ముంచి - లేదా దారుణంగా  వంచించి  - అలా రోడ్డునపడేసేవాళ్లు, నాశనం చేసేవాళ్లూ కూడా సినిమా వాళ్లే కావడం అత్యంత దురదృష్టకరం!

కట్ టూ ఒక వాస్తవం -

ఎన్నో వ్యాపారాల్లాగే సినిమా కూడా ఒక మంచి వ్యాపారం. ఒక మంచి అవగాహనతో, ప్రణాళికతో, ఎలాంటి హెచ్చులకు పోకుండా సినిమాలో పెట్టుబడి పెట్టిన ఎవ్వరూ ఇంతవరకు నష్టపోలేదు.

మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మార్కెట్ అంచనాలకు మించి ఖర్చుపెట్టడం, ఇతర ఆకర్షణలకు లొంగిపోవటం, బానిసవ్వటం వంటివి మాత్రమే ఇక్కడ నష్టానికి దారితీస్తాయి. ఇవన్నీ బయటి ప్రపంచానికి తెలియవు.

మారిన లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు సినిమా బిజినెస్‌ని మరింత ఓపెన్ చేసేసింది. ఇప్పుడు ఎవ్వరయినా సినిమా తీయవచ్చు. ఏదీ ఇక్కడ ట్రేడ్ సీక్రెట్ కాదు. హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా - మార్కెట్ వాల్యూకి లోబడి ఖర్చుపెట్టిన ప్రతిపైసా నూటికి నూరు శాతం తిరిగివస్తుంది. దాన్ని మించి ఎన్నో రెట్లు లాభం కూడా వస్తుంది. అది ఎన్ని రెట్లు అన్నది ఆ సినిమా నడిచిన రేంజ్‌ను బట్టి ఉంటుంది.  

ఈ నిజాన్ని గుర్తించాయి కాబట్టే, ఇప్పుడు రిలయెన్స్ వంటి కార్పొరేట్ సంస్థలు కూడా ఎన్నో డైరెక్టుగా ఫీల్డులోకిదిగాయి! ఇప్పుడు సినిమా ఒక కార్పొరేట్ బిజినెస్.

No comments:

Post a Comment